Breaking News

04/04/2019

రోజాకు తమిళ ఓటర్లే అడ్వాంటేజ్

తిరుపతి, ఏప్రిల్ 5(way2newstv.in)
చిత్తూరు జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కేవలం తెలుగుప్రజలే కాదు ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేయగలిగింది పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ప్రజలే అన్నది కాదనలేని వాస్తవం. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గంలో తమిళుల సంఖ్య ఎక్కువగా ఉండటం రోజాకు కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. చిత్తూరు జిల్లా తమిళనాడుసరిహద్దుల్లో ఉంది. చిత్తూరు జిల్లాలోని నగరి, సత్యవేడు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో తమిళ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది.నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా మరోసారి బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భాను ప్రకాష్ పోటీ చేస్తున్నారు. రోజాతో పోల్చుకుంటే భానుప్రకాష్ కు రాజకీయ అనుభవం తక్కువే. తండ్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు మృతితో తనకు సానుభూతి లభిస్తుందని భావిస్తున్నారు. నగరి నియోజకవర్గంలో మొత్తం లక్షా తొంభయి వేల ఓట్లు ఉంటే అందులో తమిళ ఓటర్లు దాదాపు అరవై వేలమంది ఉన్నారు. 


 రోజాకు తమిళ ఓటర్లే అడ్వాంటేజ్

వీరే గెలుపోటములను నిర్ణయిస్తారు. వీరిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.ఆర్ కె రోజా సినీ నటి కావడంతో ఆమెకు తమిళ భాష వచ్చు. వీరిదగ్గరకు వెళ్లగానే ఆమె తమిళంలో ప్రసంగిస్తున్నారు. రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణి కూడా ప్రచారంలో పాల్గొంటూ తమిళంలో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గాలి భానుప్రకాష్ కూడా తమిళం నేర్చుకుని మరీ వారిని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలను ఆదేశించడంతో టీడీపీ నేతలంతా కలసి కట్టుగా పనిచేస్తున్నారు.ఇకతమిళ ఓటర్ల ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో సత్యవేడు ఒకటి. ఇక్కడ లక్షా డెబ్భయిరెండు వేల మంది ఓటర్లుండగా యాభై ఐదు వేలమంది ఓటర్లు తమిళులే కావడం విశేషం. అలాగే గంగాధరనెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాల్లో కూడా తమిళ ఓటర్లు యాభై నుంచి యాభైఐదు వేల మంది వరకూ ఉన్నట్లు అంచనా. అందుకోసమే ఇక్కడ తమిళుల ప్రభావంఎక్కువగా ఉండటంతో తమకు అనుకూలంగా ఉన్న తమిళనాడుకు చెందిన పార్టీ నేతలను, సినిమా నటులను రంగంలోకి దింపుతున్నారు. మొత్తం మీద తంబిల తమవైపే ఉన్నారంటూ అన్ని పార్టీలూ భావిస్తున్నాయి. మరి తమిళ తంబిల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

No comments:

Post a Comment