Breaking News

15/07/2019

గంట కామ్ వెనుక రీజనేంటీ

విశాఖపట్టణం,జూలై 15, (way2newstv.in)
ఏపీ అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. సభలో టీడీపీ సభ్యుల సంఖ్య తక్కువే అయినా... అధికార వైసీపీతో ఆ పార్టీ శాసనసభాపక్షం ఢీ అంటే ఢీ అనేలా పోరాడుతోంది. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాధవనాయుడు సహా పలువురు ఎమ్మెల్యే అధికార వైసీపీకి కౌంటర్ ఇచ్చే విషయంలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు సైలెంట్‌గా ఉండటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
గంట కామ్ వెనుక రీజనేంటీ

విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు... కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని బీజేపీలోకి వెళతారని కొద్దిరోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీ మారబోనని గంటా శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. ఇంతవరకు ఓకే కానీ... హోరాహోరీగా సాగుతున్న అసెంబ్లీ సమావేశంలో గంటా శ్రీనివాసరావు సైలెంట్‌గా ఉండటం ఏంటని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. సీనియర్ నాయకుడిగా, మాజీమంత్రిగా అధికారపక్షం రాజకీయదాడిని ఎదుర్కోవాల్సిన మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు... తనకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం టీడీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. అయితే గంటా శ్రీనివాసరావు మొదటి నుంచి తన ప్రసంగాల్లో దూకుడుగా వెళ్లిన వ్యక్తి కాదు అని... అందుకే అసెంబ్లీలో ఆయన వాయిస్ అంతగా వినిపించడం లేదని మరికొందరు చెబుతున్నారు. మొత్తానికి ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పార్టీ మారతారనే ప్రచారాన్ని ఎదుర్కొంటున్న గంటా శ్రీనివాసరావు... అసెంబ్లీలో టీడీపీ తరపున తన వాయిస్ వినిపిస్తారేమో చూడాలి. 

No comments:

Post a Comment