ఏలూరు, మార్చి 26 (way2newstv.in)
ఎస్టీ రిజర్వుడు స్థానంలో ఈసారి టఫ్ ఫైట్ జరగనుంది. టీడీపీ-వైసీపీ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించేందుకు విశ్వప్రయత్నం చేస్తుండగా జనసేన చీల్చే ఓట్లు వీరి విజయవకాశాలను నిర్ణయించనుంది. ఇక్కడ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ను కాదని ఈ సారి బొరగం శ్రీనివాస్‌కు చంద్రబాబు టికెట్ ఇవ్వడంతో స్థానిక టీడీపీలో మొదట చీలిక ఏర్పడింది. అసమ్మతి జ్వాలలు ఎగిసినా అధినేత జోక్యంతో మొడియం వెనక్కి తగ్గి అలక వీడి బొరగంకు మద్దతు పలికారు. ఇప్పుడు ఇద్దరు కలిసే ప్రచారం సాగిస్తుండటం కొద్దిలో కొద్దిగా ఆ పార్టీకి కలసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఇక వైసీపీ నుంచి తెల్లం బాలరాజు బరిలో నిలిచారు. ఇక అదే పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ చిర్రి బాలరాజు కొద్దిరోజుల క్రితం జనసేనలోకి జంప్ అయ్యారు.ఆ పార్టీ నుంచి టికెట్ దక్కించుకుని విజయాన్ని సొంతం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. అయితే జనసేనకు చెప్పుకోదగిన స్థాయిలో పార్టీకి పునాదులు లేకపోవడం మైనస్‌గామారింది. ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీల మధ్యే కొనసాగుతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఇక నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ 2లక్షల 38వేలకు పైగా ఓటర్లు ఉన్నారు.
ట్రయాంగిల్ ఫైట్ లో జగన్ కు ప్లస్ కానుందా
కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను విలీనం చేయడంతో అతిపెద్ద నియోజకవర్గంగా ఆవిర్భవించింది. ఏజెన్సీ ప్రాంతమే ఎక్కువగా ఉండటం గమనార్హం. పోలవరం పుట్టుక నాటి నుంచి ఈ ప్రాంతం యొక్క పరిస్థితులు, స్థానిక స్థితిగతులపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.ఇక అభ్యర్థుల బలాబలాల విషయానికి వస్తే వైసీపీ నుంచి బరిలో ఉన్న తెల్లం బాలరాజు గతంలో హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. టీడీపీ నుంచి తొలిసారిగా బరిలోకి దిగిన బొరగం గతంలో పీఆర్పీ నుంచి పోటీ చేసి భారీ సంఖ్యలోనే ఓట్లను కొల్లగొట్టారు. ఇక చిర్రి బాలరాజు కూడా నియోజకవర్గంపై మంచి పట్టు ఉన్న నేతగా చెప్పుకోవాలి. అయితే తెల్లం బాలరాజు- బొరగం శ్రీనివాసులు దాదాపు మూడు సంవత్సరాలుగా చాప కిందనీరులా నియోజకవర్గంలో తమ వర్గాన్ని పెంచుకుంటూ వచ్చారు. ముఖ్యంగా బొరగం ఈ విషయంలో విజయం సాధించారనే చెప్పాలి. ఆయనకు సామాజిక వర్గాల వారీతో మంచి సంబంధాలున్నాయి.అభ్యర్థులు ముగ్గురు కూడా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు కావడంతో వారికి స్థానిక ఓటు బ్యాంకు గట్టిగా ఉంటుందని తెలుస్తోంది. బొరగం పోలవరం మండలానికి చెందినవాడు కాగా, తెల్లం బాలరాజుది బుట్టయాగూడెం, చిర్రి బాలరాజు జీలుగుమిల్లి మండలవాసి. మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాస్ కుమార్తె కాంచనమాల టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఆమె రెబల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆమె నామినేషన్ ఉపసంహరిచుకుంటేనే టీడీపీకి ఇంటి పోరు తప్పుతుంది.. లేదంటే ఇబ్బందులు తప్పవు.
No comments:
Post a Comment