Breaking News

10/04/2019

ఐదోసారి అధికారం కోసం నవీన్ ప్రయత్నం

భువనేశ్వర్, ఏప్రిల్ 10 (way2newstv.in)
అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్న రెండో అతి పెద్ద రాష్ట్రం ఒడిశా. గత 19 ఏళ్లుగా ఇక్కడ బిజూ జనతా దళ్  పార్టీ అధికారంలో కొనసాగుతోంది. వరుసగా నాలుగుసార్లు గెలిచిన పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ అయిదోసారి గెలిచేందుకు తన శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారు. 2014లో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను 117, 21 లోక్ సభ స్థానాలకు గాను 20 గెలుచుకున్న బిజూ జనతాదళ్ ఈ దఫాల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకే ఒక్క లోక్ సభ స్థానాన్ని బీజేపీగెలుచుకుంది. విపక్ష కాంగ్రెస్ బాగా బలహీనపడింది. బీజేపీ పుంజుకుంటోందని ఇటీవల వచ్చిన సర్వేల నేపథ్యంలో పార్టీ ఊపు మీద ఉంది. నవీన్ పట్నాయక్ ను నిలువరించేందుకు ఇదే అదనని భావిస్తోంది. ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు, నాయకులు దృష్టి సారించేందుకు వీలుగా కావాలనే నాలుగు దశల్లో ఎన్నికలను పెట్టారన్న ఆరోపణలను ఎన్డీఏ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించాలన్నది కమలనాధుల ఆలోచన.ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఐదోసారి సీఎం పీఠంపై కన్నేశారు. అయితే బీజూ జనతా దళ్(బీజేడీ) మళ్లీ అధికార పగ్గాలు కైవసం చేసుకోవడం అంత ఈజీ కాదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. నాలుగు విడతల్లో జరగనున్న ఒడిశా జమిలి ఎన్నికల్లో  ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచే అవకాశముందని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా పశ్చిమ ఒడిశాలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని సర్వేల్లో తేటతెల్లమయ్యింది. 


ఐదోసారి  అధికారం కోసం నవీన్ ప్రయత్నం

పట్నాయక్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహరచనల్లో బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు తలమునకలయ్యారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ నుంచి బీజేడీకి గట్టి పోటీ ఎదురుకావడం తథ్యమని అంచనావేస్తున్నారు.అటు బీజేపీ, కాంగ్రెస్‌లకు చెక్ పట్టే వ్యూహాలకు బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్  పదునుపెడుతున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ ఒడిశాలోని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించి బీజేపీ, కాంగ్రెస్‌లకు చెక్ పెట్టే వ్యూహలు రచిస్తున్నారు.73 ఏళ్ల నవీన్ పట్నాయక్ 2000 సంవత్సరం నుంచి గంజాం జిల్లాలోని హింజిలికట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గత 19 ఏళ్లుగా ఆ నియోజకవర్గానికి నవీన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2017 పంచాయితీ ఎన్నికల్లో పశ్చిమ ఒడిశాలోని సాంబల్‌పూర్, బార్‌గర్, బోలన్‌గిర్, కలహండి జిల్లాల్లో బీజేపీ బీజేడీకి గట్టి పోటీ ఇచ్చింది. ఈ జిల్లాల్లో అధికార బీజేడీని ఓడించి జిల్లా పరిషత్‌లను బీజేపీ కైవసం చేసుకుంది. పార్టీ ప్రభ కోల్పోతున్న తరుణంలో నవీన్ పట్నాయక్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే... అక్కడ పార్టీకి కొత్త ఊపు వస్తుందని బీజేడీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. నవీన్ పట్నాయక్ పశ్చిమ ఒడిశాతో పాటు...తన సాంప్రదాయక నియోజకవర్గం హింజిలికట్ నుంచి కూడా పోటీ చేస్తారని బీజేడీ నేతలు అభిప్రాయపడుతున్నారు.లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశా అసెంబ్లీకి నాలుగు విడతల్లో ఏప్రిల్ 11,18, 23, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. ఒడిశాలోని మొత్తం 21 లోక్‌సభ నియోజకవర్గాలు, 147 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో కనీసం 74 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన పార్టీ అధికార పగ్గాలు చేపడుతుంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 117 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఇది 2009 ఎన్నికల్లో సాధించిన సీట్ల(103) కంటే 14 అధికం కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ 16, బీజేపీ 10 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేడీ 43.4 శాతం ఓట్లు సాధించగా...కాంగ్రెస్ పార్టీ 25.7శాతం ఓట్లు సాధించింది.ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ ఇటీవల 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. నాలుగుసార్లు ఆ రాష్ట్ర సీఎంగా వ్యవహరించారు. 2000 మార్చి 5న ఆయన తొలిసారిగా ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 2004, 2009, 2014 ఎన్నికల్లోనూ విజయం సాధించి సీఎం పగ్గాలు చేపట్టారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించి ఐదోసారి ఒడిశా సీఎంగా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామని స్పష్టంచేసిన నవీన్ పట్నాయక్...వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తంచేశారు

No comments:

Post a Comment