Breaking News

08/07/2019

పవన్ లో ఆశ తగ్గినట్టు లేదా


గుంటూరు, జూలై 8, (way2newstv.in)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయంతో బొక్క బోర్లా పడింది. ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం గెలవడంతో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. అయినప్పటికీ ఓటమి తనకో గుణపాఠం అని పేర్కొంటూ భవిష్యత్తు పై ఆశతో పోరాడుతూనే ఉంటానని శ్రేణులకు ధైర్యం చెబుతూ వస్తున్నారు జనసేనాని. విలువలతో కూడిన రాజకీయాలకోసం ఓటమికుడా గౌరవంగా స్వీకరిస్తా అంటూ ప్రకటిస్తున్నారు పవన్. మార్పు కోసం జరిగే పోరాటంలో ఎన్నిసార్లు ఓడిపోయినా వెనుకడుగు వేయనంటూ తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్ళిన పవన్ కల్యాణ్ అక్కడివారితో తన మనసులో మాటలను పంచుకున్నారు. భారత్ అమెరికా లా అభివృద్ధి కాలేకపోవడానికి కారణం సంస్కృతిలో భాగమైన కులాలే కారణమని తేల్చారు. 

పవన్ లో ఆశ తగ్గినట్టు లేదా

చెత్త వేయడానికి అలవాటు పడిన భారతీయులు ఆ చెత్త తీయడానికి వేరే కులం వారు ఉన్నారనే భావనతో బతుకుతున్నారని వ్యాఖ్యానించారు. ఆ పరిస్థితి నుంచి మారినప్పుడే దేశం గతి మారుతుందని చెప్పుకొచ్చారు.ఎన్నికల ఫలితాలు వచ్చాకా ఓటమిని అంగీకరించి తేరుకోవడానికి తనకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పట్టిందన్నారు పవన్. తన జీవితంలో అనేక ఓటములు ఉన్నాయని అవి గెలుపుకి దారి ఎలా తీశాయో సినిమా అనుభవాలను వివరించారు పవన్. ఖుషి సినిమా హిట్ తరువాత గబ్బర్ సింగ్ వరకు ఒక్క హిట్ లేదని అయినా తాను కుంగిపోలేదన్నారు. ప్రతి ఓటమి గుణపాఠమే నేర్పిందన్నారు పవన్ కల్యాణ‌్.దశాబ్దాల పాటు చిన్న జైలు గదిలో గడిపి జాత్యంహకారం పై పోరాడిన నెల్సన్ మండేలా ఆ దేశ అధ్యక్షుడిగా ఎదిగిన తీరే తనకు స్ఫూర్తి అని చెప్పారు పవన్. థామస్ ఎడిసన్ బల్బు కనుగొనేందుకు శ్రమించిన తీరు వెనుక ఎన్ని పరాజయాలు ఉన్నాయో తరచి చూస్తే తెలుస్తుందని పవన్ జనసేన ఓటమి భవిష్యత్తు గెలుపుకి బాటవేస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి పై పవన్ కల్యాణ్ పరోక్ష విమర్శలు చేశారు. జైల్లో గడిపి ఇప్పుడు నీతివాక్యాలు వల్లిస్తున్న వారికంటే తానే గొప్పగా భావిస్తున్నాని చెప్పుకొచ్చారు. కులాల పేరిట, మతాల పేరిట దేశం లోను తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు నడుస్తున్నాయని వీటిని రూపుమాపేందుకు జనసేన పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. ఓటుకు నోటు తీసుకునే వ్యవస్థపై నిరంతరం యుద్ధం సాగిస్తామని దానికి విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయుల సహకారాన్ని అభ్యర్ధించారు పవన్. జనసేనాని తాజా తానా ప్రసంగం ఎన్నికల ప్రసంగంలాగానే నడవడంతో ఆయన ఇంకా ఆ మూడ్ నుంచి బయటపడలేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

No comments:

Post a Comment