Breaking News

14/05/2019

లెక్కకుమించి యూటర్న్‌లు..

అదిలాబాద్, మే 14, (way2newstv.in
అదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని అన్ని కాలనీల రహదారుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ రహదారులపై యూటర్న్‌లు ఉండడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. కలెక్టర్‌ చౌక్‌నుంచి దస్నాపూర్‌ వరకు దాదాపు కిలోమీటర్‌ దూరంలో ఉన్న రోడ్డుపై ఏకంగా 15 యూటర్న్‌లు ఉన్నాయి. పట్టణంలోని దస్నాపూర్‌ నుంచి మొదలుపెడితే కలెక్టర్‌ చౌక్‌వరకు ఉన్న (యూటర్న్‌లు) మలుపు రోడ్ల వద్దే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారి వెంబడి మధ్యలో ఉండే డివైడరుకు గతంలో మధ్యలో దారులు ఉండేవి కావు. అయితే గత సంవత్సరం నుంచే ఈ డివైడర్‌ను ముక్కలు ముక్కలు చేస్తున్న అధికారులు ఎక్కడపడితే అక్కడ దారులు తెరిచారు. ఈ దారుల వద్ద సూచికలు లేకపోవడం, రహదారి నిబంధనలు పాటించకపోవడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.


లెక్కకుమించి యూటర్న్‌లు.. 

పురపాలక అధికారులు నిబంధనలు పాటించకపోవడం, రోడ్లపైనే ఇసుక, కంకర, ఇతర వస్తువులు నిల్వచేయడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మొక్కుబడిగా కేసులు నమోదుచేసి పనికానిస్తున్న పోలీసులు, పురపాలక అధికారుల పట్టింపులేని తనంతోనే రోడ్లపై వాహన చోదకుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది.ఇళ్ల నిర్మాణాలు జరిగేచోట ఇసుక, కంకర నిల్వలను రహదారులపైనే ఉంచుతున్నారు. అవసరమైనప్పుడు కొద్దికొద్దిగా వాడుకుంటూ, మిగిలినదంతా చాలామంది రోడ్లపైనే ఉంచుతున్నారు. ఇక కొందరు వ్యాపారులు తమ ప్రయోజనాల కోసం రోడ్లపై ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కలెక్టర్‌ చౌక్‌ నుంచి రాంనగర్‌ వరకు గతంలో ఈ రోడ్డుగుండా కేవలం రెండుచోట్ల మాత్రమే డివైడర్‌ మలుపుదారులు ఉండేవి. ఆ విధమైన డివైడర్‌ ఉన్న సమయంలో ప్రమాదాలకు పెద్దగా ఆస్కారం ఉండేది కాదు. అయితే ఇటీవల కొందరు వ్యాపారులు తమ దుకాణాలకు సులువుగా వచ్చివెల్లడానికి డివైడర్‌ను తెంచేసి పలుచోట్ల దారులు తీయించారు. ఈ మలుపుదారులతో వ్యాపారులకు కాస్త వెసులుబాటు ఉన్నప్పటికీ, ఆ దారులు వాహనచోదకులను అయోమయానికి గురిచేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

No comments:

Post a Comment