Breaking News

17/05/2019

అర్థం కాని జగన్ మౌనం

విజయవాడ, మే 17, (way2newstv.in)
ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ చంద్ర‌బాబు నాయుడు యూపీఏలో చ‌క్రం తిప్ప‌డానికి.. మ‌రో వైపు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేయ‌డానికి క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేశారు.ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు అంగీక‌రించే పార్టీకే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. అయితే, బీజేపీ ఐదేళ్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు అంగీక‌రించ‌లేదు. జ‌గ‌న్ బీజేపీ వైపే ఉన్నార‌ని టీడీపీ చెబుతున్నా ఆయ‌న మాత్రం బీజేపీతో క‌లుస్తున్న‌ట్లు ఎక్క‌డా చెప్ప‌లేదు. బీజేపీతో క‌లిసేందుకు జ‌గ‌న్ వ‌ద్ద బ‌ల‌మైన కార‌ణం కూడా లేదు. ఐదేళ్లు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని బీజేపీ ఇప్పుడు ఇస్తుంద‌న్న న‌మ్మ‌కం లేదు. ఇద్ద‌రు నేత‌లూ వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ వారిని క‌లుపుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న 23న కౌంటింగ్ త‌ర్వాత ఏ అవ‌కాశాన్నీ వ‌దులుకోకుండా కేంద్రంలో ఏర్ప‌డ‌బోయే ప్ర‌భుత్వంలో త‌మ పాత్ర ఉండాల‌ని ఉవ్విళ్లురుతున్నారు. అయితే, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి, క‌చ్చితంగా 20 సీట్లు గెలుచుకుంటామ‌ని ధీమాగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మాత్రం మౌన‌వ్ర‌తం తీసుకున్నారు. 


అర్థం కాని జగన్ మౌనం

చిన్న చిన్న పార్టీలు కూడా కేంద్రం త‌మ మ‌ద్ద‌తు ఎవ‌రికో, తాము ఎవ‌రి వైపు ఉంటామో చెబుతుండ‌గా జ‌గ‌న్ మాత్రం కేంద్ర రాజ‌కీయాల‌పై నోరు విప్ప‌డం లేదు. అయితే, జ‌గ‌న్ ను త‌మ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయ‌ని తెలుస్తోంది. బీజేపీతో క‌లిస్తే జ‌గ‌న్ కు ఓటు బ్యాంకుగా ఉన్న మైనారిటీలు దూర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది. దీంతో జ‌గ‌న్ బీజేపీ వైపు ఉండ‌క‌పోవ‌చ్చు అనే అంచ‌నాలు ఉన్నాయి. అయితే, క‌చ్చితంగా ప్ర‌భుత్వం ఏర్పాటుచేయాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్న బీజేపీ పెద్ద‌లు జ‌గ‌న్ ను త‌మ వైపు తిప్పుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బీజేపీ కీల‌క నేత రామ్ మాధ‌వ్ జ‌గ‌న్ తో ట‌చ్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు కూడా బీజేపీ సిద్ధ‌ప‌డ‌వ‌చ్చ‌ని, జ‌గ‌న్ కు క‌నుక మంచి స్థానాలు వ‌చ్చి, ఆయ‌న మ‌ద్ద‌తు అవ‌స‌రం అనుకుంటే జ‌గ‌న్ ష‌ర‌తుకు బీజేపీ అంగీక‌రించ‌వ‌చ్చంటున్నారు.ఇక‌, కాంగ్రెస్ పార్టీ సైతం జ‌గ‌న్ ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందుకుగానూ జ‌గ‌న్ ఎక్కువ‌గా అభిమానించే ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని, జ‌గ‌న్ తో మంచి సంబంధాలు ఉన్న వీర‌ప్ప మొయిలీని ఉప‌యోగించుకొని జ‌గ‌న్ ను త‌మవైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ ప్ర‌య‌త్నిస్తోంద‌ట‌. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని కాంగ్రెస్ చెప్పినందున జ‌గ‌న్ ష‌ర‌తు కూడా అంగీక‌రించిన‌ట్లే అవుతుంది. అయితే, ఇప్ప‌టికే కాంగ్రెస్ తో చంద్ర‌బాబు ఉన్నారు. పైగా రాహుల్ గాంధీ చంద్ర‌బాబుకు ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇస్తున్నారు. కానీ, తాము క‌చ్చితంగా 20 ఎంపీ సీట్లు గెలుస్తామ‌ని, తాము గెలిచే సీట్ల సంఖ్య‌తోనే కేంద్రంలో త‌మ‌కు ప్రాధాన్య‌త పెరుగుతుంద‌ని వైసీపీ భావిస్తోంది. అందుకే ఫ‌లితాల‌కు ముందే హ‌డావుడి చేయ‌డం కంటే ఫ‌లితాలు వ‌చ్చాక త‌మ నంబ‌ర్లే మాట్లాడ‌తాయ‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. అందుకే కేంద్ర రాజ‌కీయాల‌పై ఆయ‌న నోరు విప్ప‌డం లేదు.

No comments:

Post a Comment