ఇటానగర్, ఏప్రిల్ 10 (way2newstv.in)
రాజకీయ అస్థిరత్వం.. తెగల మధ్య పోరాటాలు.. వంటి అంశాలతో నిత్యం వార్తల్లో నిలిచే అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలకు అంతా సిద్ధమైంది. 60 స్థానాలు గల అరుణాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. 2014 ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్ సాధించినప్పటికీ పార్టీ నేతలు పెద్దయెత్తున బీజేపీలోకి వలస వెళ్లారు. చివరకు అయిదుగురు మిగిలారు. గత మూడు నెలల కాలంలో దాదాపు 19 మంది సొంతగూటికి రావడంతో హస్తం పార్టీలో ఉత్సాహం నెలకొంది. బీజేపీ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఆ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు. రాష్ట్రంలో ఈ నెల 11న ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో కొనసాగాలని బీజేపీ, అనూహ్యరీతిలో కోల్పోయిన అధికారాన్ని తిరిగి సాధించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నాయి. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ), నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ), జనతాదళ్(యూ), జనతాదళ్(ఎస్) కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి.అరుణాచల్ ప్రదేశ్ ..చైనా, భూటాన్, మయన్మార్‌తో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులు పంచుకుంటోంది. వ్యూహాత్మకంగా ఇది మనదేశానికి అత్యంత కీలక రాష్ట్రం. భారీయెత్తున బలగాలను ఇక్కడ కేంద్రం మోహరిస్తోంది. బలగాల రాకపోకలకు అనువుగా రహదారులు నిర్మించేందుకు రూ.వేలకోట్లు వెచ్చిస్తోంది. ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై మాత్రం పెద్దగా దృష్టిపెట్టడం లేదన్న అభిప్రాయముంది. పర్వతాలు, లోయల్లో విసిరేసినట్లుగా ఉండే పల్లెలకు సరైన రహదారులు, తాగునీటి సదుపాయాలు లేవు. ఆరోగ్య సేవలు అంతంత మాత్రమే. ఈటానగర్, జిల్లా కేంద్రాలు మినహా మిగతా ప్రాంతాల్లో సరైన విద్యాకేంద్రాలూ లేవు.
అరుణాచల్ లో పరువు కోసం ప్రాకులాట
నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుండటంతో ఉపాధి కోసం స్థానిక యువత ఉత్తరాది రాష్ట్రాల బాటపడుతోంది. పర్వత ప్రాంతాల్లో సగానికిపైగా కుటుంబాలకు పక్కా ఇళ్లు లేవు. అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. 2 లోకసభ స్థానాలు ఉన్నాయి.. అరుణాచల్ లో మొత్తం ఓటర్లు 7,98,248 కాగా పురుషులు 3,94,456 మహిళలు 4,03,792 ఉన్నారు.2014 శాసనసభ ఎన్నికల్లో 60 స్థానాలకుగాను కాంగ్రెస్ 42 స్థానాలు గెల్చుకుంది. అప్పట్లో నబం తుకి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. విపక్ష ఎమ్మెల్యేల చేరికలతో ఏడాదిలోపే కాంగ్రెస్ బలం 47కు పెరిగింది. ఆపై 2015 డిసెంబరులో తుకికి వ్యతిరేకంగా 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. వారికి భాజపా, పీపీఏ ఎమ్మెల్యేలతోపాటు స్వతంత్రులు మద్దతుగా నిలిచారు. అనంతరం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం, తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో కలిఖో పుల్ సీఎం అవ్వడం, సుప్రీంకోర్టులో తీర్పు తుకికి అనుకూలంగా రావడం, బలనిరూపణలో తుకి విఫలమవడంతో పెమా ఖండూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, 43 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఖండూ పీపీఏలో చేరి ఆఖరికి భాజపా తీర్థం పుచ్చుకోవడం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.రాష్ట్రంలో అన్ని శాసనసభాస్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులను బరిలో దింపింది. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం పెమా ఖండూ ప్రజాకర్షక శక్తిపై కమలదళం భారీగా ఆశలు పెట్టుకుంది. ఖండూకు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. బౌద్ధమతస్థుల మద్దతు ఆయనకు దక్కే అవకాశాలున్నాయి. ఆర్థిక వనరులకు లోటు లేకపోవడం పార్టీకి కలిసొచ్చే మరో అంశం. క్షేత్రస్థాయిలో బలంగా లేకపోవడం ప్రతికూలాంశం. మిత్రపక్షాలు లేకపోవడమూ లోటే.దశాబ్దాలపాటు రాష్ట్ర రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత శాసనసభ ఎన్నికల్లో 42 స్థానాలను గెల్చుకున్నా.. ప్రస్తుతం పార్టీలో మిగిలిన ఎమ్మెల్యే నబం తుకి ఒక్కరే. రాష్ట్రంలో దాదాపు 30 శాతంమేర ఉన్న క్రైస్తవులు, 22 ప్రధాన గిరిజన తెగల ప్రజలు తమకు అండగా నిలుస్తారని పార్టీ ధీమాగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 47 స్థానాల్లోనే అభ్యర్థులను బరిలో దింపింది.లోక్‌సభ మాజీ స్పీకర్ పి.ఎ.సంగ్మా కుమారుడు, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ తొలిసారిగా అరుణాచల్‌లో 28 స్థానాలకు అభ్యర్థులను బరిలో దింపింది. గిరిజన తెగల అభ్యున్నతే లక్ష్యమని ప్రకటించిన ఆ పార్టీ రాష్ట్రంలో సత్తా చాటడం ద్వారా ఈశాన్య భారతంలో బలమైన రాజకీయశక్తిగా అవతరించేందుకు ప్రయత్నిస్తోంది. జేడీ(యూ) 16, జేడీ(ఎస్) 11, పీపీఏ 9 స్థానాల్లో ఆల్ ఇండియా పార్టీ 1 స్థానంలో అభ్యర్థులను నిలిపాయి. ఫలితాలపై వీటి ప్రభావం ఏమేరకు ఉంటుందనే విషయం ఆసక్తి రేపుతోంది.అరుణాచల్ ప్రదేశ్ పేద రాష్ట్రమైనా అభ్యర్థులు ఎన్నికల ఖర్చుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పలు నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు కేవలం 4-5 వేల ఓట్లు రాబట్టుకోవడమే సరిపోతుండటంతో.. ఓటర్లకు భారీగా డబ్బు ఎరవేస్తున్నారు. వారికి విలువైన కానుకలు ముట్టజెప్పుతున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో రాష్ట్రంలో చేపట్టే పనులన్నింటికీ ఇక్కడి రాజకీయ నేతలే గుత్తేదారులు కావడంతో వారి వద్ద భారీగా డబ్బు ఉన్నట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాలున్నాయి. అవి.. అరుణాచల్ తూర్పు, అరుణాచల్ పశ్చిమ. గత ఎన్నికల్లో తూర్పు సీటును కాంగ్రెస్, ‘పశ్చిమ’ను బీజేపీ దక్కించుకున్నాయి. పశ్చిమ స్థానంలో గెలిచిన బీజేపీ నేత కిరణ్ రిజిజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ అభ్యర్థి-మాజీ ముఖ్యమంత్రి నబం తుకి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. కేంద్రమంత్రిగా ఉన్నా రాష్ట్రానికి ఏమీ చేయలేదని స్థానికులు రిజిజుపై ఆగ్రహంతో ఉన్నారు.మరో వైపు అరుణాచల్ ప్రదేశ్ అట్టుడుకుతోంది. స్థానికేతరులకు శాశ్వత నివాస ధ్రువపత్రాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో.. స్థానికులు రెచ్చిపోయారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేశారు.అరుణాచల్ ప్రదేశ్‌లో హింస చెలరేగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు జాగ్రత్తగా కేంద్ర బలగాలను రంగంలోకి దించుతున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని జాతులవారు దశాబ్దాల నుంచి నివసిస్తున్నారు. రాష్ట్రంలో స్థానికేతరులుగా ఉన్న వీరికి శాశ్వత నివాస ధ్రువపత్రాలు ఇచ్చేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. నివాస ధ్రువపత్రాలకు సంబంధించి.. కమిటీ ఆ జాతులవారికి అనుకూలంగా కొన్ని సిఫార్సులు చేసింది. దీంతో రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యాయి.
No comments:
Post a Comment