Breaking News

09/04/2019

జొరుగా పోలవరం పనులు

ఏలూరు, ఏప్రిల్ 9(way2newstv.in)
లవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ పనులు జోరుగా సాగుతున్నాయి. దేవీపట్నం మండలం అంగుళూరు సమీపంలో పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ ఎగువ, దిగువ పనులు జరుగుతున్నాయి. ఈ వేసవిలో గోదావరి నదిలో నీటి ప్రవాహం తక్కువగా వుంటుంది కాబట్టి ఇదే అదనుగా కాఫర్ డ్యామ్ పనులు పూర్తిచేసేందుకు రోజువారీ కార్యాచరణ ప్రణాళిక నిర్దేశించారు. గోదావరి నదికి వరదల సమయం సమీపించే నాటికి కాఫర్ డ్యామ్ పనులు ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యామ్‌కు ముందుగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టారు. ఎగువ కాఫర్ డ్యామ్‌ను ఒకవైపు కొండను ఆన్చుతూ, మరో వైపు లెఫ్ట్ ఫ్లాంక్‌ను చేర్చి పనులు చేస్తున్నారు. అదేవిధంగా దిగువ కాఫర్ డ్యామ్ పనులు ఒక వైపు అంగుళూరు నుంచి మొదలై మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా వైపు లెఫ్ట్ ఫ్లాంక్ వరకు జరుగుతున్నాయి. దీంతో గోదావరి నది ప్రధాన ప్రవాహానికి ఆటంకం కలుగుతోంది. సుమారు ఎనిమిది భారీ తూరలు వేసి అందులోంచి ప్రవాహం వెళ్ళేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేశారు. ఆ తూరల్లోంచి ప్రవహించే గోదావరి కాస్తంత ప్రవాహ దిశ మార్చుకుని ప్రత్యామ్నాయంగా ప్రధాన దిశలోకి రావడానికి సమయం పడుతోంది. కాఫర్ డ్యామ్ నిర్మాణ పనుల వల్ల అక్కడ ప్రవాహం నిలిచిపోయింది. 


జొరుగా పోలవరం పనులు

రబీ అవసరాలకు ఎటువంటి ఇబ్బందిలేకుండా నీటిని మళ్ళించే విధంగా ఇక్కడ జల వనరుల శాఖ పర్యవేక్షిస్తోంది. ఎగువ కాఫర్ నిర్మాణానికి 72.56 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని, దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంలో 26.84 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని జరుగుతోంది.ప్రస్తుతం సీలేరు నది నుంచి గోదావరి నదిలోకి సీలేరు పవర్ జనరేషన్‌కు సంబంధించి సుమారు 4 వేల క్యూసెక్కులు, జనరేషన్ లేకుండా బైపాస్ జలాలు సుమారు 3 వేల క్యూసెక్కులు వెరశి ఏడువేల క్యూసెక్కుల వరకు జలాలు గోదావరి నది సహజ నీటి లభ్యతలో కలుస్తున్నాయి. అయితే కాఫర్ డ్యామ్ పనుల వల్ల ప్రధాన ప్రవాహం మందకొడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గోదావరి నది ధవళేశ్వరం వద్ద సర్ ఆర్దర్ కాటన్ బ్యారేజి వద్ద మంగళవారం 12.68 మీటర్ల మట్టం నమోదైంది. ప్రస్తుతం రబీ పంట నీటి అవసరాలు చాలా అధికంగా వుంది. వేసవి కాలం కాబట్టి గోదావరి నదిలో సహజ నీటి లభ్యత క్షీణించింది. ప్రస్తుతం సుమారు వెయ్యి క్యూసెక్కుల వరకు సహజ జలాలు బ్యారేజి వద్ద నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుత అవసరాల రీత్యా మూడు డెల్టాలకు నీటిని సమృద్ధిగా విడుదల చేస్తున్నట్టు జల వనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణారావు చెప్పారు. బ్యారేజి నుంచి మంగళవారం తూర్పు డెల్టాకు 2500, మధ్యమ డెల్టాకు 1650 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 4700 క్యూసెక్కుల జలాలు విడుదల చేస్తున్నట్టు జల వనరుల శాఖ అధికారులు తెలియజేశారు. అయితే రబీకి 94 టీఎంసీలు సరిపోతాయని అంచనా వేస్తూ రబీ కార్యాచరణ ప్రణాళిక చేపట్టారు. ఇప్పటికీ ఇంకా వరి కోతలు మొదలుకాలేదు. రబీ చేలు ఇంకా గింజ గట్టిపడే దశలోనే ఉన్నాయి. ఈ సమయంలో నీటి అవసరాలు అధికంగావుంటాయి. ఇంకా ఎక్కడా వరి కోతలు మొదలుకాలేదు. ఈక్రమంలో రబీ పంట సీజన్ చాలా ఆలస్యమయ్యేలావుంది. ఇటు మంచినీటి అవసరాలకు సైతం వినియోగించుకునే వరకు కాల్వలను మూతవేసే పరిస్థితి కన్పించడంలేదు. ఈ దశలో ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా కాల్వలను మూసివేసే అవకాశం కన్పించడంలేదు. సీలేరు నుంచి సరాసరి రోజుకు 7 వేల క్యూసెక్కుల వరకు జలాలు గోదావరి నదిలో కలుస్తున్నాయి. ఇప్పటివరకు సీలేరు నది నుంచి 55.96 టీఎంసీలు విడుదలయ్యాయి. గత ఏడాది డిసెంబర్ ఒకటి నుంచి ఇప్పటి వరకు రబీ అవసరాలకు గోదావరి నది నుంచి 88.81 టీఎంసీలు వినియోగించారు. అందులో 55.96 టీఎంసీలు కాగా గోదావరి నదిలో సుమారు 32 టీఎంసీలు మాత్రమే గత డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ఇప్పటి వరకు లభించినట్టు అంచనావేశారు. మొత్తం రబీ అవసరాలను 94 టీఎంసీల నీటితో సరిపెట్టాలని కార్యాచరణ చేపట్టారు. ఏదేమైనప్పటికీ పోలవరం కాఫర్ డ్యామ్ నిర్మాణాల వల్ల రబీ అవసరాలకు నీటి ఇబ్బంది లేకుండా చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. పోలవరం పనుల వల్ల రబీ నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

No comments:

Post a Comment