Breaking News

25/05/2019

స్థానిక ఎన్నికలకు సిద్ధం చేయాల్సిన పనిలో బాబు


గుంటూరు, మే 25, (way2newstv.in)
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు ఏం చేయబోతున్నారు. ఆయన ప్రతిపక్షంలో కూర్చుంటారా? లేక మరెవరికైనా ఆ బాధ్యతలను అప్పగిస్తారా? ఇదే చర్చ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోనూ ముఖ్యంగా టీడీపీలోనూ జోరుగా చర్చ జరుగుతోంది. చంద్రబాబునాయుడుకు, తెలుగుదేశం పార్టీకి గతంలో ఎన్నడూ ఇంతటి ఘోరమైన పరాజయం ఎదురుకాలేదు.కేవలం పాతిక సీట్లకే పరిమితమవ్వడం నలభై ఏళ్ల రాజీకీయ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడుకు మింగుడు పడటం లేదు. సునామీలా తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోవడాన్ని ఆయన 
జీర్ణించుకోలేకపోతున్నారు.చంద్రబాబునాయుడు తన ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వస్తారా? రారా? అన్న చర్చ జరుగుతోంది. కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు తగిన గౌరవం ఇవ్వలేదు. 


స్థానిక ఎన్నికలకు సిద్ధం చేయాల్సిన పనిలో బాబు

పైగా అసెంబ్లీ లో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతి తక్కువ మంది సభ్యులతో చంద్రబాబునాయుడు అసెంబ్లీకి హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. స్పీకర్ ఎవరనేదాన్ని బట్టి కూడా చంద్రబాబు నిర్ణయం సమావేశాలకు హాజరయ్యేదీ? లేనిదీ? తెలుస్తుందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.అయితే చంద్రబాబునాయుడు ఒకపట్టాన వదలిపెట్టరు. దాదాపు పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఐదేళ్ల పాటు పోరాడారు. పార్టీని పదేళ్ల పాటు చంద్రబాబు కాపాడుకున్నారు. ప్రజాసమస్యలపై పోరాడారు. కానీ అది పదేళ్ల కిందటి మాట. ఇప్పుడు చంద్రబాబు వయసు కూడా పోరాటాలకు సహకరించాల్సి ఉంటుందని అనేవారు కూడా లేకపోలేదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో దాదాపుగా భూస్థాపితం అయింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ అలాంటి పరిస్థితి రాకుండా చంద్రబాబునాయుడు కార్యాచరణ ప్రకటిస్తారని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు.మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల సమయానికి చంద్రబాబునాయుడు తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని భావిస్తున్నారు. 
ఎన్నికల్లో ఘోర ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని తిరిగి పుంజుకుంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ ఎదుట ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కూర్చోవడం వృధా అని మరికొందరు టీడీపీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండి, శాసనసభలో మరొకరికి శాసనసభ పక్ష నేతగా అవకాశమిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబునాయుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటారా? అన్న చర్చ ఆసక్తికరంగా మారింది.

No comments:

Post a Comment