Breaking News

11/06/2019

ధర్మానకు చేజారి పోవడం వెనుక...


శ్రీకాకుళం, జూన్ 11(way2newstv.in)
ధర్మాన ప్రసాదరావు. ఉద్దండుల్లాంటి సీఎం పాలనలో ఆయన మంత్రిగా చేశారు. సీనియర్‌ నాయకుడిగా పేరుంది ఆయనకు. జగన్‌ కేబినెట్‌లో ఆయనకు పక్కాగా మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారం జరిగింది. కానీ కేబినెట్‌ లిస్ట్‌లో ఆయన పేరులేదు. కానీ ఆయన తమ్ముడికి మాత్రం మంత్రియోగం దక్కింది. బొత్సకు సమకాలికుడైన ధర్మానకు, ఎందుకు కేబినెట్‌ బెర్త్ దక్కలేదు. దీంతో ఒక్కసారిగా షాకయ్యారు ధర్మాన అనుచరులు. ఇందుకు కారణాలు ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా వినిపిస్తున్నాయి అవే కారణాలతోనే జగన్‌, ధర్మానను పక్కనపెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అంతటి బుసలు కొడుతున్న కారణాలేంటి? ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌‌ రెడ్డి మంత్రివర్గంలో ఎవరెవరెరు అన్న ఉత్కంఠకు తెరపడింది. అయినా కొందరు కీలక నాయకులకు, ముందు నుంచి వస్తుందని ప్రచారం జరిగిన లీడర్లకు కేబినెట్‌ బెర్త్ దొరక్కపోవడం చర్చనీయాంశమైంది. అందులో మొదటి పేరు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు. పక్క జిల్లాలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు సమకాలీకులు. వీరిద్దరు మంత్రులుగా వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో పనిచేశారు. 


ధర్మానకు చేజారి పోవడం వెనుక...
అలాంటప్పుడు బొత్సకు మంత్రి పదవి దక్కినప్పుడు అదే సీనియర్‌ నేత అయిన ధర్మాన ప్రసాదరావు కూడా అవకాశం రావాలి. కానీ దక్కలేదు. దీనివెనుక అనేక కారణాలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ, పాలనా అనుభవం ఉన్న ధర్మానకు మంత్రి పదవి ఎందుకు దక్కలేదన్నదానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేవలం ధర్మాన కృష్ణదాస్‌ విధేయతకు పట్టం కట్టాల్సి రావడం వలనే ఈ పదవి తమను చేజారి పోయిందా అనే అంచనాలు వేస్తున్నారు ప్రసాద రావు అనుచరులు. ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు కంటే కృష్ణదాస్‌ ముందుగా వైసీపీలో చేరారు. కష్టాల్లో జగన్ వెంట నడిచింది కృష్ణదాసే. అందుకే అధినేత ఆయనకు పదవి ఇవ్వాల్సి వచ్చిందని, ధర్మాన ప్రసాదరావుపై వ్యతిరేకతతో కాదని మాట్లాడుకుంటున్నారు. అయితే ఇతర బలమైన కారణాలు కూడా ఉన్నాయని మరికొందరు విశ్లేషించుకుంటున్నారు. మరో కీలక కారణం కూడా ధర్మానకు కేబినెట్‌‌కు దూరం చేసిందన్న వాదన వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌ నాయుడుకు సహకరించారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం వైసీపీ లోక్‌సభ అభ్యర్థి దువ్వాడ శ్రీను, తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దానికి పరోక్షంగా ధర్మాన సహకారం లేకపోవడమేనని వాదనలు వినిపించాయి. ధర్మాన సామాజిక వర్గం, రామ్మోహన్‌ నాయుడు సామాజిక వర్గం ఒక్కటే. వెలమలు. కానీ దువ్వాడ శ్రీనివాస్ కాళింగ. అందుకే ధర్మాన నియోజకవర్గంలో, ఆయన ప్రభావం వున్న చోట్ల భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని వైసీపీ అధిష్టానానికి నివేదికలు అందినట్లు తెలుస్తోంది. ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టుగా సీనియర్ మోస్ట్‌ ఎక్స్‌ మినిస్టర్‌ ధర్మాన ప్రసాద రావుకు, మంత్రి పదవి దక్కకపోవడానికి ఎన్నో కారణాలు. అన్నకంటే తమ్ముడిలోనే విధేయత చూశారు జగన్. అందుకే అన్నను దూరం పెట్టారు. అయితే ఏదో ఒక పదవిని ప్రసాదరావుకు ఇస్తారని, లేదంటే రెండున్నరేళ్ల తర్వాత మరోసారి పరిశీలించే అవకాశముందని, మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చూడాలి ధర్మాన ప్రసాద రావు టైం ఎలా ఉంటుందో.

No comments:

Post a Comment