కర్నూలు, ఏప్రిల్ 4(way2newstv.in)
కర్నూలు రాజకీయాలన్నీ తారుమారయ్యాయి. నాడు అభ్యర్థులు నేడు ప్రచారకర్తలుగా మారారు. నాడు సేవలందించిన వారు నేడు అభ్యర్థులయ్యారు. ఎక్కడా లేని రాజకీయ ముఖచిత్రం కర్నూలు జిల్లాలో కన్పిస్తుంది. ఓడలు బండ్లవుతాయంటే ఇదేనేమోననిపించక మానదు. కానీ ఇదినిజం. కర్నూలు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో శత్రువులు మిత్రులుగా మారారు. మిత్రులు శత్రువులయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పనిచేసిన వారు ఇప్పుడు ఏమీ చేయలేక పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు.కర్నూలు అర్బన్ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు టీజీభరత్ బరిలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా హఫీజ్ ఖాన్ పోటీ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీ టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన తిరిగి వైసీపీ గూటికి చేరారు. హఫీజ్ ఖాన్ కుమద్దతు తెలిపారు. ఆయన గెలుపునకు ప్రచారం చేస్తున్నారు.
కర్నూలు టీడీపీలో సీన్ రివర్స్
2014 ఎన్నికల్లో ఎస్వీ మోహన్ రెడ్డి గెలుపునకు హఫీజ్ ఖాన్ కృషి చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. టీజీ భరత్ ను ఓడించడమే లక్ష్యంగా ఎస్వీ మోహన్ రెడ్డి సొంత ఖర్చుతో ప్రచారాన్ని చేస్తుండటం విశేషం.ఇక కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక గెలుపునకు గత ఎన్నికలలో ప్రచారం చేసిన సంజీవ్ కుమార్ ఇప్పుడు వైసీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మారారు. బుట్టారేణుక వైసీపీలో గెలిచి టీడీపీలోకి జంప్ చేసినా టిక్కెట్ దక్కకపోవడంతో ఆమె తిరిగి వైసీపీలోకి చేరి సంజీవ్ కుమార్ కు మద్దతుగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. తన సామాజికవర్గం ఓటర్లున్న ప్రాంతంలో బుట్టా రేణుక విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రత్యర్థులకు సాయం చేయడం కన్నా,తనకు అండగానిలిచిన వారికే సహకారం అందించడం మేలని బుట్టా అంటున్నారు.నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ టిక్కెట్ కోసం 2014 ఎన్నికల్లో బండి జయరాజ్, ఆర్థర్ లు విపరీతంగా ప్రయత్నించారు. చివరకు వైసీపీ టిక్కెట్ ఐజయ్య దక్కించుకుని విజయం సాధించారు. దీంతో బండి జయరాజ్ టీడీపీలోకి వెళ్లి ఈఎన్నికల్లో అభ్యర్థిగా మారారు. ఈ ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ ఆర్థర్ కు దక్కింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఐజయ్య టీడీపీలోకి వెళ్లి జయరాజ్ గెలుపునకు కృషఇ చేస్తున్నారు. అలాగే గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన లబ్బి వెంకటస్వామి ఇటీవల వైసీపీలో చేరి ఆర్థర్ కు మద్దతుగా నిలిచారు. ఇలా అనేక నియోజకవర్గాల్లో శత్రువులు మిత్రులుగా మారారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రచార కర్తలుగా మారిపోయారు.
No comments:
Post a Comment