Breaking News

03/07/2019

గ్రామ వలంటీర్లకు పీజీలు దరఖాస్తులు


విజయవాడ, జూలై 3, (way2newstv.in)
ఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రకటించిన గ్రామ వాలంటీర్‌ ఉద్యోగాలకు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న న‌వ‌ర‌త్న ప‌థ‌కాల్లో కీలకమైన గ్రామ వాలంటీర్‌ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి అనూహ్య సంఖ్యలో దరఖాస్తులు వ‌స్తున్నాయి. కేవ‌లం 8 రోజుల వ్యవధిలోనే ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు 5 ల‌క్షలు దాటిపోయాయి. 5,48,029 దరఖాస్తులు వచ్చాయని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) తెలిపింది. దరఖాస్తు గడువు ముగియనున్న జులై 5 నాటికి ఇంకా పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి 5వ తేదీ అర్ధరాత్రి 12 గంట‌ల వ‌ర‌కు స‌మ‌యం ఉంది. రోజుకు సరాసరి 60 వేల‌ మందికి పైగా ద‌ర‌ఖాస్తులు చేసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.  గ్రామ వలంటీర్లకు పీజీలు దరఖాస్తులు

గ్రామ వాలంటీర్ పోస్టుల‌కు ఇంటర్, డిగ్రీతో పాటు ఉన్నత చదువులు చదివిన వారు కూడా పెద్ద సంఖ్యలో పోటీ పడుతుండటం గమనార్హం. పోస్టు గ్రాడ్యుయేట్ల నుంచి కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఈ ఉద్యోగాల కోసం ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 10,589 మంది, గిరిజన ప్రాంతాల్లో 194 మంది, ప‌ట్టణ ప్రాంతాల్లో 4347 మంది పోస్టు గ్రాడ్యుయేట్ పట్టభద్రులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ద‌ర‌ఖాస్తుల్లో మ‌హిళా అభ్యర్థులు కూడా భారీ సంఖ్యలో ఉండటం విశేషం. నేటి వ‌ర‌కు 2.30 లక్షల మందికి పైగా మ‌హిళ‌లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అసంపూర్తిగా వివరాలు పూరించడం లాంటి త‌ప్పిదాల వ‌ల్ల కొన్ని ద‌ర‌ఖాస్తులు తిర‌స్కరణకు గుర‌వుతున్నాయి. ఇప్పటి వ‌ర‌కు ఇలా 28 వేల‌కు పైగా ద‌ర‌ఖాస్తులు తిర‌స్కరణకు గుర‌య్యాయి. సీఎం వైఎస్ జగన్ అత్యంత కీలకంగా భావిస్తున్న గ్రామ వాలంటీర్ కొలువుల భ‌ర్తీ కోసం ఆర్టీజీఎస్ ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది. అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో సుల‌భంగా ద‌ర‌ఖాస్తు చేసుకునే సదుపాయాన్ని క‌ల్పించింది. ఈ వెబ్‌సైట్‌కు నెటిజ‌న్ల నుంచి కూడా అనూహ్య స్పంద‌న వ‌స్తోంది. ఇప్పటి వ‌ర‌కు 16 ల‌క్షల మందికి పైగా ఈ వెబ్‌సైట్‌ను వీక్షించారు. 

No comments:

Post a Comment