Breaking News

02/07/2019

అడ్డగోలుగా ప్లే స్కూల్స్...


కర్నూలు, జూలై 1, (way2newstv.in)
మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు తొలి దశ విద్య అందించాలంటే నాడు తప్పనిసరిగా అంగన్వాడీలు, బాల్వాడీల్లోనే చేర్పించాలి. అక్కడే జ్ఞాన వికాసానికి పునాదులు పడతాయనేది విశ్వాసం. కాల క్రమేణా వాటి స్థానంలో ప్రయివేటుగా ప్లే స్కూళ్లు వచ్చి చేరాయి. వీటిని ఏర్పాటు చేయాల్సి వస్తే విద్యాశాఖ మొదలు వివిధ విభాగాల అనుమతులు తప్పనిసరి. కానీ నగరంలో ఉన్న దాదాపు 320 ప్లే స్కూళ్లలో ఏ ఒక్క దానికీ అనుమతుల్లేవు. ఈ నేపథ్యంలో ఆయా స్కూళ్లలో ఏయే వసతులు ఉండాలి ? ఏం ఉన్నాయి ? అన్న వివరాలను తెలుపుతూ సాగేదే ఈ పరిశీలనాత్మక కథనం. విద్యాహక్కు చట్టం ప్రకారం ఐదారేళ్ల వయసులోపు పిల్లలంతా బాలలే. వీరంతా తల్లిదండ్రుల సంరక్షణలోనే పెరగాలి. ఇది బాలల హక్కు. నగరంలో పట్టుమని రెండేళ్లు కూడా లేని పిల్లలను డే కేర్‌ కేంద్రాల్లో విడిచి పెడుతున్నారు. సరిగా మాటలు కూడా రాని చిన్నారులను ప్రీ కేజీల్లో చేర్పిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా నగరంలోనే దాదాపు 320 ప్లే స్కూళ్లు ఏర్పాటయ్యాయి. డే కేంద్రాలు అనేకం పుట్టుకొస్తున్నాయి. ఇక్కడ చిన్నారుల రక్షణ, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. కానీ చాలా చోట్ల అవేమీ పట్టనట్టుగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. నగరంలో చిన్న కుటుంబాలే ఎక్కువ. ఉపాధి, ఉద్యోగవసరాల రీత్యా చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ ఉదయం వెళ్లి సాయంత్రం వస్తున్నారు.

 అడ్డగోలుగా ప్లే స్కూల్స్...

ఇలాంటివారి పిల్లల కోసమే అనేక డే కేర్‌ కేంద్రాలు వెలిశాయి. అవి ఇప్పుడు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. బాలల హక్కు చట్టం ప్రకారమైతే మూడేళ్లలోపు పిల్లలను ఎలాంటి కేంద్రాలలోనూ చేర్చకూడదు. దానికి భిన్నంగా తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు తల్లిదండ్రులు రాజీ పడిపోతున్నారు. నిర్వాహకులు ఈ కేంద్రాలను ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నడుపుతున్నారు. చిన్నారులను ఆడిస్తూ వారిలో సృజనాత్మకత పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మూడేళ్లు దాటిన చిన్నారుల కోసం ప్లే స్కూళ్లు వెలుస్తున్నాయి. ఇక్కడ చిన్నారులకు ఆటపాటలు, బొమ్మలు ద్వారా విద్యా బోధన చేస్తున్నారు. వీటి నిర్వహణకు విద్యాశాఖ, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతులు తప్పనిసరి. కానీ నగరంలో ఏ ఒక్క దానికీ అనుమతులు లేవు. అసలు వీటిని ఎవరు పర్యవేక్షించాలన్నదానిపై స్పష్టత లేదు. చాలా కేంద్రాల్లో ఇటు డే కేర్‌, అటు ప్లే స్కూలు రెండూ నిర్వహిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.  అనుమతులు లేకుండా స్కూళ్లను ప్రారంభించకూడదు. ఒక వేళ ప్రారంభించినా ఆరు నెలల్లోపు అనుమతులు పొందాలి.. ప్రభుత్వ సూచనల ప్రకారం ఫీజులు తీసుకోవాలి.20 మంది చిన్నారులకు ఒక ఉపాధ్యాయుడు, ఒక సంరక్షకుడు ఉండాలి.రక్షణ, భద్రత, పారిశుధ్యం, పరిశు భ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.భవనానికి ప్రహరీ, గాలి, వెలుతురు బాగా వచ్చేలా ఉండాలి.చిన్నారులు నిద్రపోవడానికి ప్రత్యేకంగా విశ్రాంతి గది ఉండాలి మరుగుదొడ్లు, స్నానాల గదిలో టవల్‌, సబ్బులు ఉంచి శుభ్రతా చర్యలు పాటించాలి. సిసి టీవీలను అందుబాటులో ఉంచాలి.అగ్నిమాపక దళ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి. ప్లే స్కూలు రోజుకు 3 నుంచి 4 గంటల్లోపు మాత్రమే నిర్వహించాలి.పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులతోనే బోధన ఉండాలి.బొమ్మలు, టీవీలను చూపించి చైతన్య పరచాలి. ప్రథమ చికిత్స కిట్‌, చిన్న పిల్లలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి.వైద్య నిపుణులతో ప్రతి మూడు నెలలకు ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలి ప్రవేశపత్రం, హాజరు, ఆరోగ్య రికార్డులు, స్టాక్‌, ఫీజు వగైరా రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలి.ప్లే స్కూలుకు తప్పనిసరిగా ప్లే స్కూలు అనే బోర్డు ఉంచాలి. విద్యాశాఖ ఎప్పటికప్పుడు ప్లే స్కూళ్ల జాబితాను గెజిట్లో ఉంచాలి.మూడేళ్లలోపు చిన్నారులను చేర్పించకూడదు.మూడేళ్లలోపు పిల్లలున్నా, ఫీజులు అధికంగా వసూలు చేసినా వెంటనే గుర్తింపు రద్దు చేయవచ్చు.ప్రవేశాలు పూర్తయిన ఒక నెలలోపు తల్లిదండ్రుల కమిటీని నియమించాలి. ఇందులో 50 శాతం తల్లులు, 25 శాతం ఉపాధ్యాయులు, 25 శాతం తండ్రులు ఉండేలా చూడాలి. ఈ కమిటీని ఏటా మారుస్తుండాలి. ప్రతి నెలా సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలు నమోదు చేయాలి. పిల్లలకు జంక్‌ ఫుడ్స్‌ను అనుమతించకూడదు. పోషకాలతో కూడిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. ప్లే స్కూళ్లలో పూర్వ ప్రాథమిక విద్యను అందించాలంటే విద్యాశాఖ అనుమతి తప్పనిసరి. ప్రయివేటు పాఠశాలల్లో సైతం ఈ విద్యకు అనుమతులు తీసుకోవాల్సిందే. అయితే తల్లిదండ్రులు మాత్రం 'ఫీజు ఎంతైనా పర్వాలేదు.. పిల్లాడిని ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ దగ్గరే ఉంచి పంపించండి' అంటూ చేర్పించేస్తున్నారు. అసలక్కడ ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకునే ఓపిక ఉండటం లేదు. కొన్ని సంస్థల్లో అన్ని రకాల సౌకర్యాలు అందిస్తున్నా... మరికొన్ని చోట్ల  అవేమీ కానరావడం లేదు. ఏడాదికి ఒక్కో చిన్నారికి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్న ప్లే స్కూళ్లు నగరంలో ఉన్నాయి. కొన్నింటిని రద్దీ ఉండే రోడ్లు, రెండంతస్తుల భవనాల్లో నిర్వహిస్తున్నారు.

No comments:

Post a Comment