Breaking News

29/07/2019

రామా కనవేమిరా..! (ఖమ్మం)

ఖమ్మం, జూలై 29   (way2newstv.in - Swamy Naidu): 
భద్రాద్రి రామాలయం నిర్వహణపై అధికారులు పూర్తిస్థాయి దృష్టి సారించకపోవడంతో ప్రధాన విభాగాలలో సమస్యలు పేరుకుపోతున్నాయి. కొందరు అధికారులు, సిబ్బంది ఎవరిష్టం వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అవుట్‌ సోర్సింగ్‌ స్థాయిలో కొంతమంది పెత్తనం చేస్తుండగా తమ సీనియారిటీని చూపించి ఇంకొందరు దర్జా వెలగబెట్టడంతో అభివృద్ధి పనుల జాడే లేకుండాపోయింది. హైదరాబాద్‌లోని గణేశ్‌ ఆలయం ఈవోగా ఉన్న తాళ్లూరి రమేశ్‌బాబు దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ హోదాలో కొనసాగుతూ రామాలయం ఈవోగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఈ శాఖలో త్వరలో ఉద్యోగోన్నతులు చేపట్టే వీలున్నందున ఆయనకు జాయింట్‌ కమిషనర్‌ హోదాలో ఉద్యోగోన్నతి వస్తుందనే ప్రచారం ఉంది. వాస్తవంగా రామాలయంలో ఈవోగా చేయాలంటే దేవాదాయ శాఖలో జాయింట్‌ కమిషర్‌ హోదా ఉన్న అధికారులు అవసరం. 
రామా కనవేమిరా..! (ఖమ్మం)

ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అనుభవం ఉన్న ఆయన ఇక్కడ అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఇక్కడ రెగ్యులర్‌ అధికారి అవసరం ఉన్నప్పటికీ పై స్థాయిలో సరైన నిర్ణయం తీసుకోవడం లేదన్నది నిజం. శ్రీరామ నవమి, ముక్కోటి ఏకాదశి, హనుమాన్‌ జయంత్యుత్సవం, వినాయక చవితి వేడుకలకు భక్తులు పోటెత్తున్నప్పటికీ హుండీలలో కానుకలు ఆశించిన స్థాయిలో రావడం లేదని భక్తులు అంటున్నారు.పదేళ్ల కిందట నెలకు రూ.అరకోటికి తగ్గకుండా జీతభత్యాల రూపంలో చెల్లించే వాళ్లు. ప్రస్తుతం ఇది రూ.90 లక్షలకు చేరింది. ఆ స్థాయిలో ఆదాయాలను పెంచుకోలేక పోతున్నారనే వాదనలు సిబ్బందిపై ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 15 వేల ఎకరాల భూమి దేవాదాయ శాఖకు ఉండగా ఇందులో 2 వేల ఎకరాలు ఆక్రమణలో ఉంది. భద్రాద్రి రామాలయానికి చెందిన 1,345 ఎకరాలలో 1,152 ఎకరాలు ఆక్రమణలో ఉందంటే ఈ విభాగం పని తీరును అర్ధం చేసుకోవచ్ఛు ఈ అంశంలో ప్రస్తుతం చేస్తున్న వాళ్లను మాత్రమే నిందించి అంతకు ముందు చేసిన వాళ్లను మెచ్చుకునే పరిస్థితి లేదు. పురుషోత్తపట్నం వద్ద ఇప్పటికే ఉన్న ఆక్రమణలకు తోడు ఇంకొంత ఆక్రమణ చోటు చేసుకుంది. సమస్యను అక్కడి పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం స్పందన లేదు. మెదక్‌లో రామాలయానికి 200 ఎకరాలకుపైగా భూమి ఉన్నప్పటికీ దీనిపై స్వామికి ఆదాయం రావడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొంతభూమి పోలవరం ముంపులో ఉన్నప్పటికీ దీని ఆలనా పాలన పట్టించుకోలేదు. తొలి విడత ప్యాకేజీ రాకపోవడంతో ఇప్పుడు రంగంలోకి దిగారు. ఇప్పటికైనా భూముల విభాగంలో చిత్త శుద్ధి చూపాల్సి ఉంది.వేలం పాటల ద్వారా చేసే హంగామా అంతాఇంత కాదు. గుత్తేదారులకు కల్పించే అన్ని రకాల హక్కులపై ఆలయానికి రూ.3.7 కోట్ల మేర ఆదాయం వస్తోంది. ఇందులో ఎన్నో తికమకలు ఉండడంతో పాత గుత్తేదారుల హవానే నడుస్తోంది. ఈ నెల 16న దమ్మక్క ఉత్సవం ఉండగా జరగ్గా ముందు రోజు హడావుడిగా ఫోటోలకు సంబంధించిన వేలం పాట నిర్వహించారు. గతేడాది రూ.21 లక్షల ఆదాయం రాగా ఈ సారి కారు చౌకగా రూ.13.25 లక్షలకే ఓ కాంట్రాక్టర్ కు హక్కులు కట్టబెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. అప్పటికే మూడు సార్లు పాట పెట్టినా పోటీ లేకపోవడం వల్ల దీన్ని ఖరారు చేసినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఒకేసారి రూ.లక్షల్లో వేలం పాట తగ్గడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అవుట్‌ సోర్సింగ్‌కు సంబంధించిన మూడు టెండర్లు ఉండగా వీటిలో కొత్త వాళ్లకు అవకాశం రాకుండా నిబంధనలు మార్చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.రూ.100 కోట్ల పనులకు సంబంధించిన అన్ని ప్రణాళికలను తయారు చేసినప్పటికీ సాంకేతిక కారణాలను సాకుగా చూపించి పనులు ప్రారంభించలేదు. పోలవరం ప్రాజెక్టును తొలుత అనుకున్న దాని కంటే ఎక్కువ ఎత్తు పెంచారు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో ఇక్కడ వరద ప్రవాహం ఎలా ఉంటుందనే అంశంపై నిపుణుల బృందం పర్యటించి నివేదికను ప్రభుత్వానికి పంపారు. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాతే అభివృద్ధి పనులు చేస్తారా? వైదిక పెద్దలైనా కాస్త చొరవ తీసుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది. గోశాల నిర్మాణం కోసం ఓ దాత విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికోసం 105 ఎకరాలను పురుషోత్తపట్నంలో గుర్తించి ప్రాథమిక పనులు చేపట్టారు. నక్షత్ర వనంతోపాటు పిల్లల పార్కును నిర్మించాలని అనుకుంటున్నారు. స్వామివారి మండపంతోపాటు కొలను ఉంటాయి. దీనికి సమీపంలోని మరో 100 ఎకరాలలో కుటీరాలను నిర్మించాలని భావిస్తున్నారు. ప్రణాళికలను తయారు చేసినప్పటికీ పనులకు మోక్షం కలగడంలేదు. రూ.8 లక్షలు చొప్పున వెచ్చిస్తూ 40 వసతి గదులను తానీషా కల్యాణ మండపానికి సమీపంలో నిర్మించాలనుకుంటున్నారు. ఓ దాత ముందుకొచ్చి 30 గదులను నిర్మించేందుకు హామీ ఇచ్చారు. మరో 10 గదులకు సరిపడా విరాళాలు వచ్చాయి. అయినా ఈ పనుల్లో పురోగతి లేదు.

No comments:

Post a Comment