Breaking News

14/05/2019

విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటుకు అంతా సిద్ధం

వరంగల్, మే 14, (way2newstv.in)
జూన్ మొదటి వారంలో విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు కానుంది. ఎన్నికల కోడ్ ముగిశాక ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇఆర్‌సి చైర్మన్, సభ్యుల పోస్టుల కోసం ధరఖాస్తులు ఆహ్వానించగా 49 మంది తమ ఆసక్తిని వెలిబుచ్చు తూ, అర్హతలను చెబుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. మొత్తం మూడు పోస్టులకు ప్రభుత్వం దరఖాస్తులు ప్రభుత్వం ఆహ్వానించింది. విద్యుత్ నియంత్రణ మండలి (టిఎస్ ఈఆర్సీ) చైర్మన్ పోస్టుతో పాటు ఇద్దరు సభ్యు లు ఎంపిక చేయాల్సి ఉంది. చాలా కాలంగా ఈఆర్సీలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యుత్ చట్టం ప్రకారం కమిషన్ ఎంపిక కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నిర్ణయించింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.భాస్కరరావు నేతృత్వంలో ఎంపిక కమిటీని ప్రభుత్వం నియమించింది. ఎంపిక కమిటీలో చైర్మన్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, కేంద్ర విద్యుత్ ప్రాధికార సమితి (సిఇఏ) చైర్మన్, లేదా ప్రతినిధి సభ్యులుగా ఉంటారు.


విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటుకు అంతా సిద్ధం

49 నామినేషన్లలో చైర్మన్, మెంబర్ (టెక్నికల్), మెంబర్ (ఫైనాన్స్) పోస్టులకు అర్హుల జాబితాను కమిటీ ఎంపిక చేస్తుంది. ఒక్కో పోస్టుకు అర్హులైన ఇద్దరిని ఎంపిక చేసి, ముఖ్యమంత్రికి నివేదిక ఇస్తారు. ఇందులో తన విచక్షణాధికారం మేరకు సిఎం ఎంపిక చేసిన వారిని ఆయా పోస్టుల్లో నియమిస్తారు. ఈఆర్‌సి పోస్టుల కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి బిఆర్ మీనా, హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ శంకర నారాయణ, ట్రాన్స్‌కో డైరెక్టర్ నర్సింగ్‌రావు, తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కమిషన్ ఏర్పాటు అయ్యాక విద్యుత్ సంస్థల ఆదాయ, వ్యయ అంచనాల నివేదికను సమర్పించాల్సి ఉంది. నవంబరు మాసాంతానికి నివేదికను సమర్పించాల్సి ఉంది. కానీ వరుసగా ఎన్నికల కోడ్, కమిషన్ ఎంపిక పూర్తికాకపోవడంతో విద్యుత్ సంస్థల నివేదిక ఆలస్యం అయ్యింది.ఈ లోగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం పాత విద్యుత్ చార్జీలనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమిషన్ ఏర్పాటైన తర్వాత ఆదాయ, వ్యయాలకు మధ్య ఉన్న లోటు ఎంతో చెబితే, ఆ మొత్తాన్ని ప్రభుత్వ సబ్సిడీగా భరిస్తామని హామీనిచ్చింది. దీంతో కమిషన్ ఏర్పాటైన వెంటనే విద్యుత్ సంస్థల ఆదాయ, వ్యయాల మధింపును జరిపి, లోటు ఎంత ఉందో తేల్చాల్సి ఉంటుంది. అయితే మే నాలుగో వారంలో ఎన్నికల కోడ్ పూర్తి అవుతుండడంతో, ఆ తర్వాతే కమిషన్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయి. జూన్ మొదటి వారంలో ఈఆర్సీ ఎంపిక కమిటీ భేటీ అయి, సభ్యుల ఎంపికను పూర్తిచేసి, ముఖ్యమంత్రికి నివేదిస్తారని తెలిసింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం, ఉత్తర్వులు వెలువడడం వెనువెంటే జరుగుతాయని ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలిసింది.

No comments:

Post a Comment