Breaking News

30/07/2019

లక్ష్మీపూర్‌

శ్రీలక్ష్మీవేంకటేశ్వర ఆలయంలో రోజూ హరితహారమే
కరీంనగర్, జూలై 30, (way2newstv.in)
ఆ గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలంటే, ఆలయ పరిసరాల్లో ఓ మొక్క నాటాల్సిందే. పూజకు తీసుకువచ్చే తాంబూలంలో కొబ్బరికాయకు బదులు ఓ మొక్క పెట్టుకురావాల్సిందే.కొబ్బరికాయ కొడితే మనలోని అహంకారం దూరమవుతుందని పెద్దలు చెబుతుంటే.. ఆ దేవాలయ కమిటీ మాత్రం కొబ్బరికాయకు బదులు ఓ మొక్క నాటితే మనసుకు ప్రశాంతత చేకూరుతుందని చెబుతుంది. దీంతో, దేవాలయానికి వచ్చే భక్తులు ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటుతున్నారు. ఫలితంగా ఆలయ పరిసరాలంతా పచ్చని చెట్లతో కళకళలాడుతూ ప్రకృతి ఆనందం పరవశిస్తోంది. ఆ దేవాలయమే జగిత్యాల జిల్లా కేంద్రానికి 5 కి.మీ దూరంలో ఉన్న లక్ష్మీపూర్‌ శ్రీలక్ష్మీవేంకటేశ్వర ఆలయం.
లక్ష్మీపూర్‌ 

లక్ష్మీపూర్‌ గ్రామస్తులు ప్రభుత్వ సహాయం లేకుండా 2005లో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దాదాపు రూ.20 లక్షల వ్యయంతో ఆధునిక హంగులతో నిర్మించుకున్నారు. ఆలయంలో జరిగే రోజువారీ పూజా కార్యక్రమాల కోసం చందాలు పోగు చేసి రూ.12 లక్షలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. దీని ద్వారా ఏటా వచ్చే వడ్డీతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఏటా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర కల్యాణం వైభవంగా జరిపిస్తున్నారు.కార్యక్రమంలో భక్తులు అన్నదానంతోపాటు, మరో రూ.2 లక్షల వరకు స్వామివారి కల్యాణానికి కానుకలుగా వస్తుంటాయి. ఆలయ కమిటీని రెండేళ్లకోమారు అన్నికులాల నుంచి ఎన్నుకుంటారు. ఆలయ కమిటీ ప్రతీ శనివారం ఆలయ ఆవరణలో భజన చేయడమే కాకుండా, దేవాలయ అభివృద్ధిపై చర్చిస్తారు. ఈ కమిటీ సమావేశానికి ఒక్క నిమిషం ఆలస్యమైన రూ 100 జరిమానా విధించుకుని, ఆ జరిమానాను సైతం దేవుడి హుండీలో వేస్తుండటం విశేషం.ఆ దేవాలయానికి వచ్చిన భక్తుల్లో కొందరు ఉదయం, సాయంత్రం వేళల్లో పచ్చని చెట్ల మధ్య యోగాతో పాటు ధ్యానం చేస్తుంటారు. ఓ వైపు గుట్టపైన ఉండటం, మరో వైపు చల్లని గాలులు వీస్తుండటంతో, రక రకాల దీక్షలు తీసుకునే స్వాములు సైతం ఇక్కడే సేద తీరుతుంటారు. గుట్ట చుట్టూ పచ్చని పొలాలు, పంటలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. అందుకే దేవాలయానికి వచ్చే భక్తులు ఒక్క మొక్క నాటితే, ప్రతీసారి దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడి కంటే ముందు తను నాటిన మొక్కనే ఎలా ఉందో చూసుకుంటున్నారని దేవాలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.రిటైర్డ్‌ వ్యవసాయ విస్తీరణాదికారి, దేవాలయ పూజారి అయిన కూర్మాచలం రంగాచార్యులు ప్రోద్బలంతో దేవాలయ కమిటీ ఆలయ పరిసరాల్లో పచ్చదనానికి కృషి చేస్తుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హారితహారంతో సంబంధం లేకుండా, ప్రతి ఏటా ఆలయం పరిసరాల్లో కనీసం 200–300 రకాల మొక్కలు నాటుతుంటారు.దీనివల్ల దేవాలయమంతా మామిడి, జామ, ఉసిరి, మేడిచెట్టు, అల్లనేరడి, పత్రి పండు, మారేడుకాయ వంటి పండ్లు, గులాబీ, చేమంతి, మల్లె, మందారం వంటి పూలతోపాటు, వేప, టేకు వంటి నీడనీచ్చె చెట్లు అలంకరణ మొక్కలు కూడా భక్తులకు కనువిందు చేస్తుంటాయి. చెట్లు ఎండిపోకుండా డ్రిప్‌తో నీటి సౌకర్యం కూడా కల్పించారు.

No comments:

Post a Comment