Breaking News

08/07/2019

అయోమయంలో గుత్తా


నల్గొండ, జూలై 8, (way2newstv.in)
గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ పేరు అందరికీ సుపరిచితమే. సుదీర్ఘ రాజకీయ అనుభవం, క్షేత్రస్థాయిలో బలమైన అనుచరగణం. పలుమార్లు నల్గొండ ఎంపీగా సేవలు. ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. అయితే ఈ హోదా ఆయనకు అంతగా సంతృప్తి ఇవ్వడంలేదని, తాను ఆశిస్తున్నది లభించడంలేదన్న అసంతృప్తిని అనుచరుల వద్ద చెప్పుకొస్తున్నారని చర్చ జరుగుతోంది. లాంగ్‌ పొలిటికల్‌ లైఫ్‌లో ఎన్నో పదవులు పొందిన ‌గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేగా,మంత్రిగా ఒక్కసారైనా పనిచేయాలన్నది ఒకే ఒక్క ఆకాంక్షగా అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారట. టీఆర్ఎస్‌లో చేరినా, అదంతా కలగానే మిగిలిపోతోందని బాధపడుతున్నారట గుత్తా. గతంలో నల్గొండ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, టిఆర్ఎస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తపించారు. కానీ సిట్టింగ్‌లు, సమీకరణల నేపథ్యంలో గులాబీ అధిష్టానం మాత్రం నో చెప్పింది. 

అయోమయంలో గుత్తా

చివరకు హుజుర్ నగర్ నుంచి, ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటి చేయించాలని అధిష్టానం నిర్ణయించినా, గుత్తా మాత్రం విముఖత వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే సాధ్యపడలేదు. ఎమ్మెల్యే కావాలన్న ఆశ ఆగిపోయింది. చివరకు నల్గొండ ఎంపీగా తిరిగి పోటీ చేయాలనుకున్నా, ఆర్థికంగా తానంత భరించలేనని, గుత్తా సుఖేందర్‌ రెడ్డి టిఆర్ఎస్ అధినేతకు వెల్లడించినట్లు సమాచారం. గుత్తా సుఖేందర్ రెడ్డి స్థానంలో టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి నర్సింహ్మా రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఎంపీ‌ ఎన్నికల ప్రచారంలో‌ భాగంగా మిర్యాలగూడ సభలో సిఎం కేసీఆర్ స్వయంగా, గుత్తా సుఖేందర్ రెడ్డికి త్వరలోనే మంచి పదవి వస్తుందని‌ బహిరంగంగా ప్రకటించారు. ఇక‌ అప్పటి నుంచి ‌మంచి పదవి ఎపుడా అని ఎదురుచూస్తున్నారు సుఖేందర్ రెడ్డి. సిఎం కేసీఆర్, సుఖేందర్ రెడ్డికి‌ ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగింది. గవర్నర్ కోటా అని ఒకసారి, ఎమ్మెల్యేల‌ కోటా అని మరోసారి ప్రచారం జరిగింది. ఈ రెండింటిలో గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం రాలేదు. ఇపుడు ఎమ్మెల్సీ వచ్చే అవకాశాల్లేవు కనపడ్డంలేదు. మంత్రి పదవి వస్తుందని గుత్తా వర్గం విస్తృతంగా ప్రచారం చేసింది. మంత్రి పదవి రావాలంటే ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ గాని అయ్యిండాలి. కానీ ఎమ్మెల్యే అవకాశం ఏ మాత్రం కానరావడం లేదు. ఇక‌ ఎమ్మెల్సీ అవకాశాలు కష్టంగానే కనిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ నుంచి మంత్రిగా జగదీష్ రెడ్డి ఉన్నారు. గత ఐదేళ్లలోను జగదీష్ రెడ్డే మంత్రి. జిల్లాలో ఇద్దరికి ఇవ్వాలనే నిర్ణయం జరిగితే, గుత్తా ఆకాంక్ష నెరవేరే ఛాన్సుంది. కానీ ముందు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఆ తర్వాత ‌మంత్రి‌పదవి కట్టాబెట్టాలి. ఒకవేళ కేబినెట్‌లో మొదటస్థానం కట్టబెట్టి, ఆ తర్వాతైన ఎమ్మెల్సీనో, ఎమ్మెల్యేనో చేసే వెసులుబాటు రాజ్యాంగంలో ఉంది. ప్రస్తుత ‌రాజకీయ సమీకరణల నేపథ్యంలో, ఇదంతా జరిగే పనేనా అంటూ అనుచరుల్లో ఆందోళన మొదలైంది. మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ‌భాస్కర రావు, దేవరకొండ సిపిఐ ఎమ్మెల్యే ‌రవీంద్ర కుమార్ నాయక్‌లు, గుత్తాతో పాటు టిఆర్ఎస్‌లో చేరారు. కానీ‌ వారిద్దరు‌ కూడా‌ జిల్లాలో గుత్తా‌ సుఖేందర్ రెడ్డి వర్గంగానే ముద్రపడ్డారు. కానీ భాస్కరరావు, రవీంద్ర నాయక్‌లు ఇద్దరూ తిరిగి ఎమ్మెల్యేలుగా‌ గెలుపొందారు. కానీ‌ ఆ ఇద్దరికీ గురువుగా ఉన్న సుఖేందర్ రెడ్డి‌కి‌ మాత్రం‌ సరైన‌ గుర్తింపు లేదని‌ అంటున్నారు. కేవలం రైతు సమన్వయ సమితి పదవితోనే నెట్టుకు రావాల్సిన వస్తోందని, ఆ‌పదవికి రాజకీయంగా పూర్తి అధికారాలు లేకపోవడం కూడా గుత్తా వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తోందన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి మంత్రి కావాలన్న గుత్తా కోరిక మాత్రం, రోజురోజుకు దూరం జరుగుతూనే ఉంది. సిఎం‌ కేసీఆర్ నోట వచ్చిన‌ పెద్ద పదవి ఎపుడా అని, ఎదురుచూడ్డం తప్ప, చేసేదేమీలేదని ఆయన అనుచరులే మాట్లాడుకుంటున్నారు.

No comments:

Post a Comment