Breaking News

01/06/2019

గ్రామ వలంటీర్ల నియామకంపై విధివిధానాలు


విజయవాడ, జూన్ 1  (way2newstv.in):
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజున ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు నేరుగా చేరవేయడానికి వలంటీర్లను నియమించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామ వాలంటీర్ల నియామకాలకు సంబంధించి విధివిధానాల తయారీపై అధికారిక స్థాయిలో తొలి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొని ప్రాథమికంగా చర్చించారు. రాష్ట్రంలో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీరును నియమిస్తామని జగన్ ప్రకటించారు. 


గ్రామ వలంటీర్ల నియామకంపై విధివిధానాలు
ఈ నేపథ్యంలో విధివిధానాలను పకడ్బందీగా రూపొందించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా విధివిధానాల రూపకల్పనకు త్వరలో అధికారిక కమిటీ ఏర్పాటుకానుంది. ఈ సమావేశంలో సీఎం కార్యాలయ కార్యదర్శి సోల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్‌, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌, సర్వేశాఖ డైరెక్టర్ ప్రభాకరరెడ్డి, భూ పరిపాలన శాఖ కార్యదర్శి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది యువతీ యువకులకు ఉపాధి అవకాశం కల్పిస్తామని జగన్ వెల్లడించారు. గ్రామ వాలంటీర్లకు ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున వేతనంగా చెల్లిస్తామని సీఎం జగన్ చెప్పారు. సేవాభావం ఉన్న యువతీ యువకులను గ్రామ వాలంటీర్లుగా తీసుకుంటామని ప్రకటించారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమిస్తామని చెప్పారు. ఆగస్టు 15 వరకు గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment