Breaking News

01/04/2019

అభాసు పాలైన చంద్రబాబు అనుభవం

విజయవాడ, ఏప్రిల్ 1 (way2newstv.in)
నలభై ఏళ్ల అనుభవం…దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్…అత్యధిక కాలం ముఖ్యమంత్రి గా చేసిన అనుభవం… ఇవన్నీ ఉండి ఏమి లాభం…ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలతో అభాసు పాలయ్యేలా చేసింది. ఒక్క నిర్ణయం ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని కుదిపేసింది.  ఏ మాత్రం సంయమనం పాటించినా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిపోయేది. ముఖ్యమంత్రి హడావుడిగా తీసుకున్న నిర్ణయంలో న్యాయస్థానాలు సైతం జోక్యం చేసుకోలేదు. ఇంటెలిజెన్స్ డీజీ తో పాటు, శ్రీకాకుళం, కడప ఎస్పీలను హెడ్ క్వార్టర్ కి బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం  ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సంఘం నిర్ణయం వెలువడిన గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఐ పి ఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవో నంబర్ 716 విడుదల చేసింది. మర్నాడు ఉదయాన్నే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో ప్రభుత్వం తరపున లంచ్ మోషన్ పిటీషన్ దాఖలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన గంటల వ్యవధిలోనే న్యాయ స్థానం తలుపు తట్టారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లోకి చొరబడుతున్నారని., ముఖ్యమంత్రి భద్రత వ్యవహారాలు చూసే ఇంటెలిజెన్స్ డీజీ ని బదిలీ చేయడం సరి కాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టులో విజ్ఞప్తి చేశారు. 

అభాసు పాలైన  చంద్రబాబు అనుభవం

సుదీర్ఘ వాదనలు విన్న తరువాత ఎన్నికల సంఘం వ్యవహారాల్లో జోక్యం చేసుకోడానికి కోర్టు నిరాకరించింది.ఇంత హడావిడిగా, కొంపలు మునిగి పోయినట్టు ఒక ఐపీఎస్ అధికారి కోసం రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పోరాటం చేయడం అధికారుల్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. న్యాయ పోరాటంతో పాటు వెంట వెంటనే జీవోలు జారీ చేసి కోర్టుకు దొరికిపోయారు. అధికారుల్ని బదిలీ చేస్తూ జారీ చేసిన జీవో 716 స్థానంలో జీవో 720 తీసుకు వచ్చారు. అందులో ఇంటెలిజెన్స్ డీజీని మినహాయించి ఇద్దరు ఎస్పీలను మాత్రమే బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 28 ఏ పరిధికి వచ్చే అధికారులను నిర్ణయిస్తూ జీవో నంబర్ 721 తీసుకు వచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిల్లి మొగ్గల్ని కేంద్ర ఎన్నికల సంఘం న్యాయ వాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు. చివరకు ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోడానికి హై కోర్టు నిరాకరించింది.వెంట వెంటనే జీవో లు జారీ చేయడం, గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా సెక్షన్ 28ఏ పరిధి మార్చడంతో పాటు న్యాయ సలహా తీసుకోకుండా ముందుకు పోవడం కొంప ముంచింది. అధికారులు కనీసం న్యాయ నిపుణులను సంప్రదించే వ్యవధి కూడా ఇవ్వకుండా ముఖ్య నేత హడావుడి నిర్ణయం తీసుకోవడం వారిని కష్టాల్లోకి నెట్టింది. ఎన్నికల సంఘం పరిధి, ఆదేశాల విస్తృతి, తీవ్రత, పరిణామాలు అంచనా వేయకుండా సవాలు చేయడం సీనియర్ అధికారులను బాధ్యులుగా చేసింది. ఇప్పటికీ మా మెడపై క్రమశిక్షణ కత్తి వేలాడుతోంది అని ఓ అధికారి నిస్పృహతో అన్నారంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మాకు సంబంధం లేకుండానే ఉత్తర్వులు తయారవుతాయి. ఆలోచించే అవకాశం లేకుండానే సంతకాల కోసం ఒత్తిడులు వస్తాయి.

No comments:

Post a Comment