Breaking News

01/07/2019

విదేశాలకు తరలిపోయిన నిజాం డబ్బు


పాకిస్తాన్, లండన్ కోర్టులలో వివాదం
హైద్రాబాద్, జూలై 1, (way2newstv.in)
నాటి నిజాం నవాబు సంపద విషయంలో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య వివాదం ఇంగ్లాండు కోర్టులో ఉంది. స్వాతంత్య్రం అనంతరం అనేక సంస్థానాలు భారత్‌లో విలీనమైనా హైదరాబాద్‌ను పాలిస్తున్న నిజాం నవాబు మాత్రం కలవడానికి నిరాకరించాడు. దీంతో 1948లో సైనిక చర్య ద్వారా హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనమైంది. ఈ సమయంలో లండన్‌లో నాటి పాకిస్తాన్ దౌత్యవేత్త హబీబ్ ఇబ్రహీం రహీమ్‌తులా ఖాతాకు నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1 మిలియన్ పౌండ్లును బదిలీ చేశాడు. రహీమ్ తులా దీనిని నాట్‌వెస్ట్ బ్యాంకులో డిపాజిట్ చేశాడు. అప్పటి నుంచి ఈ నగదు కోసం దాయాదులు దేశాలు పోరాడుతూనే ఉన్నాయి. అయితే, నిజాం నవాబు పంపింది 1 మిలియన్ పౌండ్లు కాదని, మూడున్నర మిలియన్ పౌండ్లని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ మొత్తం లండన్, పాకిస్థాన్‌లోని కరాచీకి చేరినట్టు అందులో ఉంది. నాటి పత్రాల ప్రకారం.. పాక్ హైకమిషనర్ హబీబ్ ఇబ్రహీం పేరుతో డిపాజిట్ చేసి, కొంత మొత్తం ఆయుధాలు సరఫరా చేసినవారికి చెల్లించినట్టు తెలుస్తోంది. 

విదేశాలకు తరలిపోయిన నిజాం  డబ్బు

అయితే, రాజు అనుమతి లేకుండా నిజాం ఆర్థిక మంత్రి, లండన్‌లోని ఏజెంట్ జనరల్ నవాబ్ మెయిన్ నవాజ్ జంగ్ దీనిని తరలించి, దుర్వినియోగం చేసినట్టు వెల్లడవుతోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మీర్ ఉస్మాన్ అలీఖాన్.. విచారణకు ఆదేశించి దానిని తక్షణమే వెనక్కు తేవాలని హుకుం జారీచేశారు. 3.5 మిలియన్ పౌండ్లతోపాటు మరో రూ.6 కోట్ల కూడా లండన్ కరాచీలకు తరలించినట్టు, ఈ నిర్ణయం వెనుక హైదరాబాద్ ప్రధాన మంత్రి లైక్ అలీ ఉన్నట్టు అవగతమవుతోంది. ఈ సొమ్మును నిజాం నవాబు భజన బృందాలు, ఆయుధాలు డీలర్లు, సైనిక చర్యకు సిద్ధమైన భారత సైన్యంపై చార్మినార్ వద్ద జనపర సంచుల్లో చుట్టిన ఆయుధాలను జారవిడిచిన సిడ్నీ కాటన్‌కు పంచిపెట్టగా, కొంత మొత్తాన్ని తరుచూ విదేశాల్లోని కొందరు జర్నలిస్ట్‌లకు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. పాక్ హైకమిషనర్‌కు ఒక మిలియన్ పౌండ్లను చేరవేయడంలో మెయిన్ నవాబ్ జంగ్ కీలకంగా వ్యవహరించాడు. అయితే మిగతా 2.5 మిలియన్ పౌండ్ల ఖర్చుల వివరాలపై ఎలాంటి ఆధారాలు లేవు. అయితే, 1948 సెప్టెంబరు నాటి మీడియా పరిశోధన నివేదికలో మాత్రం ఆయుధ వ్యాపారి హెన్రీ సిడ్నీ కాటన్ లక్ష పౌండ్లు, సోహ్రిబ్ అనే పాక్ ఉన్నతాధికారికి 89,000 పౌండ్లు చెల్లించినట్టు తేలింది. ఇక, హైదరాబాద్‌కు ప్రత్యక్ష సముద్ర మార్గం ఉండాలన్న ఆలోచనతో గోవా కోసం సర్ అలెగ్జాండర్ రోజర్స్‌కు లక్ష పౌండు చెల్లించారు. అలాగే పాక్ ఆర్థిక మంత్రి గులామ్ మహ్మద్ 25,000 పౌండ్లు చెల్లించినట్టు తెలిపినా, ఎందుకు ఇచ్చారో పేర్కొనలేదు. నిజాం నవాబు విదేశాంగ కార్యదర్శి, ఐరాసలో హైదరాబాద్ రాజ్య ప్రతినిధి జహీర్ అహ్మద్‌కు 45,000 పౌండ్లు ఇచ్చినట్టు వెల్లడయ్యింది. కాగా, నాట్‌వెస్ట్ బ్యాంకులో పాక్ హైకమిషనర్ పేరుతో డిపాజిట్ చేసిన సొమ్ము ఇప్పుడు రూ.307 కోట్లకు చేరింది. దశాబ్దాలుగా బ్యాంకులో మూలుగుతోన్న నిజాం సంపద తమదంటే తమదేనని భారత్‌, పాకిస్థాన్‌ ప్రభుత్వాలు కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాదు రాజ్యం భారత్‌లో విలీనం అవుతున్న సమయంలో దీని అభివృద్ధికి ఉస్మాన్ అలీఖాన్ ఆ డబ్బులు ఇచ్చారు కాబట్టి అవి మాకే చెందుతాయని నిజాం వారసులు ముఫ్ఖంజా సైతం కోర్టుకు విన్నవించారు. ఇదిలా ఉండగా 70 ఏళ్ల పాటు ఆ డబ్బు నిజమైన వారసులకు దక్కకుండా పాక్ అడ్డుపడిందని భారత్‌ తరపున వాదించిన లాయర్ పాల్ హెవిట్ తెలిపారు. 1967 ఏడో నిజాం మృతి చెందారని, అంతకు రెండేళ్ల ముందే అంటే 1965లో ఆ డబ్బులు భారత్‌కు చెందాలంటూ ఓ వీలునామాను రాశారని పాల్ హెవిట్ చెబుతున్నారు. హైదరాబాదు రాజ్యంను భారత్‌లో విలీనం చేయాలనుకున్న సమయంలో నిజాం రాజుకు ఆణాయుధాలు ఇచ్చి సహకరించినట్టు పాక్ వాదిస్తోంది. అయితే ఆ వాదనలో నిజం లేదని నిజాం తరపున వాదించిన పాల్ హెవిట్ తెలిపారు. ఇక 1948లో నిజాం రాజు తన రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేయాలనుకున్న సమయంలో డబ్బులను తిరిగి ఇచ్చేయాలని కోరారు. అయితే అప్పటికే దీనిపై హక్కు పాక్ హైకమిషనర్‌ హబీబ్ ఇబ్రహీం రహీమ్‌తుల్లాకు ఉండటంతో నాట్ వెస్ట్ బ్యాంకు ఈ డబ్బును నిలిపివేసింది. ఈ డబ్బుకు సంబంధించి నిజమైన హక్కుదారుడు ఎవరో తేలాకే చెల్లిస్తామని బ్యాంకు చెప్పుకొచ్చింది. ఇక అప్పటి నుంచి ఈ వ్యవహారం కోర్టుల చుట్టూ తిరుగుతోంది. మరి కొద్ది రోజుల్లో ఈ సంపదకు అసలైన వారసుడెవరో ఇంగ్లాండ్ వేల్స్ హైకోర్టు ఓ చారిత్రాత్మక తీర్పును ఇవ్వనుంది. 

No comments:

Post a Comment