Breaking News

03/07/2019

బడ్జెట్ పై బోలెడు ఆశలు


హైద్రాబాద్, జూలై 3, (way2newstv.in)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఆదాయ పన్నుపై ప్రోత్సాహకరమైన రాయితీలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని చాలామంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆదాయ పన్నులో రాయితీలను ప్రకటించడం ద్వారా ఆర్థిక వృద్థిరేటు వేగంగా పుంజుకునేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. జూలై 5 (శుక్రవారం) రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.ఈ బడ్జెట్ పై దేశవ్యాప్తంగా భారత పౌరుల్లో అంచనాలు మిన్నంటాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టానికి ముందుగానే బడ్జెట్ లో అమలుపర్చాల్సిన పలు అంశాలపై ప్రతిపాదనలతో కూడిన డిమాండ్ వెల్లువెత్తుతున్నాయి. ఇందులోని చాలా డిమాండ్లు తక్కువ పన్ను విధింపుకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యేకించి మధ్య-ఆదాయ గ్రూపుకు చెందినవి డిమాండ్లు కూడా ఉన్నాయి.ఈ బడ్జెట్ లో.. అవసరమైతే మొత్తం పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం లేదా గృహ వ్యయాలపై ఒత్తిడిని తగ్గించేందుకు పన్ను మినహాయింపులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పన్నుదారుల అందరి అభ్యర్థులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశాలు లేకపోవచ్చు. 

 బడ్జెట్ పై బోలెడు ఆశలు


కాకపోతే.. మధ్య-ఆదాయ వర్గాలపై పన్ను విధింపును తగ్గించడానికి కొన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది.ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పన్ను విధింపు విషయంలో ఎక్కువ మార్పులు ఉండకపోవచ్చునని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం పన్ను రాయితీలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ట్యాక్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ లోని ఆదాయపు పన్నులో కొన్ని మార్పులు ఇలా ఉండబోయే అవకాశాలు ఉన్నాయి.
1. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి :
*మధ్యంతర బడ్జెట్‌లో సెక్షన్ 87 ఏ కింద రూ.5 లక్షల వరకు పూర్తి పన్ను మినహాయింపు ప్రవేశపెట్టడం జరిగింది.
* ఇప్పుడు ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ లో పన్ను మినహాయింపుపై మరిన్ని మార్పులు ఉండే అవకాశం లేదు.
* ప్రస్తుతం ఉన్న పన్ను మినహాయింపు రాయితీలో రూ .2.5 లక్షల నుంచి కనీసం రూ .3 లక్షలకు వరకు పెంచాలని ప్రజలు, పలు పరిశ్రమ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
* ఆర్థిక పరమైన తప్పిదాలకు అవకాశం లేకుండా ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని అందరూ గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. 
* ఈ బడ్జెట్ లో  పన్ను మినహాయింపు పరిమితిని పెంచే దిశగా ప్రభుత్వం సవరణలు చేస్తుందని చాలామందిఎదురుచూస్తున్నారు.
* ప్రస్తుత పన్ను బేస్ తగ్గడానికి ఇది దారితీస్తుంది.. అంతేకాదు.. ఎక్కువ మందికి ఆదాయపు పన్ను చెల్లించకుండా మినహాయింపు ఉంటుంది.  
* ఒకవేళ ప్రభుత్వం.. దేశ పన్ను బేస్ పెంపును పరిగణనలోకి తీసుకుంటే మాత్రం దీనికి అవకాశం ఉండదు. 
2. అధిక ఆదాయ పన్ను మినహాయింపు
* పన్ను మినహాయింపు పరిమితి పెంచి వ్యక్తులకు మినహాయింపు ఇస్తే అసంతృప్తికి లోనవచ్చు.
* ఆదాయపు పన్ను చట్టంలోని అనేక విభాగాల కింద అధిక తగ్గింపులను ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం వారిని  ఉత్తేజపరిచే అవకాశం ఉంది. 
*  సెక్షన్ 80(సీ ) కింద అనుమతించే ఆదాయ పన్ను మినహాయింపు ప్రస్తుతం రూ.1.5లక్షలు ఉండగా.. రూ .2 లక్షలకు లేదా అంతకంటే ఎక్కువ పెంచవచ్చు. 
* ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 (సి) కింద చేసిన పెట్టుబడులపై ఎక్కువ పన్ను ఆదా చేయడానికి ప్రజలను అనుమతిస్తుంది. 
3. ఆరోగ్య సంరక్షణపై పన్ను ప్రయోజనాలు
* హెల్త్ కేర్‌లో భాగంగా లభించే పన్ను ఆదా సాధన కింద ప్రభుత్వం పన్ను తగ్గింపును పెంచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 
* ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 (డి) కింద పన్ను ఆదా పెంచాలని పరిశ్రమ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరాయి.
* సెక్షన్ 80 (డి) కింద 60 ఏళ్లలోపు వారికి వర్తించే ప్రస్తుత రూ .25 వేల నుంచి పరిమితిని పెంచవచ్చు. 
* 60 ఏళ్లు పైబడిన వారికి సెక్షన్ 80 (డి) కింద కూడా రాయితీ పెంచవచ్చు. 
* 60 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుత మినహాయింపు పరిమితి రూ .50,000 వరకు ఉంది.
4. గృహ రుణాలపై అధిక మినహాయింపు
* రియల్ ఎస్టేట్ లో డిమాండ్ నెమ్మదించడం కారణంగా ఆ రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
* ప్రభుత్వం కొనుగోలుదారులకు ఎక్కువ పన్ను ప్రయోజనాలను ఆఫర్ చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకోవడానికి ప్రోత్సాహాన్ని అందించినట్టు అవుతుంది. 
* డేటా ప్రకారం.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి) కింద దేశ ప్రజలు గరిష్టంగా రూ .2 లక్షల వరకు పన్ను తగ్గింపును పొందవచ్చు.
* ఆర్థికవేత్తల అంచనా ప్రకారం..  ఈ రంగంలో డిమాండ్ పెంచడానికి గృహ ఆస్తుల కొనుగోలును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ పరిమితిని మరింత పెంచే అవకాశం ఉంది. 
* ఇంటి నిర్మాణం పూర్తయిన సంవత్సరం నుంచే సదరు వ్యక్తి ఈ పన్ను తగ్గింపుపై క్లెయిమ్ చేసుకోవచ్చు. 
5. పన్ను రహిత బాండ్లు తిరిగి రావచ్చు
* రాబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం సాధించాల్సిన ముఖ్య లక్ష్యాల్లో ఇదొకటి. మౌలిక సదుపాయల ప్రాజెక్టులను వృద్ధిపరచడమే కాదు.. ఉద్యోగ వృద్థి పెంపుతో పాటు డిమాండ్ పెంచేందుకు కీలకం కానుంది.
* ఇలాంటి పరిస్థితుల్లో పన్ను రహిత బాండ్లు తిరిగి తీసుకొచ్చిన ఆశ్చర్యం లేదు.
* మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ సంస్థల ద్వారా మూలధనాన్ని సమీకరించడానికి సహాయం పడుతుంది.
* ఈ బాండ్లను 'పన్ను రహిత' బాండ్లు అని పిలుస్తారు. ఎందుకంటే వీటిపై సంపాదించిన వడ్డీ పన్నుగా విధించబడదు.
* ఈ బాండ్లు 10 సంవత్సరాల లేదా అంతకంటే ఎక్కువ కాలం వరకు మెచ్యూరిటీ ఉంటుంది.  మార్కెట్లో లభించే అనేక ఇతర మార్గాల కంటే ఎంతో సురక్షితం కూడా.

No comments:

Post a Comment