Breaking News

27/05/2019

నవీన్ రోల్ మోడల్


భువనేశ్వర్, మే 27(way2newstv.in)
ఆయనను చూసి అందరూ నేర్చుకోవాలి. ప్రతి ముఖ్యమంత్రికి ఆయన ఒక రోల్ మోడల్. ఐదుసార్లుగా అప్రతిహతంగా నెగ్గుకొస్తున్నారంటే ఆయన పడిన శ్రమ, పన్నుతున్న వ్యూహాలు సామాన్యమేమీ కావు. ఒక పక్క రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ ను బలహీనపర్చారు. బలోపేతం అవుతున్న భారతీయ జనతా పార్టీని కట్టడి చేయగలిగారు. వరుసగా ఐదోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. ఆయనే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. సాదా సీదాగా కన్పిస్తారు. మాటకారి కానేకాదు. చేతలే తనకు ఓట్లు కురిపిస్తాయన్నది ఆయన నమ్మకం. ఆయన నమ్మకం వమ్ముకాలేదు. మరోసారి ప్రజలు నవీన్ కు పట్టం కట్టారు.ఒడిశా అంటేనే ముందుగా గుర్తుచ్చేది జగన్నాద స్వామి… తర్వాత నవీన్ పట్నాయక్. బిజూ జనతాదళ్ అధినేతగా తండ్రి నుంచి వారసత్వాన్ని అందుకుని రాజకీయాల్లోకి వచ్చిన నవీన్ పట్నాయక్ కు ఒడియా భాష రాదు.ఆయన విదేశాల్లో చదువుకుని రావడంతో భాష అబ్బలేదు. అయితేనేం ప్రజల మనస్సులను గెలుచుకోవడంలో ఆయన నేర్పరి. 


నవీన్ రోల్ మోడల్
ఇప్పటికి ఇరవై ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఒడిశాకు ప్రాతినిధ్యం వహిస్తున్న నవీన్ పట్నాయక్ ఐదోసారి పూర్తిస్థాయి మెజారిటీతో విజయం సాధించారు.ఒడిశా రాష్ట్రంలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలున్నాయి. 21 లోక్ సభ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో 117 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుని అందలం ఎక్కారు. ఈసారి ఆ సంఖ్య 112 కి చేరింది. గత ఎన్నికలకంటే ఐదు సీట్లు అసెంబ్లీలో తగ్గాయి. ఇక పార్లమెంటు స్థానాల సంగతి కొస్తే గత ఎన్నికల్లో 21 పార్లమెంటు స్థానాల్లో 20 స్థానాల్లో బీజేడీ గెలిచింది. ఈసారి 12 స్థానాలకే పరిమితమయింది. బీజేపీ ఇక్కడ పుంజుకుంది. బీజేపీ ఏడు పార్లమెంటు స్థానాల్లోనూ, కాంగ్రెస్ ఒక స్థానంలోనూ గెలిచింది. అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి బీజేపీకి 23 స్థానాలు చేజిక్కించుకుని ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. కాంగ్రెస్ తొమ్మిది అసెంబ్లీ స్థానాలకే పరిమితమవ్వడం విశేషం. ఇలా ఇటు బీజేపీని, అటు కాంగ్రెస్ ను అసెంబ్లీ స్థానాల విషయంలో నిలువరించగలిగినా, పార్లమెంటు విషయం వచ్చే సరికి ఒడిశాలోనూ మోదీ గాలి బలంగా వీయడంతో గత ఎన్నికలకంటే ఎనిమిది స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది.నవీన్ పట్నాయక్ అసెంబ్లీ ఎన్నికలలో మిషన్ 130గా టార్గెట్ పెట్టుకున్నా రీచ్ కాలేకపోయారు. అయినా ఆయన అధికారానికి దూరం కాలేదు. ఎప్పుడూ ఆయన ఒడిశాను వదలి హస్తిన బాట పట్టలేదు.కేంద్రంలో చక్రం తిప్పాలనుకోలేదు. ప్రజాసమస్యలను పసిగట్టి పరిష్కరించడంలో దిట్ట కావడంతో ప్రజలను ఆయనను మళ్లీ మళ్లీ ఎన్నుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న సంకేతాలు ఎన్నికలకు ముందు వెలువడినా నవీన్ లెక్కచేయలేదు. ఆయన నిజాయితీకి, పాలనకు ప్రజలు మరోసారి పట్టం కట్టారు. రైతుల కోసం కాలియా పథకం, మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకాలు ఆయన గెలుపుతీరానికి చేర్చాయి. మొత్తం మీద ఐదోసారి ముఖ్యమంత్రి కాబోతున్న నవీన్ దేశంలో అన్ని రాష్ట్రాల ప్రాంతీయ పార్టీ నేతలకు రోల్ మోడల్ అని చెప్పక తప్పదు.

No comments:

Post a Comment