Breaking News

09/04/2019

బెట్టింగుల ఖిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు

కాకినాడ, ఏప్రిల్ 9(way2newstv.in)
బెట్టింగుల ఖిల్లా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికల బెట్టింగులు జోరుగా సాగిపోతున్నాయి. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ఎన్నికల రణ రంగంలో అభ్యర్థులు తమ తమ భవిష్యత్తుపై లెక్కలేసుకుంటుంటే, బెట్టింగురాయుళ్లు మాత్రం గెలుపోటములను అంచనావేస్తూ పందేలకు దిగుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి, జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి, ఏ స్థానంలో ఏ అభ్యర్థి విజయం సాధిస్తారు, కొన్ని ముఖ్యమైన స్థానాల్లో ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది ఇలా రకరకాలుగా పందేలు సాగుతున్నాయి.రోజు రోజుకు ఎన్నికల ట్రెండును అంచనావేస్తూ మార్పులతో కొత్తకొత్త పందేలకు దిగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న భీమవరంపై ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమయ్యింది. నిన్న మొన్నటి వరకు పవన్ విజయంపై జోరుగా పందేలు జరగగా, ఆదివారం నుండి మళ్లీ వైసీపీ విజయంపై పందేలు సాగుతున్నట్టు సమాచారం. పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన నేపథ్యంలో ఈ ట్రెండు మారినట్టు తెలుస్తోంది. 


బెట్టింగుల ఖిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు

పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గాజువాక స్థానంలో విజయంపై కూడా కూడా ఇక్కడ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.ఈసారి బెట్టింగ్‌లు చాలా సృజనాత్మకంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. బెట్టింగులకు కొందరు వడ్డీపై పెట్టుబడి పెడుతున్నట్టు విశ్వసనీయంగా తెలియవచ్చింది. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలో వడ్డీ వ్యాపారానికి పేరొందిన ప్రాంతాలకు చెందిన వారు ఈ పెట్టుబడులు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. జిల్లాలో ఎన్ని స్థానాలు ఆయా పార్టీలకు వస్తాయనే సంఖ్యపై కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు కాస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా రకరకాల పందేలు సాగుతున్నట్టు సమాచారం. రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గంలోని ఈ అసెంబ్లీ స్థానంలో ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది, లోక్‌సభ స్థానంలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది, తదితరాలపై ఒక సామాజికకవర్గం నాయకులు పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు కాశారని తెలిసింది. ఈ నేపధ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు రూ.100 కోట్ల వరకు బెట్టింగ్‌లు సాగాయని, ఇది రానున్న రెండు మూడు రోజుల్లో మరింత పెరుగుతుందని చెబుతున్నారు.ప్రచార ఘట్టం చివరి దశకు చేరుకోవడంతో అభ్యర్ధులు ఇపుడు ఎన్నికల తాయిలాలపై దృష్టి కేంద్రీకరించినట్టుగా కనిపిస్తోంది. ఏ పార్టీ ఎంత ఇస్తారో అని ఓటర్లు ఎదురు చూస్తుంటే, ఎవరు ఎంతిస్తారో దానిని బట్టి ఇచ్చేందుకు సిద్ధం చేసుకోవచ్చని ఇతర పార్టీలు ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల పంపిణీ పూర్తయినట్టు తెలుస్తోంది.

No comments:

Post a Comment