Breaking News

29/07/2019

ఇంకా మారని బాబు వైఖరి

విజయవాడ, జూలై 29, (way2newstv.in - Swamy Naidu)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఇంకా తెలిసిరావడం లేదు. పార్టీ ఘోర ఓటమికి జగన్ పై తాను చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మకపోవడానికి గల కారణాలను ఇంకా పసిగట్టలేకపోతున్నట్లుంది. ఇంకా పులివెందుల పంచాయతీ అంటూ జగన్ పై రౌడీయిజం ముద్రవేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ పై చంద్రబాబు నాయుడు అనేక ఆరోపణలు చేశారు. ఆయన చేసిన వాటిల్లో ప్రధానమైనది రౌడీయిజం.జగన్ అధికారంలోకి వస్తే ఇళ్లల్లో నుంచి కూడా పిల్లలను లాక్కుపోతారని, మీ ఆస్తులను కడప జిల్లా నుంచి కబ్జా చేస్తారని ఆరోపించారు. అంతకు ముందు ఎన్నికల్లో జగన్ లక్ష కోట్ల అవినీతిపరుడని చంద్రబాబునాయుడు బాగానే ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో జగన్ వస్తే రౌడీ రాజ్యం ఏర్పడుతుందని పదే పదే చెప్పారు. 
ఇంకా మారని బాబు వైఖరి

శాంతిభద్రతల సమస్య ను తన ప్రచార సభల్లో పదే పదే ప్రస్తావించారు.అంతేకాదు విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ పై జరిగిన దాడి కేసును కూడా చంద్రబాబునాయుడు సీరియస్ గా తీసుకోలేదు. కోడికత్తి డ్రామాగా అభివర్ణించారు. ఇక ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకా హత్య కేసును కూడా చంద్రబాబునాయుడు తన ప్రచారంలో బాగానే వాడుకున్నారు. వైఎస్ వివేకాను హత్య చేసింది కుటుంబ సభ్యులే అన్న రీతిలో పరోక్షంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చివరకు జగన్ పై చంద్రబాబునాయుడు చేసిన ఈ ఆరోపణలను ప్రజలు పట్టించుకోకుండా ప్రాంతాలకు అతీతంగా జగన్ వైపు నిలిచారు.ఇంత తెలిసినా చంద్రబాబునాయుడులో మార్పు రాలేదంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తనకుమైకు ఇవ్వలేదంటూ వరుసగా మీడియా సమావేశాలు పెడుతున్న చంద్రబాబు నాయుడు జగన్ ను పదే పదే రౌడీగా అభివర్ణిస్తున్నారు. పులివెందుల పంచాయతీ అంటూ మళ్లీ మొదటికొచ్చారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి రెండు నెలలు గడవకముందే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పాత పాటను అందుకున్నారు. మరి చంద్రబాబు తాను ఎన్నికలకు ముందు జగన్ పై చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మకపోయినా దానినే పట్టుకుని వేలాడుతున్నారన్న వ్యాఖ్యలు పార్టీలోనే వినపడుతున్నాయి.

No comments:

Post a Comment