Breaking News

04/04/2019

ఆ ముగ్గురికి జీవన్మరణ సమస్యే ఎన్నికలు

ముంబై, ఏప్రిల్ 4, (way2newstv.in)
ముగ్గురూ తలపండిన రాజకీయ నేతలు. ఈ ఎన్నికలు వీరికి ప్రతిష్టాత్మకం. ముగ్గురు నేతల్లో ఒక్కోరిదీ ఒక్కో సమస్య. ముగ్గురి సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాల్సి ఉంటుంది. అందుకోసమే ఏడు పదుల వయసులోనూ శక్తికి మించి ముగ్గురూ శ్రమిస్తున్నారు. ఒకరు జైలులోనే ఉండి రాజకీయ వ్యూహాలు రచిస్తుండగా, మరొకరు ఎన్నికల క్షేత్రంలోకి దిగకుండా పవర్ చూపించాలనుకుంటున్నారు. మరొకరు ఏకంగా ఎన్నికల గోదాలోకి దిగి తన సత్తా తగ్గలేదని నిరూపించుకోవాలనుకుంటున్నారు. వారే మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ కేంద్ర మంత్రులు శరద్ పవార్, లాలూప్రసాద్ యాదవ్ లు.దేవెగౌడ మాజీ ప్రధాని. ఆయనకు ఈ లోక్ సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. ఇద్దరు మనవళ్లతో పాటు తాను బరిలోకి దిగారు. వారిని గెలిపించుకోవడమే ముందున్న ప్రధమ లక్ష్యం. ఆయన తుముకూరు నుంచి పోటీ చేస్తున్నారు. జనతాదళ్ ఎస్ అభ్యర్థులుగా బరిలోకి దిగిన దేవెగౌడ మనవళ్లు ప్రజ్వల్ హాసన్ నుంచి, నిఖిల్ గౌడ మాండ్య నుంచి పోటీ చేస్తున్నారు. 


ఆ ముగ్గురికి జీవన్మరణ సమస్యే ఎన్నికలు

ఈ ఎన్నికల్లో వీరిద్దరిని గెలిపించుకోవడమే కాకుండా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తనయుడు కుమారస్వామి కుర్చీ పదిలంగా ఉంటుంది. అందుకే ఆయన కర్ణాటకలో కాంగ్రెస్ తో జత కట్టి మరి ఎన్నికలకు వెళుతున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారు.మరోనేత శరద పవార్. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులను బరిలోకి దించారు. కుమార్తె సుప్రియా సూలే, మనవడు పార్థీ పవార్ ను ఎన్నికల బరిలోకి దించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే మధ్యేమార్గంగా తనకు ప్రధాని పదవి దక్కుతుందేమోనన్న ఆశతో ఉన్నారు. అందుకే ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థి నిర్ణయం అని ప్రకటించారు. అంతేకాకుండా లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ఫలితాల ప్రభావం ఉంటుంది. కుదిరితే..గిదిరితే రాష్ట్ర పీఠాన్ని తమ కుటుంబం దక్కించుకునే వీలుంటుందని నమ్ముతున్నారు ఈ పెద్దాయన.లాలూ ప్రసాద్ యాదవ్. జైలులో ఉండి రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారు. బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి గెలుపే లక్ష్యంగా పథక రచన చేస్తున్నారు. తన తనయుడు తేజస్వి యాదవ్ కు పార్టీ వ్యవహారాలు అప్పగించినా సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికలో ఆయన సలహాలే కీలకం. బీహార్ లో బీజేపీ కూటమిని దెబ్బతీస్తే తనకు హ్యాండిచ్చిన నితీష‌ కుమార్ ను దెబ్బకొట్టినట్లవుతుందన్నది లాలూ ఆలోచన. అంతేకాదు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను కేసుల నుంచి బయట పడవచ్చని, జైలు నుంచి బయటకు రావచ్చన్నది ఆయన ఆలోచన. ఇలా ఈ ముగ్గురు పెద్దాయనలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమనే చెప్పాలి. మరి ఈ ముగ్గురి కోరికలు నెరవేరుతాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

No comments:

Post a Comment