Breaking News

24/05/2019

పైకి రాని పాతళ గంగమ్మ

నల్గొండ, మే 24, (way2newstv.in)

భూగర్భ జలాలు అడుగంటి.. రైతన్నకు కన్నీరు మిగులుతోంది. 750 అడుగుల లోతు బోర్లు వేసినా.. పాతాళ గంగమ్మ పైకి రాకపోవడంతో.. కంటికి రెప్పలా కాపాడుకున్న పండ్ల తోటలు ఎండిపోతున్నాయి. తోటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలెన్నో చేసి.. ఫలించకపోవడంతో ఎటూ పాలుపోక రైతన్నలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే బత్తాయి సాగులో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉండేది. నల్లగొండ పరిసర ప్రాంతాల్లో బత్తాయి తోటలు ఎక్కువగా ఉన్నాయి. కాగా నాలుగేళ్లుగా తోటల సంఖ్య తగ్గిపోతోంది.దీనికి ప్రధాన కారణం భూగర్భ జలాలు అడుగంటి.. నీరు లేకపోవడంతో రైతులు తోటలను తొలగిస్తున్నారు. ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితులతో బోర్లలోని నీరు ఇంకిపోయి తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. 


పైకి రాని పాతళ గంగమ్మ
చెట్లమీద నిమ్మకాయ సైజులో ఉన్న బత్తాయి కాయలు ఎండిపోయి రాలుతున్నాయి. బత్తాయితో పాటు దానిమ్మ, మామిడి తోటల పరిస్థితి కూడా అలాగే ఉంది. దిగుబడి మాట దేవుడెరుగు కనీసం తోటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లు వేయడం, ట్యాంకర్లద్వారా నీటి అందిస్తూ.. భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న బత్తాయితోటలు దిగుబడిని ఇచ్చే సమయంలో ఎండిపోతుండడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.ఎండిన బత్తాయి చెట్లను రైతులు బొగ్గు వ్యాపారులకు అప్పగిస్తున్నారు. ఎండిన చెట్లకు తమకేమీ డబ్బులు వద్దని.. చెట్లు తొలగించి బొగ్గుబట్టీలకు తీసుకెళ్లండంటూ బొగ్గుబట్టీల వ్యాపారులను రైతులు బతిమిలాడి అప్పగిస్తున్నారు. దీంతో బొగ్గుబట్టీల వ్యాపారులు, రంపాలతో కోసి ట్రాక్టర్ల ద్వారా బత్తాయి మొద్దులను తరలిస్తున్నారు.ఎండిన పండ్ల తోటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడంలేదు. నాణ్యమైన బత్తాయి మొక్కలు నాటాలంటే రవాణాతో కలిపి మొక్క రూ.100 నుంచి 150 వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం మాత్రం దిగుబడిని ఇచ్చే పండ్ల చెట్లు ఎండిపోతే నష్టపరిహారం ఇవ్వకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రాలో కొబ్బరి, అరటి చెట్లకు నష్టం వాటిల్లితే అక్కడ ప్రభుత్వం రూ.2 వేలు నష్టపరిహారంగా ఇస్తుంది. ఐదో ఏట దిగుబడిని ఇచ్చే ఒక్క బత్తాయి చెట్టు ఎండిపోతే రూ.1200 వరకు నష్టం వాటిల్లుతుంది. 13 ఏండ్ల చెట్టు ఎండిపోతే రూ.2 నుంచి 3 వేల వరకు నష్టం వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఎండిన చెట్టుకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు దిగుబడి నష్టాన్ని శాస్త్రీయంగా గుర్తించి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. 2009లో తీవ్ర నీటి ఎద్దడితో జిల్లాలో బత్తాయి తోటలు భారీ ఎత్తున ఎండిపోయాయి. అప్పట్లో 2లక్షల 50వేల ఎకరాల్లో బత్తాయితోటలు సాగులో ఉండగా.. లక్షన్నర ఎకరాలకు పైగా తోటలు ఎండిపోయాయి. ఎండిన తోటలకు చెట్టుకు రూ.30 చొప్పున నష్టపరిహారాన్ని ఇచ్చారు.

No comments:

Post a Comment