Breaking News

08/07/2019

టీడీపీ పూర్తి ప్రక్షాళనన దిశగా అడుగులు


విజయవాడ, జూలై 8, (way2newstv.in)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లా పార్టీ అధ్యక్షులను మార్చే యోచనలో ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ ఆయన పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోలేదు. పాలన వ్యవహారంతోనే తలమునకలై ఉండటంతో పార్టీ వ్యవహారాలను జిల్లా అధ్యక్షులకే అప్పగించారు. ఎన్నికలకు ముందు కొంత దృష్టి పెట్టినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. అనేక జిల్లాల్లో పార్టీ నష్పపోవడానికి కారణం జిల్లా అధ్యక్షుల వైఖరి కూడా కొంత కారణమని చంద్రబాబునాయుడు అభిప్రాయపడుతున్నారు.ఇందుకోసం ఆయన దాడుల్లో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు జిల్లాల పర్యటన చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనేక మంది జిల్లా అధ్యక్షులు కూడా ఓటమి బాట పట్టారు. 

టీడీపీ పూర్తి ప్రక్షాళనన దిశగా అడుగులు

దీంతో జిల్లా అధ్యక్షులను మార్చాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. తన జిల్లాల పర్యటన ముగించుకున్న తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం పై చంద్రబాబునాయుడు దృష్టి పెడతారని పార్టీ వర్గాలు అంటున్నాయి.ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఇన్ ఛార్జిలను నియమించేందుకు కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా గౌతు శిరీష ఉండేవారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో గౌతు శిరీష పలాస నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గౌతు శిరీష తండ్రి గౌతు శ్యాం సుందర్ శివాజీ రాజకీయాలకు దాదాపు గుడ్ బై చెప్పినట్లే. దీంతో శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ కు అప్పగించాలని భావిస్తున్నారు. కూన రవికుమార్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మద్దతు కూడా ఉండటంతో ఆయన నియామకం దాదాపు ఖరారయినట్లేనని తెలుస్తోంది.ఇక ప్రకాశం జిల్లాకు దామచర్ల జనార్థన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దామచర్ల జనార్థన్ ఓటమి పాలయ్యారు. దామచర్ల జనార్థన్ గ్రూపులను ప్రోత్సహించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. అనేక నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్ల పంపిణీ సమయంలో ఫిట్టింగ్ పెట్టారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో దామచర్లను కూడా మార్చాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఆయన స్థానంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశముంది. మరో ఐదేళ్ల పాటు జిల్లాలో పార్టీ కార్యక్రమాలను నడపగల సత్తా, సామర్థ్యం ఉన్న వారినే జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక చేయనున్నారు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కువ జిల్లాల్లో పార్టీ అధ్యక్షులను మార్చే అవకాశముంది.

No comments:

Post a Comment