Breaking News

30/07/2019

50 కోట్లతో బాసరకు మాస్టర్ ప్లాన్

అదిలాబాద్, జూలై  30, (way2newstv.in)
ఆదిలాబాద్ జిల్లాలో బాసర పుణ్యక్షేత్రం అభివృద్ధికి ముందుగా రూ.50 కోట్లు మంజూరు చేస్తామని ఆదిలాబాద్ బహిరంగ సభలో ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.50కోట్లు మంజూరు చేస్తూ.. ప్రభుత్వం జీవో జారీ చేసింది. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంతో పాటు పుణ్యక్షేత్రంలో మార్పులు, చేర్పులు చేయడం, వాస్తు ప్రకారం నిర్మించేందుకుగాను స్తపతి వల్లి నాయగాం గతంలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇక ఇంజినీరింగ్ పనులకు సంబంధించి ఎఫ్‌హెచ్‌డీ కనస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇటీవల పరిశీలించి.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50కోట్లతో ఆలయ అభివృద్ధి, మార్పులు, చేర్పులతో ఇతర నిర్మాణాలు, పనులు చేపట్టనున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కొరటా వద్ద గల ఓంకారేశ్వర శివాలయం ఆలయ అభివృద్ధికి రూ.25లక్షలు మంజూరు చేస్తూ.. ఇదే ఉత్తర్వుల్లో వెల్లడించారు.
50 కోట్లతో బాసరకు మాస్టర్ ప్లాన్

ప్రధాన ఆలయంలోని ఆలయ ప్రాకారం, తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నాలుగు దిక్కులా రాజగోపురాల నిర్మాణం, ప్రస్తుతం కోనేరు ఆగ్నేయ దిశలో ఉండగా.. ఈశాన్య భాగంలో నిర్మించనున్నారు. ఆలయ పర్యవేక్షణాధికారి కార్యాలయాన్ని తొలగించి.. వేరే స్థలంలో నిర్మిస్తారు. కొత్తగా 100గదుల నిర్మాణంతో పాటు 10వేల మంది భక్తులకు సరిపడే విధంగా ప్రత్యేక క్యూ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. తాగునీటి వ్యవస్థ మెరుగు పర్చేందుకు కొత్తగా సంపులు, ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేస్తారు. ప్రసాదం తయారీ కోసం అధునాతన వంటశాల, యాగశాల నిర్మాణం చేస్తారు. అక్షరాభ్యాస మండపాన్ని పొడగించేలా అదనపు నిర్మాణాలు చేయనున్నారు. ప్రస్తుతం దేవాలయ ఆవరణలో వివిద దేవాలయాలు, పుణ్యక్షేత్రాలకు సంబంధించిన అతిథి గృహాలున్నాయి. వీటి మొదటి అంతస్తులో కొత్త గదుల నిర్మాణానికి అనుమతించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో వేచి ఉండేందుకు పది ప్రత్యేక షెడ్లు నిర్మిస్తారు. గోదావరి తీరాన భక్తులు స్నానాలు చేసినప్పుడు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా ప్రత్యేక షెడ్లు, హారతి కార్యక్రమం కోసం మరికొన్ని షెడ్లు, ఆలయ ప్రాంగణంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం చేస్తారు. వాహనాల పార్కింగ్‌కు వీలుగా సువిశాలమైన స్థలం కేటాయిస్తారు. సెక్యూరిటీ సిస్టం గది నిర్మాణం చేస్తారు. రెండు కొత్త 125కేవీ సామర్థ్యం గల జనరేటర్ల కొనుగోలు చేయనున్నారు. బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు, ఇతర నిర్మాణాలకు రూ.50కోట్లు, జైనథ్ మండలం కొరటాలోని ఓంకారేశ్వర శివాలయం (ఉత్తరవాహిని) ఆలయ అభివృద్ధికి రూ.25లక్షలు మంజూరు చేశారు.బాసర ఆలయ అభివృద్ధి, విస్తరణకు త్వరలో బృహత్తర ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) రూపొందించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. బాసర ఆలయ అభివృద్ధి నమూనా విషయంలో సీఎం కేసీఆర్ ఆగమ శాస్త్ర పండితుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారన్నారు. తుది డిజైన్ ఖరారు చేశాక.. టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని మంత్రి అల్లోల వెల్లడించారు. క్యూ కాంప్లెక్స్, ఆలయ విస్తరణ, ప్రాకార మండపం విస్తరణ, అక్షరాభ్యాస మండపం, ప్రసాదాల తయారీ గదులతో పాటు ఇతర అభివృద్ధి పనులు, నిర్మాణాలను చేపట్టేందుకు ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment