Breaking News

14/05/2019

ప్రాంతీయ పార్టీలే కింగ్ మేకర్లా...

న్యూఢిల్లీ, మే 14, (way2newstv.in)
యూపీఏ, ఎన్డీఏ రెండు కూటములకూ ఇప్పుడు నమ్మకం లేదు. తాము సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న విశ్వాసం రోజురోజుకీ క్షీణిస్తోంది. 200 మార్కు చేరువలో నిలిచిపోతే మిగిలిన 75 సీట్ల కోసం ఏయే పార్టీలను చేర్చుకోవాలనేది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ప్రధాన తలపోటుగా మారుతోంది. ప్రస్తుతమున్న మిత్రులతో కలిసి 170 వద్ద నిలిచిపోతే మరో సెంచరీ భాగస్వామ్యానికి ఎవరు కలిసొస్తారనే లెక్కల్లో ఉంది కాంగ్రెసు నేతృత్వంలోని యూపీఏ. ఎన్డీఏకు సంప్రతింపుల మధ్యవర్తుల కొరత వెన్నాడుతోంది. శరద్ పవార్ వంటివారు కలిసొస్తారేమోనని అన్వేషిస్తోంది. పరోక్షమంతనాలు మొదలుపెట్టింది. ఇక యూపీఏకు ఆ సమస్య లేదు. చంద్రబాబు నాయుడు అన్నీ తానై పాత్ర తీసుకుంటున్నారు. పేరుకే టీడీపీ కాంగ్రెసుతో కలిసి పోటీ చేయలేదు, అన్నిటా హస్తం పార్టీ ప్రధాన భాగస్వామిగానే వ్యవహరిస్తోంది. నిజానికి యూపీఏ లో దీర్ఘకాలంగా ఉన్న అన్ని పార్టీల కంటే ఎక్కువ చురుకుగానే వ్యవహరిస్తోంది. కాంగ్రెసుమీద ప్రేమకంటే మోడీ పట్ల నెలకొన్న భయమే దీనికి ప్రధాన కారణం.చంద్రబాబు నాయుడి ఆలోచనలకు మమత గండి కొడుతున్నారు. ఫలితాలు రాకముందే ఈనెల21 న విపక్ష కూటమిని ఖరారు చేయాలని టీడీపీ అధినేత తలపోశారు. ఫలితాలు వచ్చినతర్వాతనే కూర్చుందామంటున్నారు మమత. నిజానికి చంద్రబాబు విషమపరీక్షను ఎదుర్కొంటున్నారు.


ప్రాంతీయ పార్టీలే కింగ్ మేకర్లా...

సొంత రాష్ట్రంలో అధికారం నిలుపుకోవడం, జాతీయంగా ప్రధానపాత్రలో ఉండటమనే రెండు లక్ష్యాలు ఆయన పెట్టుకున్నారు. ఫలితాల తర్వాత రాష్ట్రంలో అధికారంలో కోల్పోతే జాతీయ పాత్ర కుదించుకుపోతుంది. ఎవరూ పట్టించుకోరు. అందుకనే ఆయన తొందరపడుతున్నారు. యూపీఏకు అనుకూల కూటమిలో ముందస్తుగా తన స్థానాన్ని స్థిరం చేసుకోవాలనుకుంటున్నారు. కానీ మమతకు ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేమీ లేదు. ఫలితాల తర్వాత తానే ప్రధాని రేసులోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అంతవరకూ వేచి చూద్దామనే ధోరణి కనబరుస్తున్నారు. ప్రస్తుతానికి గోడమీద పిల్లులుగా వ్యవహరిస్తూ వేచి చూస్తున్న బిజూ జనతాదళ్, సమాజ్ వాదీ, బహుజన సమాజ్ లు కూడా ఎటువంటి తొందరపాటును ప్రదర్శించడం లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. వ్యక్తిగత లక్ష్యంతోనే కేసీఆర్ కొంత హడావిడి చేస్తున్నారు. కూటమి కట్టగలనన్న నమ్మకం ఆయనకూ లేదు. ఈ నేపథ్యంలోనే గో.పి.లను లైన్ లోకి తెచ్చే పనిలో పడ్డారు చంద్రబాబు. కానీ అంతా ఆయన అనుకున్నట్లు సాఫీగా సాగడం లేదు. అనవసరంగా చంద్రబాబు కు ఎందుకు ముందస్తు క్రెడిట్ ఇవ్వాలి? సమయం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్లు తాపీగా స్పందిస్తున్నాయి ఇతర పార్టీలుచంద్రబాబు నాయుడు ఇంతగా ఎందుకు తాపత్రయపడుతున్నారనేది రాజకీయవర్గాలను ఆలోచింపచేస్తోంది. ఈవీఎంలపై పోరాటం పేరుతో 23 రాజకీయపార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. ఫెడరల్, సెక్యులర్ ఫ్రంట్ కడదామనే ప్రతిపాదన వచ్చినప్పటికీ దానిని తోసిపుచ్చుతున్నారు. కాంగ్రెసుకు అనుకూలంగా మహాకూటమిని నిర్మించే యత్నాల్లో ఉన్నారు. ఈ పాటికే యూపీఏ కూటమిలో చేరి ఉండేవారు. కానీ టీడీపీ ముందుగా జట్టుకడితే టీఎంసీ, ఆప్, ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ, కమ్యూనిస్టులతో సంప్రతింపులు జరిపే అవకాశాన్ని చంద్రబాబు కోల్పోతారు. అందువల్ల తాను తటస్థ పాత్రలో కనిపిస్తూ మిగిలినవారిని కూడా దేశప్రయోజనాల పేరిట కాంగ్రెసుకు చేరువ చేయాలనేది చంద్రబాబు యోచన. దీనివల్ల కూటమిలో టీడీపీ పెద్దన్న పాత్ర పోషించే అవకాశం వస్తుంది. ముందుగా చేరితే అందరిలో ఒకరిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. పైపెచ్చు మిగిలిన న్యూట్రల్ పార్టీలు తనను అనుమానాస్పద దృక్పథంతో చూసే అవకాశం ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం క్రిటికల్ పరిస్థితినే ఎదుర్కొంటోంది. మెజార్టీ సర్వేల మొగ్గు వైసీపీ వైపు కనిపిస్తోంది. పసుపు..కుంకుమ వంటి పథకాలు చివరిలో ఆదుకుని ఉండకపోతే పంఖా పార్టీ క్లీన్ స్వీప్ చేసి ఉండేదని సెఫాలజిస్టులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ తెలుగుదేశం మహిళా ఓటర్లను నమ్ముకుంటూ ఏదో రకంగా తిరిగి విజయం సాధిస్తామని విశ్వసిస్తోంది. కచ్చితంగా గెలుస్తామని అటు వైసీపీ, ఇటు టీడీపీ చెప్పలేకపోతున్నాయి. రాజకీయ సమీకరణలు సంక్లిష్టంగా ఉండటమే నాడిని పట్టివ్వడం లేదు. పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యం కోల్పోకుండా ఉండేందుకు తమ పార్టీలకు 120 స్థానాలవరకూ వస్తాయని రెండు పార్టీల అగ్రనేతలూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. అంతర్గత అంచనాల్లో ఈ ఫిగర్ చాలా తక్కువగా కనిపిస్తోంది. తెలుగుదేశం సేకరించిన సొంత సమాచారం ప్రకారం కనిష్టంగా 92 స్థానాలు వస్తాయని భావిస్తోంది. అదే వైసీపీ కనిష్టంగా 105 స్థానాలు వేసుకుంటోంది. ఒకవేళ జాతకం తిరగబడి రాష్ట్రంలో అధికారం కోల్పోయినా జాతీయంగా పట్టు నిలుపుకోవాలనే ఉద్దేశంతో ముందస్తుగా రంగంలోకి దిగారు చంద్రబాబు. తానే దిక్సూచిగా ఉంటూ కాంగ్రెసు నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చేలా చేయగలిగితే టీడీపీ భవిష్యత్తుకు ఢోకా ఉండదనేది ఆయన దూరాలోచన.

No comments:

Post a Comment