Breaking News

19/06/2019

పక్షిపై ప్రేమ లేదా..? (కృష్ణాజిల్లా)

కైకలూరు, జూన్ 19 (way2newstv.in): 
ప్రకృతి సిద్ధమైన కొల్లేరు సరస్సులో వన్యప్రాణులు నేడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. సరస్సు పూర్తిగా ఎండిపోవడంతో పక్షులకు తాగేందుకు నీరు, గూడు కరవై.. ఆహారం లేక ప్రాణాలను కోల్పోతున్నాయి. వాటి మూగరోదన ఎవరికీ పట్టడం లేదు. నీటి కోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్న పక్షులు అక్కడ తుపాకీ తూటాలకు, వేటగాళ్ల విషతుల్య ఆహారానికి బలైపోతున్నాయి. అందమైన పక్షులకు అలవాలంగా ఉన్న కొల్లేరులో అరుదైన జాతుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. కొల్లేరులో చుక్కనీరు లేకుండా ఎండిపోవడంతో ఆహారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న పక్షులు వేటగాళ్లకు ఆహారంగా మారుతున్నాయి. కిక్కిసకు నిప్పు పెట్టడంతో పెద్దఎత్తున పక్షులు మృత్యువాత పడుతున్నాయి. అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి అప్పుడప్పుడు వేటగాళ్లు దొరుకుతున్నా వారిపై కేసులు నమోదు చేయకుండా ముడుపులను దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. కైకలూరు, మండవల్లి మండలాల పరిధిలోని కొల్లేరు గ్రామాల్లో ఈ పరిస్థితి కన్పిస్తోంది. కొల్లేరు సరస్సులోని నీటిని అక్రమంగా తవ్విన చెరువుల్లోనికి యంత్రాలను పెట్టి తోడేశారు. 

పక్షిపై ప్రేమ లేదా..? (కృష్ణాజిల్లా)

సరస్సులో ఎక్కడా నీరు లేకపోవడం, తాగునీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో పక్షులు నానా పాట్లు పడుతున్నాయి. కొల్లేరు ప్రాంతంతో పాటు ఆటపాక పక్షుల కేంద్రం వద్ద కూడా నీరు అడుగంటిపోయింది. దీంతో స్థానికంగా ఉండే పక్షులు మలమల మాడిపోతున్నాయి. పక్షులకోసం ఏర్పాటు చేసిన స్టాండ్లు సైతం వెలవెలబోతున్నాయి. పక్షుల సంరక్షణ కోసం కొల్లేరులో నిత్యం నీరు ఉండేలా చూడాలి. వర్షాకాలంలో వాగులు, వంకలు, కాలువలు, డ్రెయిన్ల ద్వారా కొల్లేరులోనికి వచ్చి చేరిన నీటిని నిల్వ చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదు. పర్యాటకం మాట దేవుడెరుగు.. కనీసం మూగజీవాల సంరక్షణ లేకుండా పోతోందని పర్యాటకులు విమర్శిస్తున్నారు.ఏటా కొల్లేరు సరస్సుకు రెండు లక్షలకు పైగా పక్షులు ఆహారం, సంతానోత్పతిద్త కోసం వస్తుంటాయి. తూర్పు ఐరోపా, ఉత్తరాసియా ప్రాంతాలనుంచి ఏటా పెద్దఎత్తున పక్షులు వచ్చి సంతానోత్పత్తి చేసుకుంటాయి. స్థానికంగా సుమారు 180 జాతుల వరకు నివసిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడే పెరిగే గ్రే పెలికాన్లు, ఆసియా ప్రాంతపు ఓపెన్‌ బిల్ల్‌డ్‌ స్టార్క్ప్‌, రంగురంగుల స్టార్క్ప్‌, గ్లోసీ ఇబిసెస్‌, తెల్లటి ఇబిసెస్‌, టేల్స్‌, పిన్‌టైల్స్‌, షోవేలార్స్‌ ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. ఏటా సెప్టెంబరులో ఇతర దేశాలనుంచి వచ్చే వలస పక్షులు రెడ్‌ క్రెస్టెడ్‌ పాచార్డ్స్‌, నలుపు రెక్కలుండే స్టిల్ట్స్‌, అవోసెట్స్‌, కామన్‌ రెడ్‌ షాంక్స్‌, నైజియన్స్‌, కార్మోరెంట్స్‌, గార్గ్‌నీస్‌, హెరాన్స్‌, ఫ్లెమింగో తదితరాలు ఏప్రిల్‌ నెల వరకూ ఉండి.. తిరిగి ఆయా దేశాలకు పిల్లలతో సహా వెళ్లిపోతుంటాయి. అవి ఉన్నంత వరకూ కాస్తోకూస్తో నీరు కొల్లేరులో ఉంటుంది. దీంతో అప్పుడు పెద్దగా ఆహారానికి, నీటికి ఇబ్బంది ఉండదు. విదేశీ వలస పక్షులు వెళ్లిపోయాక.. సరస్సులో ఉన్న కొద్దిపాటి నీటిని చేపల చెరువులకు మళ్లించడం, ఆక్రమిత చెరువుల్లో అడుగు పట్టుబడుల పేరిట ఉన్న నీటిని తొలగించడంతో స్థానికంగా ఉన్న పక్షులకు కష్టకాలం తప్పదు.ఏటా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పెద్ద ఎత్తున నీటి ప్రవాహం సరస్సులోకి చేరుతుంది. కొల్లేరు మత్స్య సంపద వృద్ధి చెందుతుంది. ప్రస్తుతం సరస్సులోకి వచ్చే ప్రధాన డ్రెయిన్లను పోలవరం కుడి కాలువలోని మళ్లించడంతో నీటి ప్రవాహం ప్రస్తుతం తగ్గిపోయింది. ఏటా 64 చిన్న, పెద్ద డ్రెయిన్ల ద్వారా పదివేల క్యూసెక్కుల వరదనీరు కొల్లేరులోని వచ్చి చేరేది. వాతావరణ ప్రతికూల పరిస్థితులు, డ్రెయిన్ల మళ్లింపుతో ప్రస్తుతం సరస్సులోకి వచ్చే నీటి శాతం బాగా తగ్గిపోయింది. దీంతో సంతానాన్ని అభివృద్ధి చేసుకోవాలని వేల కిలోమీటర్లు దాటి వచ్చిన అరుదైన పక్షులకు ఇక్కడ నీరు, ఆహారం, గూడ కరవై అలమటిస్తున్నాయి. ఏటా లక్షల్లో వచ్చే పక్షులు రెండేళ్లుగా బాగా తక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్‌, మే నెలల్లో కనీసం పశువులు తాగేందుకు కూడా నీరు లభించడం లేదు. దీంతో స్థానికంగా ఉండే పక్షి జాతులు ప్రాణాంతక స్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులు పర్యావరణాన్ని దెబ్బతీసేటట్లు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యాన్ని సంరక్షించేందుకు బలమైన రక్షణ వ్యవస్థ ఉన్నా పక్షుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కొల్లేరు పరీవాహక ప్రాంతంలో ఇష్టారాజ్యంగా పెరుగుతున్న ఉప్పునీటి సాగు సైతం పక్షులకు ప్రాణాంతకంగా మారుతోంది. సాగుచేసిన నీటిలోని హానికారక రసాయనాలను శుద్ధిచేయకుండా కొల్లేరులోకి విడుస్తుండటంతో అరుదైన నల్లజాతి మీనం అంతరించిపోతోంది. వ్యర్థాలు తిని జీవించే చేపల్ని పక్షులు వేటాడి అవి కూడా మృత్యువాతపడుతున్నాయి. స్థానికంగా నివసించే పక్షుల వేట గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. ఏటా పెద్దఎత్తున పక్షులు వేటగాళ్ల ఉచ్చులకు, తుపాకీ గుళ్లకు బలైపోతున్నాయి. నడికొల్లేరులో విషగుళికలు తిని మరణిస్తున్నాయి. మండవల్లి మండలంలోని చింతపాడు, పెనుమాకలంక, పులపర్రు, తక్కెళ్లపాడు, కైకలూరు మండలంలో నత్తగుళ్లపాడు శృంగవరప్పాడు, ఆటపాక, ఆలపాడు, పెంచికలమర్రు, కొట్టాడ గ్రామాల్లో పక్షుల వేట విస్తృతంగా సాగుతోంది. అభయారణ్య సంరక్షణ కోసం ఏర్పాటైన నిఘావ్యవస్థ, అటవీ శాఖ యంత్రాంగం, చెక్‌పోస్టులు.. ఏవీ పక్షులకు వేటగాళ్ల నుంచి రక్షణ కల్పించలేకపోతున్నాయి.

No comments:

Post a Comment