ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్, తలసాని, జగదీష్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 14(way2newstv.in)
నగరంలోని బర్కత్ పురాలో యాదాద్రి భవన్ (సమాచార కేంద్రం) దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తుల సౌకర్యార్థం సుమారు రూ.8 కోట్లతో యాదాద్రి భవన్ ను నిర్మించామన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆర్జిత సేవలు, కల్యాణం, గదుల బుకింగ్ వంటివి ఇక్కడినుంచే బుకింగ్ చేసుకొనే సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు.
బర్కత్ పురాలో యాదాద్రి భవన్
దాదాపు 1600 చదరపు గజాల విస్తీర్ణంలో సెల్లార్, జీ ప్లస్ టూ నిర్మించారని వెల్లడించారు. మొదటి అంతస్తులో కల్యాణ మండపం, రెండో అంతస్తులో 500 మంది సరిపడే భోజనశాలను ఏర్పాటుచేశారన్నారు. 10,990 చదరపు అడుగుల విస్తీర్ణంలోని సెల్లార్ ప్రాంతాన్ని పూర్తిగా పార్కింగ్ కు కేటాయించామని చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్ లో 7435 అడుగుల విస్తీర్ణంలో పార్కింగ్, యాదాద్రి ఆలయ సమాచార కేంద్రం, ఇక 7,435 అడుగుల విస్తీర్ణంలో మొదటి (కళ్యాణ మండపం), రెండో అంతస్తులను (డైనింగ్ హాల్) హాల్స్ గా నిర్మించారు. మొత్తం 32,207 చదరపు అడుగుల విస్తీర్ణంలో యాదాద్రి భవన్ ను నిర్మించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి,దేవాదాయ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment