Breaking News

04/04/2019

రాహుల్...కట్టడి చేయలేక సతమతం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4, (way2newstv.in)
రాహుల్ గాంధీ… ఎన్నికల సమయంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులో పెద్ద బాధ్యతలను చేపట్టిన రాహుల్ గాంధీ అనుభవమున్న కూటమి నేతలను కట్టడి చేయలేక సతమతమవుతున్నారు. పైగా తాను తీసుకున్న నిర్ణయాలతో మంచి మిత్రులను సయితం దూరం చేసుకుంటున్నారు. గాల్డ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను కూటమిలోని కొన్ని పక్షాలే తప్పుపడుతున్నాయి. ఎన్నికల ముందే రాహుల్ పట్ల కూటమి పార్టీల్లోనే వ్యతిరేకత కనపడుతోంది. కాంగ్రెస్ కు అత్యధిక స్థానాలు వస్తే తప్ప వారి ఆగ్రహం రాహుల్ పై చల్లారేటట్లు లేదు.ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడాలన్న ఆలోచనను రాహుల్ సొంత చేతులతో తుంచేశారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఎన్నికలు వస్తాయని తెలిసినా ముందుగా జాగ్రత్త పడకపోవడం ఆయన అనుభవలేమికి నిదర్శనమంటున్నారు. 


రాహుల్...కట్టడి చేయలేక సతమతం

ఉత్తరప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే అక్కడ బహజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లతో ప్రీ అలయన్స్ చర్చలకు తెరలేపలేదు. దీంతో బీఎస్పీ, ఎస్పీలు వేరుకుంపటి పెట్టుకున్నాయి.ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే మిత్రుల మధ్య సయోధ్య కుదిరింది. పశ్చిమ బెంగాల్ లోనూ మమతతో విభేదించారు. అంతేకాదు వామపక్ష పార్టీని కూడా పక్కనపెట్టేశారు. తాజాగా కేరళలో కూడా సీపీఎం రాహుల్ నిర్ణయం పట్ల గుర్రుగా ఉంది. కేరళలోని వాయనాడ్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తుండటాన్ని సీపీఎం అగ్రనేతలు ప్రకాశ్ కారత్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ తప్పుపడుతున్నారు. తాము వాయనాడ్ లో రాహుల్ ఓటమికి కృషిచేస్తామని సీపీఎం నేతలు ప్రతిన బూనారు, రాహుల్ వాయనాడ్ లో పోటీ నిర్ణయంతో సీపీఎం, కాంగ్రెస్ ల మధ్య జాతీయ స్థాయిలో విభేదాలు పొడసూపినట్లయింది.ఇక బీహార్ రాష‌్ట్రంలోనూ కూటమిని పకడ్బందీగా ఏర్పాటు చేయడంలో రాహుల్ విఫలమయ్యారంటున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్, ఆర్ఎల్ఎస్పీ వంటివి కూటమిగా ఏర్పడినా సీపీఐను దూరం చేసుకుంది. కేవలం బెగూసరాయ్ స్థానం కోసం ఆర్జేడీ పట్టుబట్టడంతో సీపీఐ కన్హయ్య కుమార్ కోసం కూటమి నుంచి వైదొలిగింది. తేజస్వియాదవ్ కు నచ్చజెప్పడంలో రాహుల్ ఎలాంటి ప్రయత్నమూ చేయకపోవడాన్ని సీపీఐ అగ్రనేతలు తప్పుపడుతున్నారు. మొత్తం మీద రాహుల్ నిర్ణయాలు కూటమిలో ఉంటాయనుకున్న పార్టీలకు చికాకును తెప్పిస్తున్నాయి.

No comments:

Post a Comment