Breaking News

08/07/2019

11 ఏళ్ల తర్వాత సేమ్ కెప్టెన్స్


సెమీస్ లో పోటీకి రెడీ అవుతున్న  విరాట్ కేన్
లండన్,  జూలై 8, (way2newstv.in)
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ చరమాంకానికి చేరుకుంది. టోర్నీ లీగ్ దశ మ్యాచ్‌లు శనివారం రాత్రితో ముగియగా.. మంగళవారం నుంచి సెమీస్ పోరు మొదలుకానుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కి అర్హత సాధించాయి. పట్టికలో నెం.1 స్థానంలో నిలిచిన భారత్‌ జట్టు.. నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌తో మంగళవారం మాంచెస్టర్ వేదికగా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఢీకొననుండగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లు గురువారం బర్మింగ్‌హామ్‌లో తలపడతాయి. ఇక ఆదివారం లార్డ్స్ వేదికగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య సెమీస్ మ్యాచ్‌లో ఓ యాదృచ్చికం సన్నివేశం చోటుచేసుకోనుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ 11 ఏళ్ల తర్వాత మళ్లీ కెప్టెన్లుగా సెమీస్‌లో తలపడబోతున్నారు. 2008 అండర్-19 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో ఈ ఇద్దరూ అప్పట్లో యువ కెప్టెన్లుగా ఢీకొన్నారు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ సారథ్యంలోని భారత్ అండర్-19 జట్టు 3 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుని ఫైనల్లో అడుగుపెట్టింది. 

11 ఏళ్ల తర్వాత సేమ్ కెప్టెన్స్

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? ఆ మ్యాచ్‌లో విలియమ్సన్ వికెట్‌ని స్వయంగా విరాట్ కోహ్లీనే పడగొట్టాడు. కోహ్లీ, విలియమ్సన్‌నే కాదు.. రవీంద్ర జడేజా, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ కూడా ఆ మ్యాచ్‌లో ఆడారు. ఐసీసీ వరల్డ్‌కప్ 2019 టోర్నీలో దాదాపుగా అన్ని జట్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీం ఏదైనా ఉందంటే.. అది టీమిండియానే అని చెప్పవచ్చు. టీమిండియా ఈ టోర్నీ లీగ్ దశలో ఓడింది కేవలం ఒక్క మ్యాచ్‌లోనే. అది కూడా ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుపైనే. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ ఓడినా.. ఇంగ్లండ్‌కు గట్టిపోటీనే ఇచ్చింది. ఇక మిగిలిన అన్ని మ్యాచ్‌లలోనూ అన్ని జట్లపై భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అన్ని జట్ల కన్నా భారత జట్టు ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. లీగ్ దశలో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన భారత్ 7 మ్యాచ్‌లలో జయకేతనం ఎగురవేసింది. ఒక మ్యాచ్‌లో ఓటమి పాలు కాగా, మరొక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. దీందో భారత్ 15 పాయిట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. టోర్నీలో ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముందు వరకు టీమిండియా ఖాతాలో ఒక్క ఓటమి కూడా నమోదు కాలేదు. దీన్ని బట్టి చూస్తే చాలు.. భారత్ వరల్డ్ కప్ టైటిల్‌కు ఎంత ఫేవరెటో ఇట్టే అర్థమవుతుంది. ఇక మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరిగే మొదటి సెమీ ఫైనల్‌లో టీమిండియా సత్తా చాటితే.. 2011 సీన్ రిపీట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ సారి కోహ్లి సేన వరల్డ్‌కప్‌ను తెస్తుందా, లేదా చూడాలి.

No comments:

Post a Comment