Breaking News

24/05/2019

ఆగస్టు 1 నుంచి బీబీనగర్ ఎయిమ్స్ లో క్లాసులు

నల్గొండ, మే 24, (way2newstv.in

బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఎయిమ్స్‌ ఆస్పత్రి ఉనికిలోకి రావడానికి ముందు అక్కడ ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. తరగతి గదులు, నిర్మాణాలు పూర్తికావన్న భావనతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోనే ఎయిమ్స్‌ ఎంబీబీఎస్‌ తరగతులు నిర్వహించాలని మొదట అనుకున్నారు. కానీ బీబీనగర్‌లోనే ఆగస్టు 1 నుంచి ఎయిమ్స్‌ ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభమవుతాయని వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎయిమ్స్‌ ఏర్పాటు ప్రక్రియపై చర్చించేందుకు భోపాల్‌ ఎయిమ్స్‌ బృందం బీబీనగర్‌ను సందర్శించింది.  బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఏర్పాటు ప్రక్రియ, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు భోపాల్‌ ఎయిమ్స్‌కు కేంద్రం బాధ్యత అప్పగించింది. దాని ఆధ్వర్యంలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ కూడా ఇచ్చారు. భోపాల్‌ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సర్మాన్‌ సింగ్‌ను బీబీనగర్‌ ఎయిమ్స్‌కు మెంటార్‌గా నియమించారు. 


ఆగస్టు 1 నుంచి బీబీనగర్ ఎయిమ్స్ లో క్లాసులు
ఆయన ఆధ్వర్యంలోని బృందం బీబీనగర్‌ ఎయిమ్స్‌ను సందర్శించి జులై 15 నాటికి నిర్మాణాలు పూర్తవుతాయని, అనంతరం ఆగస్టు 1 నుంచి ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభిస్తామని ఆ బృందం వెల్లడించినట్లు డీఎంఈ తెలిపారు. ముందుగా 50 ఎంబీబీఎస్‌ సీట్లతో ఎయిమ్స్‌ వైద్య విద్య ప్రారంభిస్తారు. అనంతరం 100 సీట్లకు పెంచుతారు. బీబీనగర్‌ క్యాంపస్‌లో ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభించడానికి అవసరమైన బ్లూప్రింట్‌ను తయారు చేశారు.  ఎయిమ్స్‌ ఎంబీబీఎస్‌ తరగతుల ప్రారంభానికి సంబంధించి అవసరమైన పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే భోపాల్‌ ఎయిమ్స్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియోలజీ, కమ్యూనిటీ అండ్‌ ఫ్యామిలీ మెడిసిన్‌లకు ఒక్కొక్క ప్రొఫెసర్, అడిషనల్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. అలాగే అనాటమీలో మూడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్, బయో కెమిస్ట్రీలో నాలుగు, ఫిజియోలజీలో నాలుగు, కమ్యూనిటీ, ఫ్యామిలీ మెడిసిన్లలో నాలుగు పోస్టుల చొప్పున నోటిఫికేషన్‌ జారీచేశారు. ఇవే పోస్టులకు సీనియర్‌ రెసిడెంట్లు, ట్యూటర్లుగా మరో 16 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారని రమేశ్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో భోపాల్‌ ఎయిమ్స్‌ డీన్‌ డాక్టర్‌ అర్నీత్‌ అరోరా, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ జితేంద్రకుమార్‌ సక్సేనా, పీఎంఎస్‌ఎస్‌వై డైరెక్టర్‌ సంజయ్‌రాయ్, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) చీఫ్‌ ఇంజనీర్‌ లక్ష్మారెడ్డి, బీబీనగర్‌ నిమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment