Breaking News

03/05/2019

ఉపాధికి మార్గం.. డ్రైవింగ్

హైద్రాబాద్, మే 3, (way2newstv.in)
డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చిన శిక్షణతో గత పదేళ్లలో సుమారు 10 లక్షల మంది యువతకు డ్రైవర్లుగా ఉపాధి లభించింది. అంటే ఏటా సరాసరిన లక్ష మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతం పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య నాలుగు లక్షలకు మించదు. వీరిలో ప్రభుత్వ డ్రైవర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగాలు చాలా తక్కువగా ఉంటుండగా, డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి.. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారికంగా 250 వరకు డ్రైవింగ్ స్కూళ్లు నడుస్తున్నాయి. వీటిలో కేవలం హైదరాబాద్‌లోనే 150 డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నాయని రవాణాశాఖ జాయింట్ కమిషనర్ పాండురంగ నాయక్ ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. 


ఉపాధికి మార్గం.. డ్రైవింగ్

మిగతావి జిల్లాల్లో నడుస్తున్నాయి. ఇవి కాకుండా అనధికారికంగా మరో 300 డ్రైవింగ్ స్కూళ్లు నడస్తున్నాయని తెలిసింది.డ్రైవింగ్‌లో శిక్షణ పొందుతున్న వారు రెండు రకాలుగా ఉన్నారు. ఒకరు సొంత వాహనాలను నడుపుకునేందుకు శిక్షణ పొందుతుండగా, ఇతరులు డ్రైవింగ్‌ను ఉపాధికోసం ఉపయోగించుకుంటున్నారు. నెల లేదా రెండు నెలల్లో డ్రైవింగ్ శిక్షణ పూర్తవుతోంది. ఒక్కొక్కరికి నెల రోజుల్లోగా డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నామని తిరుమల మోటార్ డ్రైవింగ్ స్కూల్ యజమాని తిరుపతిరావు తెలిపారు. సమాజంలో ఎక్కువ మంది యువతకు ఉపాధి కల్పిస్తున్న సంస్థల్లో డ్రైవింగ్ స్కూళ్లు మొదటి స్థానంలో నిలుస్తాయన్నారు. కేవలం తమ సంస్థ గత 16 సంవత్సరాల్లో దాదాపు 10 వేల మందికి శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. డ్రైవింగ్ శిక్షణ పూర్తయిన వారు డ్రైవర్లుగా చేరితే నెలకు రూ. 10 వేల నుండి 20 వేల వరకు వేతనం లభిస్తోందని వివరించారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలు వేల సంఖ్యలో ఉన్నాయని, ప్రతి కంపెనీకి ఒకరు లేదా అంతకు మించి డ్రైవర్లు అవసరం అవుతారన్నారు. తమ స్కూళ్లలో శిక్షణ పూర్తయిన తర్వాత రవాణాశాఖ సదరు అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తోందని, ఈ లైసెన్స్ ఉన్నవారికి సమాజంలో మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేయడంతోపాటు మరికొందరు ఓలా, ఊబర్‌లాంటి రవాణా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని కార్లు నడుపుతూ నెలకు రూ. 20వేల నుండి 40 వేల వరకు సంపాదిస్తున్నారని వివరించారు. 

No comments:

Post a Comment