Breaking News

12/08/2019

తగ్గిన గోదావరి ప్రవాహం

కాకినాడ, ఆగస్టు12 (way2newstv.com):
తూర్పుగోదావరి జిల్లా గ్రరూపం దాల్చిన గోదావరి తగ్గుముఖం పట్టింది. ఎగువన కురిసిన వర్షాలకు నది పోటెత్తడంతో పలు ప్రాంతాలు ముంపు బారినపడ్డాయి. దాదాపు 14 రోజుల పాటు ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్తు లేక అంధకారంలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆదివారం నాటికి గోదావరిలో ప్రవాహం క్రమంగా తగ్గడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. 
తగ్గిన గోదావరి ప్రవాహం

ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఇంకా వరద కష్టాలు పూర్తిగా తొలగిపోలేదు. కాజ్‌వేలపై ప్రవాహం తగ్గడంతో ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. లంకల్లో ఇళ్ల చుట్టూ చేరిన నీరు కిందకు దిగలేదు. దీంతో పలు లంక గ్రామాలకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించలేదు. దేవీపట్నం మండలంలో కూడా వరద తగ్గుముఖం పట్టినా నీరు గ్రామాల నుంచి పూర్తిగా బయటకు వెళ్లలేదు. ఆదివారం కూడా పునరావాస కేంద్రాలను కొనసాగించారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద గోదావరి 11 అడుగుల నీటిమట్టం ఉండగా 9.10లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం నాటికి ప్రవాహం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సోమవారం నుంచి మళ్లీ అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచన మేరకు రైతులు, లంక వాసులు ఆందోళన చెందుతున్నారు.

No comments:

Post a Comment