Breaking News

02/07/2019

గోదావరి జిల్లాల్లో పట్టిసీమ వ్యతిరేక ఉద్యమం


ఏలూరు, జూలై 2, (way2newstv.in)
గోదావరి డెల్టా రైతుల వాదనను పక్కనపెట్టి, గత ప్రభుత్వ హయాంలో నిర్మితమై, నిబంధనలకు విరుద్ధంగా నీటిని తోడేస్తున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని మూసివేయాలంటూ గోదావరి జిల్లాల్లో ఉద్యమం మొదలవుతోంది. ‘గోదావరి జలాలను కాపాడుకుందాం.. డెల్టాను ఎడారి కాకుండా ఉద్యమిద్దాం’ అనే నినాదంతో రైతాంగం పట్టిసీమకు వ్యతిరేకంగా సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. మరి కొద్ది రోజుల్లో భీమవరంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రైతాంగం విస్తృత సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై కీలకమైన నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. గత టీడీపీ ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని అక్రమంగా నిర్మించారని రైతు కార్యాచరణ సమితి ప్రకటించిన సంగతి విదితమే. నిర్మాణ సమయంలో పోలవరం ప్రాజెక్టులో భాగంగానే పట్టిసీమ ఎత్తిపోతల అని గత ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై రైతు కార్యాచరణ సమితి గోదావరి అథారిటీని సంప్రదించి, ఈ ఎత్తిపోతలకు ఎటువంటి అనుమతులు లేవని తేల్చుకుంది. ముఖ్యంగా పర్యావరణ అనుమతులు, సెంట్రల్ వాటర్ కమిషన్తో పాటు అసలు బచావత్ ట్రిబ్యునల్‌లో స్థానమే లేదని నిర్ధారణ అయ్యింది.

గోదావరి జిల్లాల్లో పట్టిసీమ వ్యతిరేక ఉద్యమం


ఈ నేపథ్యంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని రైతు కార్యాచరణ సమితి డిమాండుచేసినా, ప్రభుత్వం గట్టి పట్టుతో ఉండటంతో చకచకా పథకం నిర్మాణం పూర్తయ్యింది. దీంతో చేసేదేమీ లేకపోయింది. అలాగే కృష్ణా జిల్లా రైతులు కూడా కోరడంతో మానవతా దృక్పథంతో ప.గో. రైతులు వ్యవహరించారు. అయితే పట్టిసీమ నిర్మాణం తర్వాత గోదావరి డెల్టా పరిస్థితి దారుణంగా తయారైంది. అసలు శివారు ప్రాంతాలకు నీరు అందడంలేదు. ఒకవిధంగా ఆయా ప్రాంతాల్లో కరవు ఛాయలు కనిపిస్తున్నాయి. నది నుండి నీటి ప్రవాహం తగ్గిపోయి, సముద్రపు నీరు వెనక్కు చొచ్చుకువచ్చి, ఉప్పు సాంద్రత కూడా పెరిగిపోవడం మొదలయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో భూగర్భం అంతా ఉప్పు సాంద్రత పెరిగిపోయిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో సాగు, తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది పశ్చిమ గోదావరి జిల్లాలో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా కనిపించింది. గత ప్రభుత్వం పట్టిసీమ నిర్మాణానికి ముందు విడుదలచేసిన జీవోలో పొందుపర్చిన అంశాలు అమలు చేస్తున్న తీరు విడ్డూరంగా ఉంది. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 14 మీటర్లకు చేరుకున్నపుడు వచ్చిన వరద నీటిని తోడుతామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ మామూలుగానే ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 13.5 లెవిల్ మాత్రమే ఉంటుంది. సాధారణంగా గోదావరిలో 10 కిలోమీటర్లకు ఒకొక్క అడుగు స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చూస్తే పట్టిసీమ వద్ద 15.5 ఎత్తులో వరద జలాలు వస్తేనే తోడుకోవాల్సి ఉండగా, 8 మీటర్ల వద్ద సంప్‌ను ఏర్పాటుచేసి నీటిని ఇష్టానుసారంగా తోడేస్తున్నారని రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంవీ సూర్యనారాయణరాజు చెప్పారు. అంతేకాకుండా గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కృష్ణా పరీవాహక ప్రాంతానికి జలాలను తోడటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా డెల్టాలోని గోదావరి జలాల్లోని వాటా అడుగుతోందని వివరించారు. పట్టిసీమ అక్రమ నిర్మాణ ప్రాజెక్టుతో గత కొద్ది రోజులుగా నీటిని తోడటం దారుణమన్నారు. పైగా ఈ ప్రాజెక్టుతో అంతర్రాష్ట్ర జల వివాదాలు ప్రారంభం కాబోతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే పట్టిసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండు చేశారు.

No comments:

Post a Comment