Breaking News

19/06/2019

ఆశల సాగు.. (పశ్చిమగోదావరి)

ఏలూరు, జూన్ 19  (way2newstv.in): 
జిల్లాలో ఖరీఫ్ సాగు మొదలవుతోంది. అన్నదాతలు లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా.. నేలతల్లిపై భారం వేసి ముందుకు సాగుతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు నీరు విడుదల చేసి పది రోజులు కావస్తోంది. నీటి విడుదలను క్రమంగా పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో డెల్టా కాలువల పరిధిలోని ఆయకట్టు రైతులు ఖరీఫ్‌ నారుమడుల పనిలో నిమగ్నమయ్యారు. ముందస్తుగా ఖరీఫ్‌ పనులు ప్రారంభించి మూడు పంటల సాగుకు అవకాశం కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మూడేళ్లుగా కాలువలకు జూన్‌ 1నే నీటిని విడుదల చేస్తున్నారు. ఇటీవల అక్కడక్కడ వర్షాలు పడటంతో భూమి కాస్త తడిసింది. కాలువల నీటికి వర్షపునీరు తోడు కావడంతో ఖరీఫ్‌ సాగుకు రైతులు ముందుకు సాగుతున్నారు. భూసార పరీక్ష ఫలితాలు రానందున చాలామంది ఎదురు చూస్తున్నారు. కౌలు రైతులు గుర్తింపు కార్డులు, రుణాల కోసం ఆశగా చూస్తున్నారు.ఖరీఫ్‌లో జిల్లాలో సుమారు ఆరు లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. దీనికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. 
ఆశల సాగు.. (పశ్చిమగోదావరి)


గత మూడేళ్లుగా ఖరీఫ్‌లో ముందస్తుగా సాగు ప్రారంభించి మూడు పంటలు సాగు చేసే దిశగా వ్యవసాయ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి అది ఎంత వరకు సఫలీకృతం అవుతుందనేది నిరీక్షించాల్సిందే. గోదావరిలో కూడా ఇంకా ఇన్‌ఫ్లోలు పెరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో సకాలంలో వర్షాలు కురవకపోతే ఖరీఫ్‌కు కష్టకాలమే ఏర్పడుతుంది. ఇప్పటికే రైతులు నారుమళ్ల పనుల్లో నిమగ్నమయ్యారు. ఖరీఫ్‌ సాగుకు 1.11 లక్షల మెట్రిక్‌ టన్నుల విత్తనాలు అవసరమవులాయి. వీటిలో 20 శాతం ఆంధ్రప్రదేశ్‌ విత్తనోత్పత్తి సంస్థ (ఏపీ సీడ్స్‌), మరో 20 శాతం ప్రైవేట్‌ విత్తన సంస్థల ద్వారా, మిగిలిన 60 శాతం రైతుల స్థాయిలోనే సమకూర్చుకుంటున్నారు. విత్తనాల సేకరణకు అంతగా ఇబ్బందులు లేకపోయినా, రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోతున్న సంఘటనలు జిల్లాలో అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఈ ఖరీఫ్‌లో ఎంటీయూ 1001, 7029, 1061, 1064, 1075, 1112, 1121, 1029, పీఎల్‌ఏ 1100, బీపీటీ 5204, 3516 రకాలు సాగుకు అనుకూలం. అయితే గతేడాది దాళ్వాలో 1010 రకం సాగు తగ్గించాలని అధికారులు ప్రచారం చేశారు. రైతులు మాత్రం ఎంటీయూ 1010, 1121 రకాలను సాగు చేస్తున్నారు.గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద జిల్లాలోని ప్రతి మండలంలో రెండు నుంచి మూడు గ్రామాలకు సుమారు 200 వరకు యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో దానికి 25 ఎకరాలు విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. యూనిట్‌కు 25 మంది రైతులు, 25 ఎకరాలు అవసరమవుతుంది. ఒకేచోట 25 ఎకరాలు దొరికే పరిస్థితి లేక ఈ క్షేత్రాలను ఏ గ్రామంలో ఏర్పాటు చేయాలనే విషయం ఇంకా కొలిక్కి రాలేదు. వీటిల్లో రబీలో సాగయ్యే 1121, 1064 వరి విత్తనాలను వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తారు. ఈ ఏడాది జిల్లాలో భూసార పరీక్షలకు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి మండలం నుంచి ఒక గ్రామాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. 48 మండలాల్లో 10,167 నమూనాలు సేకరించారు. 8,500 వరకు ఆన్‌లైన్‌ చేశారు. ఈ కార్డులను సాగుకు ముందుగానే అందిస్తే భూసార పరీక్షల ద్వారా పొలాల్లో ఖనిజ లోపాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఖరీఫ్‌కు 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయి. జిల్లాలో ప్రస్తుతం 85 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. వరి పంటకు ఎరువులు ఒకేసారి కాకుండా దఫదఫాలుగా వేస్తారు. ప్రస్తుతం ఉన్న ఎరువులతో చాలావరకు అవసరాలు తీర్చుతాయని, మిగిలిన ఎరువులు క్రమంగా జిల్లాకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అర్హత కలిగిన కౌలురైతులందరికీ రుణ అర్హత కార్డులు అందించడానికి 948 రెవెన్యూ గ్రామాల్లో సభలు నిర్వహించి 33 వేల మందికి నూతన కార్డులందించారు. జిల్లాలో సుమారు 2 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉన్నారు. వీరిలో గతంలో 1.69 లక్షల మంది వరకు రుణ అర్హత కార్డులు పొందారు. 2017 ఖరీఫ్‌లో కౌలు రైతులకు రూ.636 కోట్ల రుణాలను అందించారు. వాటిని నవీకరించడంతో పాటు గతేడాది ఖరీఫ్‌లో అదనంగా మరికొంతమందికి రూ.800 కోట్ల వరకు రుణాలు అందించారు. ఈ ఏడాదీ రుణాలు అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన రుణాలు ఎప్పటికి నవీకరణ అవుతాయి.. నూతనంగా ఎప్పటికి అందుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. కానీ ఇంతవరకు రుణాలిచ్చేందుకు తీసుకున్న చర్యలు కనిపించడం లేదు.

No comments:

Post a Comment