Breaking News

01/07/2019

అర్ధం కాని గంటా స్ట్రాటాజీ


విశాఖ, జూలై 1, (way2newstv.in)
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయం ఎవరికీ అర్ధం కాదు. ఆయన మాత్రం ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించేందుకే సర్వశక్తులు ఒడ్డుతారు. రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో గంటా వ్యూహాలు ఎపుడూ విఫలం కాలేదు. 2009లో ప్రజారాజ్యం ఓడిపోయినా ఆయన మాత్రం రెండేళ్ళు తిరగకుండా కాంగ్రెస్ లో ఆ పార్టీని కలిపేసి మంత్రి పదవి కొట్టేశారు. ప్రజారాజ్యం విలీనంలో గంటా పాత్ర చాలా ఎక్కువ అంటారు. సరిగ్గా పదేళ్ళ తరువాత ఇపుడు కూడా ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యే. మరి మరో రెండేళ్ళ తరువాత గంటా ఏ పొజిషన్లో ఉంటారో. ఇప్పుడు మాత్రం గంటా టీడీపీని పటిష్టం చేస్తామని చెబుతున్నారు. తాము ఆ పార్టీ తరఫున జనంలో పోరాడుతామని కూడా అంటున్నారు.ఇన్ని చెబుతున్న గంటా చేతల్లో మాత్రం తేడా కనిపిస్తోంది. 

అర్ధం కాని గంటా స్ట్రాటాజీ

తెలుగుదేశం పార్టీని ధిక్కరిస్తూ ఏకంగా అధినేత చంద్రబాబుకే ఝలక్ ఇస్తూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుతో గంటా శ్రీనివాసరావు భేటీ కావడం తాజాగా సంచలనం అయింది. ఈ ఇద్దరు గంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపారట. ఏం చర్చించి ఉంటారన్నది ఇపుడు అందరికీ పట్టుకున్న పెద్ద సందేహం. ఇదే త్రిమూర్తులు కాకినాడలో ముప్పయి మంది వరకూ కాపు కులానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కీలకమైన సమావేశం నిర్వహించి ఏపీ రాజకీయాల్లో అలజడి రేకెత్తించారు. చంద్రబాబు, లోకేష్ మీద ఈ సమావేశం గురిపెట్టిందని కూడా టాక్ వచ్చింది. ఇక బీజేపీలో చేరాలని కూడా చాలామంది నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అటువంటి త్రిమూర్తులు గంటా భేటీ అంటే సాధారణ వ్యవహారం కాదు.ఇక గంటా వెనక ఎవరు ఉన్నారన్నది కూడా చర్చగా ఉంది. చంద్రబాబే గంటా శ్రీనివాసరావు ను పురమాయించారని, అసమ్మతి కాపు నాయకులను బుజ్జగించి దారికి తేవాలని కోరారని ఓ న్యూస్ వినిపిస్తోంది. మరో వైపు బీజేపీ తరఫున గంటా రాయబేరాలకు ఇలా చర్చలకు తెర తీశారని అంటున్నారు. నిజానికి ఈ రెండింటిలో ఒకటి మాత్రం నిజం. బాబు తరఫున గంటా చర్చలు జరిపితే దానికి ఇంత చర్చ, రచ్చ ఉండనవసరం లేదు, బీజేపీ దూతగానే గంటా కాపు నాయకులకు గాలం వేస్తున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. ఏది ఏమైనా టీడీపీ కాపులు మాత్రం తొందరలోనే రాజకీయ సంచలనం నమోదు చేస్తారని అంటున్నారు.

No comments:

Post a Comment