Breaking News

01/04/2019

అనంతనాగ్ లో మూడు దశల్లో ఎన్నికలుల

శ్రీనగర్, ఏప్రిల్ 1  (way2newstv.in)
సార్వత్రిక ఎన్నికల ప్రకటన ముందు అనంతనాగ్  గురించి ఎవరికీ ఏమీ తెలియదు. అది లోక్ సభ, నియోజకవర్గం లేదా అసెంబ్లీ నియోజకవర్గమా? ఏ రాష్ట్రంలో ఉంది..? వంటి వివరాలు చాలా మందికి తెలియదు. ఈ నెల రెండో వారంలో ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల ప్రకటనతో అనంతనాగ్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. మూడు దశల్లో ఈ లోక్ సభ నియజకవర్గంలో ఎన్నికలు నిర్వహించాలన్న ఈసీ ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక లోక్ సభ నియోజకవర్గంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకతపై దేశవ్యాప్తంగా చర్చజరిగింది. శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ లోని ఈ నియోజకవర్గంలో మూడు దశలలో ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నియోజకవర్గం మొదటి నుంచి సమస్యాత్మక నియోజకవర్గమే. కొత్తేమీ కాదు. అయితే మూడు దశల్లో అంటే ఏప్రిల్ 23, 29, మే 6వ తేదీల్లో ఎన్నికలు జరగనుండటమే ఆసక్తికరం.అనంత్ నాగ్ నియోజకవర్గం నాలుగు జిల్లాలు (అనంత్ నాగ్, పుల్వామా, కుల్లాం, పోషియాన్) పరిధిలో విస్తరించి ఉంది. ఈ లోక్ సభ స్థానం పరిధిలో పదిహేను శాసనసభ స్థానాలున్నాయి. తాక్రిల్, ప్యాంపోల్, పుల్వామా, రాజాషోరా, వాని, షోపియాన్, నోరాబార్, కుల్లాం, అనంత్ నాగ్, డోరు, దేసిల్, పహల్లాం, బీజ్ హారా, షాకంన్, హత్మాలిబాగ్ అసెంబ్లీ స్థానాలు దీని పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇటీవల చోటు చేసుకున్న పుల్వామా ఘటన సంచలనం సృష్టించిన విషయం విదితమే. 


అనంతనాగ్ లో మూడు దశల్లో ఎన్నికలుల

అమర్ నాధ్ యాత్రికులు తమ పర్యటనలో భాగంగా పహల్లాం మీదుగా వెళుతుండటం తెలిసిందే. మొత్తం 13 లక్షల మంది ఓటర్లున్నారు. తీవ్రవాద సమస్య కారణంగా గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పడిపోయింది. 13 లక్షలకు గాను కేవలం 3.75 లక్షల మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవడం ఇక్కడ నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితికి నిదర్శనం. 2014 ఎన్నికల్లో పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గెలుపొందారు. 2016 ఏప్రిల్ లో ఆమె ముఖ్యమంత్రి కావడంతో ఖాళీ ఏర్పడింది. 2017 ఏప్రిల్ నెలలో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ సందర్భంగా చెలరేగిన హింసాకాండలో 9 మంది మృతి చెందడంతో ఉప ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. అనంత్ నాగ్ నియోజకవర్గంలో అవాంఛనీయ సంఘటనలు జరగడం, ఎన్నిక రద్దవ్వడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. 1991లో కాశ్మీరీ వేర్పాటు వాదులు, కేంద్రానికి తలెత్తిన వివాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణ ల్లో వందలాది మంది చనిపోయారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఇక్కడ వాయిదా పడ్డాయి. తర్వాత 1996 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మళ్లీ పోలింగ్ జరిగింది.మూడు దఫాలుగా ఎన్నికల నిర్వహణకు శాంతిభద్రతల సమస్యే ప్రధాన కారణం. ఏప్రిల్ 23న అనంత్ నాగ్, 29న కుల్లాం, మే 6న పుల్వామా లో పోలింగ్ జరగనుంది. పుల్వామాలో ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ఆరు లోక్ సభ స్థానాల్లో ఇది ఒకటి. కానీ అనంతనాగ్ అంతటి సమస్యాత్మక నియోజకవర్గం మరొకటి లేదు. 1967లో ఏర్పాటయిన ఈ నియోజకవర్గం గత మూడు దశాబ్దాలుగా సమస్యాత్మకంగానే ఉంది. భారీ సంఖ్యలో ఓటర్లున్నప్పటికీ ఉగ్రవాదుల హెచ్చరికల కారణంగా పోలింగ్ కు దూరంగా ఉంటున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎక్కువ మంది ఉన్నారు.రాజకీయంగా చూస్తే అనంతనాగ్ నియోజకవర్గం ఏ పార్టీకి అడ్డా కాదు. ప్రధాన పార్టీలన్నీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాయి. 1967, 19710, 1977లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయపతాకం ఎగురవేశారు. 1980, 1984, 1999లో ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ విజయం సాధించింది. 1996లో జనతాదళ్ అభ్యర్థిని విజయం వరించింది. 1998లో కాంగ్రెస్ గెలుపొందింది. 2004లో పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీ విజయం సాధించింది. 2009లో నేషనల్ కాన్ఫరెన్స్ గెలుపొందింది. 2014లో మళ్లీ పీడీపీ విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో పీడీపీ ఇంతవరకూ అభ్యర్థిని ప్రకటించలేదు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఈ స్థానాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ కు కేటాయించింది. ఆ పార్టీ అధ్యక్షుడు హుస్సేన్ మసూద్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా సోఫీ యూనఫ్ పోటీలో ఉన్నారు. పోటీ నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ మధ్యనే ఉంటుంది. అనంత్ నాగ్ లో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడమే ఎన్నికల సంఘానికి పెద్ద సవాల్. సక్రమంగా ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యం విజయం సాధించినట్లు అవుతుంది. ఆ దిశగానే ఎన్నికల సంఘం ముందుకు వెళుతుంది.

No comments:

Post a Comment