టీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరైన కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్‌ను మరోసారి బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడింది. బోయినపల్లి వినోద్ కుమార్‌కు రెండోసారి ఎంపీగా పదవి దక్కకుండా పోయింది. సుప్రీంకోర్టు న్యాయవాదిగా... చెన్నమనేని కుటుంబానికి మేనల్లుడిగా గుర్తింపు తెచ్చుకున్న వినోద్ కుమార్... టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు తోడుగా, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే 2004లో నాటి హన్మకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. అయితే ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా హన్మకొండ నియోజకవర్గం రద్దయ్యింది.
వినోద్ కు సెంటిమెంట్ దెబ్బ
దీంతో 2009లో కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ చేతిలో వినోద్ కుమార్‌కు ఓటమి తప్పలేదు. ఇక 2014లో కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి మంచి మెజార్టీతో విజయం సాధించిన వినోద్ కుమార్... లోక్ సభలో కీలకంగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించడంతో... మరోసారి ఆయన కరీంనగర్ ఎంపీగా గెలవడం ఖాయమని అంతా భావించారు. అయితే అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేతిలో వినోద్ కుమార్ ఓటమిని చవిచూశారు. దీంతో రెండోసారి ఎంపీగా గెలిచే విషయంలో వినోద్ కుమార్‌కు సెంటిమెంట్ కలిసి రావడం లేదనే చర్చ జిల్లా రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
No comments:
Post a Comment