Breaking News

05/07/2019

ఊరించి...ఊసూరుమనిపించిన వానలు

నల్గొండ, జూలై 5, (way2newstv.in
ఖరీఫ్‌ సీజను ప్రారంభానికి ముందు ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అందుకు తగ్గట్టుగా జూన్‌ నెలలో తొలకరి వర్షాలు సకాలంలోనే పలకరించి మురిపించాయి. దీంతో రైతులు రోహిణి కార్తెలో ఉత్సాహంగా ఖరీఫ్‌ పంటల సాగు పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం మే నెలలోనే రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి సాయం అందించడంతో దుక్కులు దున్నుకుని నారుమళ్లు పోసుకున్నారు. అవసరమైన ఎరువులు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ఈ క్రమంలో గత నెలలో పలు ప్రాంతాల్లో ఆశాజనకంగా వర్షాలు కురియడంతో కాలం అనుకూలిస్తుందని భావించారు. తర్వాత వరుణుడు పత్తా లేకుండా పోయాడు. ఆరుద్ర కార్తెలో నాట్లు వేసుకుంటే వరి పంట బాగా ఎదిగి దిగుబడి బాగా వస్తుందని రైతుల నమ్మకం. ముప్పై రోజుల కంటే ఎక్కువ రోజులుంటే నారు ముదిరిపోతుంది. అపుడు ఆ నారుతో నాటువేస్తే ఆశించిన దిగుబడి రాదు. చాలా మంది రైతులు గత నెల ఆరంభంలో తొలకరి వర్షాలు కురియగానే నారుమళ్లు పోసుకున్నారు. ఇపుడు నెల రోజులు దాటనుండగా చినుకు జాడ లేకపోవడంతో నారు ముదిరిపోతుందని ఆందోళన చెందుతున్నారు.
 ఊరించి...ఊసూరుమనిపించిన వానలు

జిల్లాలో ప్రస్తుత వానాకాలం  సీజన్‌లో 1,21,125 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. వాతావరణం అనుకూలిస్తే పూర్తిస్థాయిలో పంటలు సాగవుతాయని భావించింది. ఈ క్రమంలో తొలకరి వర్షాలు ఆశలు రేకెత్తించగా ప్రాజెక్టులు, చెరువుల కింద పొలాలున్న రైతులతో పాటు, బోర్ల వసతి ఉన్న రైతులందరూ వరి నారుమళ్లు పోసుకున్నారు. జూన్‌ నెలలో అడపా దడపా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియడంతో ఖరీఫ్‌ పంటల సాగుకు కాలం కలిసి వస్తుందనుకున్నారు. వారి ఆశలను నీరుగార్చే విధంగా జిల్లాలో 15 మండలాల్లో లోటు వర్షపాతమే ఉండటం గమనార్హం.ప్రాజెక్టులు, చెరువుల్లో సమృద్ధిగా నీరు చేరితేనే వరి సాగు చేయడానికి వీలుంటుంది. వానాకాలం ప్రారంభమై నెల రోజులు గడచినా సరైన వర్షాలు కురవకపోవడంతో ఏ సాగునీటి వనరులోనూ నీరు చేరలేదు. జిల్లాలో ఏకైక మధ్య తరహా ప్రాజెక్టు అయిన ఘనపూర్‌ ఆనకట్టతో పాటు, చిన్నా, పెద్దా చెరువులన్నీ నీరులేక వెలవెలబోతున్నాయి. వ్యవసాయ అవసరాలకు 24 గంటలపాటు నిరంతరాయంగా త్రీ ఫేజ్‌ విద్యుత్తు సరఫరా అవుతున్నా భూగర్భ జలాలు లోతుకు పడిపోవడంతో బోర్ల కింద కూడా వరి పంట సాగుచేయలేని పరిస్థితి నెలకొంది. కొందరు రైతుల బోర్లు ప్రస్తుతం నీరందిస్తున్నా మున్ముందు వర్షాలు పడకుంటే నీటి తడులందించడం కష్టమని నాట్లు వేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ నెల మొదటి పక్షంలోపు భారీ వర్షాలు కురిసి వనరుల్లో నీరు చేరితే తప్ప వరి సాగు చేసే పరిస్థితి లేదు. అంతకు మించి వర్షాలు ఆలస్యమైతే ఆలోపు నారుమళ్లు ముదిరి పోతాయన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. దీంతో వరుణుడి కరుణకు మెతుకు సీమ రైతన్నలు ఆకాశం వంక ఆశగా ఎదురు చూస్తున్నారు.

No comments:

Post a Comment