Breaking News

07/05/2019

కీలకం కోసం కేసీఆర్ యత్నాలు

హైద్రాబాద్, మే 6, (way2newstv.in)
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ళ్లీ దేశ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాల‌నే త‌న ప్ర‌య‌త్నాల‌కు ఆయ‌న మ‌రోసారి ప‌దును పెట్టారు. ఇందుకోసం ఆయ‌న దక్షిణాధి రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో ఆయ‌న వారం రోజుల పాటు ప‌ర్య‌టించనున్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత దేశ రాజ‌కీయాల్లో ఫెడ‌రల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాల‌నేది కేసీఆర్ వ్యూహం. ఇప్ప‌టికే ఆరు నెల‌లుగా ఆయ‌న ప‌లుమార్లు ఈ ప్ర‌య‌త్నాలు చేశారు. వివిధ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించి ప‌లువురు ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో త‌న అభిప్రాయాల‌ను, ఆలోచ‌న‌ల‌ను పంచుకున్నారు. కేంద్రం చేతిలో అన్ని అధికారాలు పెట్టుకుని రాష్ట్రాల‌పై పెత్త‌నం చెలాయిస్తున్నందున ప్రాంతీయ పార్టీల‌న్నీ ఏక‌తాటిపైకి వ‌చ్చి కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌నేది ఆయ‌న ఆలోచ‌న‌. స్వ‌తంత్ర భార‌త‌దేశంలో ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్, బీజేపీల పాల‌న‌లో దేశ ప్ర‌జ‌ల‌కు ఒరిగిందేమీ లేద‌ని, కాబ‌ట్టి ఈసారి ప్రాంతీయ పార్టీల కూట‌మి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కేంద్రంలో కీల‌కం కావాల‌ని భావిస్తున్నారు,అయితే, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇది సాధ్య‌మేనా అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. కేసీఆర్ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం అనుమానంగానే క‌నిపిస్తోంది. 


కీలకం కోసం కేసీఆర్ యత్నాలు

ఫెడ‌ర‌ల్ ప్రంట్ అధికారంలోకి రాక‌పోయినా కేంద్రంలో రాబోయే ప్ర‌భుత్వంలో ఫ్రంట్ కీల‌కం కావాల‌ని, త‌ద్వారా రాష్ట్రాల‌కు మేలు జ‌రుగుతుంద‌నేది ఆయ‌న భావ‌న‌. కానీ, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో చేరే వారు ఎవ‌ర‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. దేశంలో న‌రేంద్ర మోడీ బ‌లంగా ఉన్నందున ఆయ‌న‌ను ఓడించేందుకు వ్య‌తిరేక ప‌క్షాల‌న్నీ ఒక్క తాటిపైకి చేరాయి. అఖిలేష్ యాద‌వ్‌, మాయావ‌తి, మ‌మ‌తా బెన‌ర్జీ, స్టాలిన్‌, అర‌వింద్ కేజ్రీవాల్‌, చంద్ర‌బాబు నాయుడు, కుమార‌స్వామి అంతా ఒక్క‌తాటిపైకి వ‌చ్చారు. వీరంతా న‌రేంద్ర మోడీకి వ్య‌తిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ తో నేరుగా కాక‌పోయినా మోడీని గ‌ద్దె దించేందుకు కాంగ్రెస్ తో క‌లిసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ప‌రిస్థితిలో ఈ పార్టీల్లో కేసీఆర్ తో ఎవ‌రూ క‌లిసి వ‌స్తార‌ని చెప్ప‌లేం. కేసీఆర్ కేర‌ళ వెళ్లి ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌యన్ ను క‌ల‌వ‌నున్నారు. ఆయ‌న పార్టీ సీపీఎం ఇప్ప‌టికే న‌రేంద్ర మోడీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీతో అవ‌గాహ‌నతో ఉంది. అయినా, జాతీయ పార్టీగా ఉన్న సీపీఎంలో నిర్ణ‌యాలు విజ‌యన్ తీసుకునే అవ‌కాశం లేదు. ఏదైనా ఉంటే ఆ పార్టీ పెద్ద‌లు నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక‌, కేర‌ళ త‌ర్వాత ఆయ‌న త‌మిళ‌నాడు వెళ్లి డీఎంకే అధినేత స్టాలిన్ ను క‌ల‌వ‌నున్నారు. డీఎంకే ఇప్ప‌టికే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఉంది. రాహుల్ గాంధీ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థి అని ప‌దే ప‌దే చెబుతున్నారు. కాబ‌ట్టి, స్టాలిన్ కూడా కాంగ్రెస్ ను వీడి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ తో క‌లుస్తార‌ని క‌చ్చితంగా చెప్ప‌లేం. ఇక‌, కేసీఆర్ క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామితో మంచి సంబందాలు నెరుపుతున్నారు. ఇటీవ‌ల కూడా కేసీఆర్ అడ‌గ‌గానే ఆయ‌న జూరాల‌కు నీటిని విడుద‌ల చేశారు.కానీ, కాంగ్రెస్ తో క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటు చేసిన ఆయ‌న‌కు రాష్ట్ర‌మే కీల‌కం. ఈ ప‌రిస్థితిలో కాంగ్రెస్ ను వీడితే ముఖ్య‌మంత్రి ప‌ద‌విని వ‌దులుకోవాల్సిందే. కాబ‌ట్టి ఆయ‌న కూడా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో క‌లిసే ధైర్యం చేయ‌క‌పోవ‌చ్చు.మ‌మ‌తా బెన‌ర్జీ కూడా కాంగ్రెస్ లేకుండా కూట‌మి సాధ్యం కాద‌నే ఆలోచ‌న‌తో ఉన్నారు. ఆమె చంద్రబాబుకు ఎక్కువ ప్ర‌ధాన్య‌త ఇస్తున్నారు. ఆమె కూడా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో క‌లిసే ప‌రిస్థితి లేదు. ఇక‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ ఈ ఫ్రంట్ లో క‌లిసే అవ‌కాశం ఉంద‌ని టీఆర్ఎస్ భావిస్తోంది. కేసీఆర్ ఆలోచ‌న‌తో జ‌గ‌న్ గ‌తంలోనే ఏకీభ‌వించారు. అయితే, త‌న‌కు జాతీయ రాజ‌కీయాల కంటే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదానే ముఖ్య‌మని ప‌దేప‌దే చెబుతున్నారు. కాబ‌ట్టి ఆయ‌న ఎవ‌రు హోదా ఇస్తామంటే వారికే మ‌ద్ద‌తు ఇస్తారు. ఒడిశాలో న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఇప్ప‌టికైతే త‌ట‌స్థంగా ఉంటున్నారు. ఇలా కేసీఆర్ ఆలోచ‌న స‌రైన‌దే అయినా ఇప్పుడున్న ప‌రిస్థితిలో దేశంలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ వంటి మూడో కూట‌మి సాధ్యం కాక‌పోవ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment