Breaking News

25/05/2019

ఏపీలో చతికిలపడ్డ జాతీయ పార్టీలు


నోటా కంటే తక్కువ ఓట్లు 
విజయవాడ, మే 25 (way2newstv.in )
దేశంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు ఏపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని చాలా మంది అంచనా వేశారు. వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు ఉండటమే ఇందుక్కారణం. ఫలితాల్లోనూ అదే నిజమైంది. కానీ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అందరూ ఊహించిన దానికంటే గట్టి షాక్ తగిలింది. ఈ ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు సగానికి పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారు. ‘నోటా’ (ఏ అభ్యర్థీ ఇష్టంలేదు)కు పోలైన ఓట్ల కంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన ఓట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఏపీలో ఈ ఇరు పార్టీలను ప్రజలు ఎంతలా ఛీకొట్టారో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. 25 లోక్‌సభ స్థానాల్లో కలిపి నోటాకు 1.5 శాతం ఓట్లు పోలవగా.. బీజేపీ ఓట్ల షేరింగ్ కేవలం 0.96 శాతం మాత్రమే. కాంగ్రెస్ 1.29 శాతం ఓట్లతో కాస్త పర్వాలేదనిపించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ ఇదే సీన్ రిపీటైంది. 175 స్థానాల్లో కలిపి నోటా మీటకు 1.28 శాతం ఓట్లు పోలవగా.. బీజేపీ 0.84, కాంగ్రెస్ 1.17 శాతం ఓట్లు పోలయ్యాయి. మార్పు నినాదంతో ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన జనసేన పార్టీ పరిస్థితి కూడా దాదాపుగా ఇదే. సుమారు 30 స్థానాల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. 


ఏపీలో చతికిలపడ్డ జాతీయ పార్టీలు
ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన పార్టీ కాంగ్రెస్‌పై ఏపీ ప్రజలు 2014 ఎన్నికల్లోనే కక్ష తీర్చుకున్నారు. అప్పటివరకూ అధికారంలో ఉన్న ఆ పార్టీని ఏకంగా ‘సున్నా’కు పరిమితం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆ దెబ్బ నుంచి కోలుకోలేదు. కాంగ్రెస్ తమకు అన్యాయం చేసిన నేపథ్యంలో బీజేపీ తమను ఆదుకుంటుందని ఏపీ ప్రజలు భావించారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలిచిన చంద్రబాబు నాయుడుని 2014లో బాగా ఆదరించారు. అయితే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదావిషయంలో ఇరు పార్టీలు ఆడిన డ్రామాలకు జనం తగిన గుణపాఠం చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులకు ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కలేదు. జనసేనతో కలిసి పోటీ చేసిన బీఎస్పీ, వామపక్షాల పరిస్థితి కూడా ఇదే.  టీడీపీ కూడా అరకు అసెంబ్లీ స్థానంలో డిపాజిట్‌ కోల్పోయింది. అరకులో ఆ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌కు కేవలం 19,929 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వైసీపీ ఓడిపోయిన 23 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాల్లో గణనీయ సంఖ్యలోనే ఓట్లు సాధించింది. జనసేన పోటీ చేసిన వాటిల్లో 15 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో డిపాజిట్లను దక్కించుకొని పరువు నిలుపుకుంది. కాంగ్రెస్‌ 175 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా ఎక్కడా డిపాజిట్లు రాలేదు. కళ్యాణదుర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రఘువీరారెడ్డికి కేవలం 28,883 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో రఘువీరారెడ్డి వచ్చిన ఓట్లే అత్యధికం కావడం గమనార్హం. ఎచ్చెర్ల, పోలవరం, మడకశిరల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు 5 వేలకు మించి ఓట్లు పోలయ్యాయి. బీజేపీ 174 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా.. ఎక్కడా డిపాజిట్లు దక్కలేదు. ఆ పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల సంఖ్య 5 వేలు దాటలేదు.  లోక్‌సభ ఎన్నికల్లోను బీజేపీకి చేదు అనుభవమే దక్కింది. నర్సరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు కేవలం 15,468 ఓట్లు మాత్రమే పోలయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక విశాఖ నుంచి పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి  పురంధేశ్వరికి 33,892 ఓట్లు మాత్రమే లభించాయి. ఆమె కూడా ధరావతు కోల్పోయారు.

No comments:

Post a Comment