Breaking News

30/07/2019

యదేఛ్చగా కల్తీలు... నిద్రపోతున్న నిఘా

కరీంనగరం, జూలై 30, (way2newstv.in)
కరీంనగర్ జిల్లాలో నకిలీ, నాసిరకం వస్తువుల జోరు పెరిగింది. కొందరు వ్యాపారులు ఈ దందాను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. అడిగేవారు లేరని... చూసే వారు రారని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫలితంగా వారు అనారోగ్యాల బారిన పడుతున్నారు. అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఆహార తనిఖీ విభాగం నామమాత్రంగా ఉంటోంది. తనిఖీలు, దాడులు చేద్దామన్నా.. సిబ్బంది లేరు. అన్నీ ఒకే ఉద్యోగి చూసుకుంటున్నారు.తనిఖీలు లేవు..భూపాలపల్లి, ములుగు, కాటారం, ఏటూరునాగారం, కాళేశ్వరం ప్రాంతాల్లో ఎక్కువగా హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు సందర్శకులు, పర్యాటకులు నిత్యం వచ్చి వెళ్తుంటారు. కొన్ని హోటళ్లలో ఏమాత్రం శుభ్రత పాటించడం లేదు. ఈగలు, దోమలు ముసురుతున్నాయి. 
యదేఛ్చగా కల్తీలు... నిద్రపోతున్న నిఘా

వంటశాలలు అధ్వానంగా ఉంటున్నాయి. వినియోగించిన నూనెలను తిరిగి వాడుతున్నారు. రాత్రి మిగిలిన పదార్థాలను ఉదయం వేడి చేసి పెడుతున్నారు. కనీస ప్రమాణాలు పాటించడటం లేదు. జిల్లా ఏర్పాటై 19 నెలలైంది.  అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆహార తనిఖీలకు సంబంధించి కేవలం ఒకే కేసు నమోదైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదీ కాలం ముగిసిన ఉప్పు వినియోగిస్తున్నారని కాళేశ్వరంలో కేసు పెట్టారు. నిబంధనల ప్రకారం ప్రతి నెలా ఒక ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ విధిగా 12 నమూనాలు సేకరించాలి. జిల్లాలో నమూనాలు సేకరించే స్థాయి గల అధికారే లేరు. దీంతో కల్తీ  జరుగుతున్నా.. వాటి నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించలేకపోతున్నారు.జిల్లాల విభజన సమయంలో జూనియర్‌ అసిస్టెంట్‌తో ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఉండేందుకు సౌకర్యాలు గానీ, తగిన సిబ్బందిని గానీ నియమించడం మరిచారు. జిల్లాలో ఏడు లక్షల జనాభా ఉంది. ఒక జిల్లా ఆహార కల్తీ నియంత్రణాధికారి, ఒక ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఒక క్లర్కు, ముగ్గురు సహాయక సిబ్బంది ఉండాలి. మహబూబాబాద్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ను భూపాలపల్లికి ఇన్‌ఛార్జిగా నియమించారు. ఆయన వీలున్నప్పుడు వస్తున్నారు. దీనివల్ల ప్రయోజనం ఉండడం లేదుజిల్లా వ్యాప్తంగా ఆహార కల్తీ నియంత్రణ శాఖ నుంచి అనుమతులు తీసుకున్న వ్యాపారులు కేవలం 400 వరకు మాత్రమే ఉన్నారు. తీసుకోని వారు వేల సంఖ్యలో ఉంటారు. సరైన సిబ్బందిని నియమించి తరచూ తనిఖీలు నిర్వహిస్తే వీరందరి ఆట కట్టించొచ్చు. కానీ ఉన్నతాధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదు. ఇప్పటికైనా    ప్రజారోగ్యానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉంది.

No comments:

Post a Comment