విజయనగరం, జూన్ 19 (way2newstv.in):
జిల్లాలో తాగునీటి పథకాల్లో సింహభాగం పాతవి కావడంతో ఏటా పునరుద్ధరించాల్సి ఉంది. మరమ్మతులు చేపట్టడం.. పెరిగిన జనాభాకు అనుగుణంగా విస్తరించాలి. కాలపరిమితి దాటిపోయినా పంపుసెట్లు, మోటార్లను మార్పు చేస్తే కానీ పూర్తిస్థాయిలో నీరిచ్చే పరిస్థితి లేదు. వర్షాభావ పరిస్థితులు వీటికి తోడు కావడంతో భూగర్భజలాలు తగ్గుముఖం పట్టి నీటి పథకాల్లో తగినంత లభ్యత కొరవడుతోంది. ప్రత్యామ్నాయ చర్యలకు పెద్దఎత్తున నిధులు అవసరమవుతున్నాయి. దీంతో తాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది. దీన్ని అధిగమించడం అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది. గ్రామీణ నీటి సరఫరా గణాంకాల ప్రకారం జిల్లాలో 2,998 ఆవాసాలు ఉన్నాయి. 17,661 చేతి పంపులు, 1722 పీడబ్ల్యూఎస్/ఎంపీడబ్ల్యూఎస్, 32 సీపీడబ్ల్యూఎస్ పథకాలు ఉన్నాయి. వీటి నిర్వహణను స్థానిక సంస్థలు ఆర్థిక సంఘం నిధులతో అధిగమించాలి. స్థానిక సంస్థలు భరించలేని స్థాయిలో నిధులు అవసరమవుతుండడంతో ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆధారపడుతున్నారు. వేసవి నేపథ్యంలో జిల్లాకు రూ.19.05 కోట్లు అవసరమని ఫిబ్రవరిలో అధికారులు ప్రతిపాదించారు. రూ.1.50 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధుల నుంచే ప్రాధాన్యత వారీగా సమస్యలను అధిగమిస్తూ వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
కాసులొస్తేనే.. గొంత తడిసేది.. (విజయనగరం)
పథకాల్లో స్లూయీస్‌ల వద్ద వాల్వులు దెబ్బతినడం, స్కోర్ వాల్వులు, ఎయిర్ గాలి వాల్వ్‌లకు మరమ్మతులు.పైప్‌లైన్లు దెబ్బతిన్నాయి. వీటి స్థానంలో కొత్తవి వేయాల్సి ఉంది. పంపుసెట్లు కాలపరిమతి పూర్తి కావడంతో మార్పు చేయాలి. నీటి పంపులు (పేనల్ బోర్డుతో సహా) మరమ్మతులకు గురయ్యాయి. వీటిని పునరుద్ధరించాలి. ప్రధానంగా కొన్ని చోట్ల అదనంగా నీరిచ్చేందుకు పైప్‌లైన్లు, బోర్లు వేయాల్సిన (ఆగ్యుమెంటేషను) పనులు చేపట్టాలి.నీటి పథకాల పునరుద్ధరణ అలా ఉంటే పథకాల నిర్వహణ మాటేమిటన్నది ప్రశ్నార్థకమవుతోంది. సమగ్ర రక్షిత మంచి నీటి పథకాల(సీపీడబ్ల్యూ) నిర్వహణను జిల్లా పరిషత్తు పర్యవేక్షిస్తోంది. జిల్లాలో ఉన్న 32 సీపీడబ్ల్యూ పథకాల నిర్వహణను ఏటా టెండరు విధానంలో గుత్తేదారునికి అప్పగిస్తారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో నిధులు లేకపోవడంతో టెండర్లు నిర్వహించలేదు. పాత గుత్తేదారే సొంత నిధులతో నిర్వహణ సాగిస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలోనూ దీనికి ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. 2018-19లో పథకాల నిర్వహణకు రూ.32 కోట్లు అవసరముందని అంచనా వేశారు. పంచాయతీలు జనాభా ప్రాతిపదికన ఆర్థిక సంఘం నిధుల్లో రూ.7.50 కోట్లు మాత్రమే జడ్పీకి జమ చేశాయి. మిగిలిన రూ.25.50 కోట్లు ప్రత్యేక గ్రాంటుగా ఇవ్వాలని జడ్పీ యంత్రాంగం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. రూ.4 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులపై ఆంక్షలు రావడంతో నిలిచిపోయాయి. ఖజానాలో ఇప్పుడిప్పుడే ఆంక్షలు తొలగడంతో రూ.11.50 కోట్లను గుత్తేదారునికి చెల్లించాలి. మిగిలిన నిధులు విషయంలో ప్రభుత్వానికి రాసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి టెండర్లు వేయాలన్నా నిధులపై స్పష్టత రావాల్సి ఉంది.
No comments:
Post a Comment