Breaking News

25/05/2019

వెనక్కి తిరగని ధీరత్వం...


పదేళ్ల పాటు ప్రజల్లోనే జగన్
హైద్రాబాద్, మే 25  (way2newstv.in)
వైఎస్ జగన్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా నానుతున్న పేరిది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్.. 2019లో సీఎం పీఠాన్ని అధిష్టిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఈ ఘనవిజయం జగన్‌కు అంత తేలిగ్గా ఏం దక్కలేదు. కడప ఎంపీగా గెలుపొంది, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్.. ఈ పదేళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అక్రమంగా లక్ష కోట్లు సంపాదించాడని విపరీతంగా ప్రచారం చేసినా.. కేసులు మోపు జైల్లో పెట్టినా.. అనుకున్న లక్ష్యం కోసం మొండిగా పోరాడారు. మరొకరైతే ఒత్తిడికి లొంగిపోయేవారేమో.. కానీ జగన్ మాత్రం మొక్కవోని సంకల్పంతో అనుకున్నది సాధించారు. జగన్‌ పోరాడిన తీరు నుంచి యువత సక్సెస్ పాఠాలను నేర్చుకోవచ్చు. 2008లో సాక్షి దినపత్రిక ప్రారంభమైనప్పుడు జగన్‌ను అందరూ వైఎస్ కొడుకుగా, వ్యాపారవేత్తగా మాత్రమే చూశారు. 2009 ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్.. కడప ఎంపీగా గెలుపొందారు. కానీ అదే కొద్ది నెలల వ్యవధిలోనే.. సెప్టెంబర్ 2న వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. 


వెనక్కి తిరగని ధీరత్వం...

వైఎస్ మరణం తర్వాత.. జగన్‌ని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ.. ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేసిన లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం జగన్‌ను సీఎం చేయడానికి అంగీకరించలేదు. వైఎస్ స్థానంలో రోశయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆయన్ను అభిమానించే వందలాది గుండెలు ఆగిపోయాయి. వారి కుటుంబాలను పరామర్శించడం కోసం.. జగన్ ‘ఓదార్పు యాత్ర’కు శ్రీకారం చుట్టారు. దీనికి కాంగ్రెస్ పెద్దలు సమ్మతించలేదు. విజయమ్మ ఢిల్లీ వెళ్లి కోరినా ఫలితం కనిపించలేదు. కాంగ్రెస్ హైకమాండ్‌తో విబేధించిన జగన్.. ధైర్యంగా అడుగు ముందుకేసి.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబీకులను ఓదార్చడం కోసం ‘ఓదార్పు యాత్ర’ ప్రారంభించారు. మీరంతా నా కుటుంబ సభ్యులేనని వారిలో భరోసా నింపారు. 2010లో కాంగ్రెస్‌కు, పదవులకు రాజీనామా చేసిన జగన్, విజయమ్మ.. తన తండ్రి పేరు కలిసొచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై జగన్ అవిశ్వాస తీర్మాన ప్రవేశపెట్టగా.. 17 మంది ఎమ్మెల్యేలు ఆయనకు అండగా నిలిచారు. వారిపై అనర్హత వేటు పడటంతో.. ఉపఎన్నికల్లో గెలిపించుకున్నారు. తర్వాత జగన్‌పై రకరకాలుగా ఒత్తిడి పెరిగింది. కానీ స్వతహాగా మొండి వాడయిన జగన్ వెనక్కి తగ్గలేదు. దీంతో అతడిపై అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. సీబీఐ, ఈడీ విచారణలతో జగన్‌ను ఇబ్బంది పెట్టారు. లక్ష కోట్ల అక్రమాస్తులంటూ మీడియాలో వార్తలు, ఆస్తుల అటాచ్‌మెంట్, 16 నెలల జైలు జీవితం. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న బెయిల్ లభ్యం కాలేదు. మరొకరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడికి తలొగ్గే వారే. కానీ జగన్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. కష్ట సమయంలో ఆయనకు తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల అండగా నిలిచారు. సోషల్ మీడియాలో ఫ్యామిలీపై దుష్ప్రచారం. జగన్‌పై అవినీతిపరుడనే ముద్ర. వైఎస్ కొడుకనే అభిమానం ఉన్నప్పటికీ.. 2014 ఎన్నికల్లో ‘అవినీతి మరక’ జగన్‌కు ప్రతికూలమైంది. జగన్ వస్తాడని బలంగా నమ్మినప్పటికీ.. చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్ కూటమి బలం ముందు స్వల్ప తేడాతో జగన్ అధికారానికి దూరమయ్యారు. తన మాస్ ఇమేజీకి, వ్యూహరచన తోడు కావాలని భావించిన జగన్.. ప్రశాంత్ కిశోర్ టీం సలహాలు కోరారు. ఇది వైఎస్ఆర్సీపీకి మేలు చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ‘సమైక్యాంధ్ర’ కోసం నినదించిన జగన్.. రాష్ట్రం ఏర్పాటయ్యాక.. ప్రత్యేక హోదా కోసం గళం వినిపించారు. తమకు హోదా మాత్రమే కావాలని, ప్యాకేజీ వద్దని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం తమ గళాన్ని వినిపించలేని పరిస్థితి. 2019 ఎన్నికల్లోనూ ఓడిపోతే వైఎస్ఆర్సీపీ కనుమరుగయ్యే పరిస్థితి. ఈ తరుణంలో జగన్ జనాన్ని నమ్ముకున్నారు. తన తండ్రి చూపిన బాటలో పయనించి.. ఎన్నికలు సుదూరంగా ఉండగానే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 341 రోజులపాటు 113 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా.. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3648 కి.మీ. పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో 2 కోట్ల మందికిపైగా ప్రజలను ప్రత్యక్షంగా కలిశారాయన. 36 ఏళ్ల వయసులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జగన్.. ఈ పదేళ్ల రాజకీయ జీవితంలో మరే ఇతర నాయకుడూ ఎదుర్కోనన్ని ఇబ్బందులు పడ్డారు. తండ్రి అకాల మరణం, అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లడం, తొలి ఎన్నికల్లో ఓటమి.. ఇలా ప్రతికూల పరిస్థితుల్లోనూ మొండి పట్టుదలతో లక్ష్య దివిశగానే సాగాడు. మనకెన్ని అవాంతరాలు ఎదురైనా సరే.. లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. సాధించాలనే తపన, తగిన కార్యచరణ తోడైతే.. విజయం తప్పక సిద్ధిస్తుందని చెప్పడానికి జగన్ పదేళ్ల రాజకీయ ప్రస్థానమే నిదర్శనం

No comments:

Post a Comment