Breaking News

06/07/2019

అడవికి రక్షణేదీ..? (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, జూలై 6 (way2newstv.in): 
అడవుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టింది. గతంలో ఎన్నడూలేని విధంగా దాడులు నిర్వహించిన అటవీశాఖ కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపింది. దీంతో కలప అక్రమ రవాణాకు బ్రేకులు పడ్డాయి. ఒకడుగు ముందుకేసి ప్రతి అటవీ రేంజికి ఓ విశ్రాంత జవాను సేవలను సైతం వినియోగించుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత అటవీశాఖను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తుంది. అదనపు బాధ్యతలతో ఉన్న సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు.
అడవికి రక్షణేదీ..? (ఆదిలాబాద్)


నిర్మల్‌ జిల్లాలో వందకు పైగా అటవీ బీట్‌ అధికారుల నియామకం కోసం పరీక్షలు నిర్వహించి ఫలితాలను సైతం ప్రకటించారు. నెలలు గడుస్తున్నా అటవీరక్షకులు (ఎఫ్‌బీవో)లకు నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. అడవుల రక్షణ కూడా భారంగా మారింది. జిల్లాలో అటవీ బీట్‌ అధికారుల ఖాళీల కొరత వేధిస్తోంది. జిల్లాలో 150 మందికి కనీసం మూడు పదుల సంఖ్యలో కూడా ఎఫ్‌బీవోలు లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎఫ్‌బీవోల నియామకానికి పరీక్షలు నిర్వహించి ఫలితాలను సైతం ప్రకటించారు. ఆరునెలలు గడిచినా ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఉన్న ఎఫ్‌ఎస్‌వోలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఉద్యోగాలకు ఎంపికైన వారు సైతం ఎపుడు పిలుపు వస్తుందా అని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. దీంతో అడవుల రక్షణ కష్టతరంగా మారింది. 20 మంది చేయాల్సిన పనిని నలుగురికి అప్పగిస్తే ఎలా ఉంటుందో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.విలువైన టేకు కలపకు నిలయంగా చెప్పుకొనే పెంబి, ఖానాపూర్‌ అటవీక్షేత్రాల పరిధిలో బీట్‌ అధికారులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. ముల్తానీల (అటవీ దొంగలు) బెడద అధికంగా ఉండే పెంబి రేంజిలో 24 బీట్‌ల పరిధిలో కేవలం నలుగురు ఎఫ్‌బీవోలు మాత్రమే ఉన్నారు. ఇటిక్యాల్‌, తులసిపాడ్‌, రాగిదుబ్బ, ఎంగ్లాపూర్‌ బీట్‌లకు మాత్రమే ఉండగా మిగతావన్నీ ఖాళీగానే ఉన్నాయి. కలప స్మగ్లింగ్‌కు ఎదురొస్తే రాళ్లు, కర్రలతో విరుచుకుపడే ముల్తానీలను ఎదుర్కోవడానికి అటవీ అధికారులు పోలీసుల సేవలను వినియోగించుకొంటున్నారు. ఖానాపూర్‌ అటవీరేంజి పరిధిలో 17 బీట్‌లు ఉండగా నలుగురు ఎఫ్‌బీవోలు మాత్రమే ఉన్నారు. ఈ రెండు బీట్‌లలోనూ మిగతా ఖాళీగా ఉన్న బీట్ల విధులను అటవీ సెక్షన్‌ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సిబ్బంది కొరత ఎదుర్కొంటున్న అటవీశాఖకు బేస్‌క్యాంపు, స్ట్రైక్‌ఫోర్స్‌ సిబ్బంది రక్షణలో కీలకంగా మారారు. తీసుకొనే వేతనాలు తక్కువే అయినా శ్రమించి అడవుల రక్షణలో అధికారులకు తోడ్పాటునందిస్తున్నారు. పెంబిలో మొత్తం 30 మంది సేవలు అందిస్తున్నారు. ఎండ, వాన, చలిని సైతం లెక్కచేయకుండా అడవిలోనే ఉంటూ బేస్‌క్యాంపు సిబ్బంది రక్షణలో పాలుపంచుకొంటుండగా స్ట్రైక్‌ఫోర్స్‌ సిబ్బంది సైతం వారివంతు కృషి చేస్తున్నారు. విలువైన కలప సంపద కల్గిన అడవుల రక్షణకు పొరుగుసేవల కింద నియామకమైన వీరిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అటవీశాఖలో పోస్టుల భర్తీపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

No comments:

Post a Comment