హైద్రాబాద్ జూలై 3, (way2newstv.in)
అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ నిషేద దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నాడు హైదరాబాద్‌లో విస్తృత కార్యక్రమాలను జీహెచ్ఎంసీ చేపట్టనుంది. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ భూమిలో కలిసిపోవడానికి 500 నుండి వెయ్యి సంవత్సరాల సమయం పడుతుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతిరోజు కోటికి పైగా ప్లాస్టిక్ బ్యాగ్‌లను ఉపయోగిస్తున్నారు. సంవత్సరానికి 360కోట్ల ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించడం, వీటిలో అధిక శాతం ఒకేసారి ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు ఉండడం నగరంలో పర్యావరణానికి పెను ముప్పుగా మారుతోంది. ఈ ప్లాస్టిక్ కవర్లవల్లే నాలాల్లో మురుగునీరు ప్రవాహన్ని నిరోదించడం తద్వారా రోడ్లపై మురుగునీరు పొంగడం సాధారనంగా మారింది. కేవలం ప్లాస్టిక్ కవర్లు మురుగునీరు పైప్‌లైన్‌లో చేరడంతో మైండ్‌స్పేస్ జంక్షన్ వద్ద రెండు రోజుల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో మొత్తం పైప్‌లైన్‌ను తీసి బాక్స్ డ్రైన్ నిర్మాణాన్ని రూ. 7కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ చేపట్టింది. ఇలా ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగాను జీవన విధానానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్‌ల నిషేద దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరవాసులను పెద్ద ఎత్తున చైతన్యపరిచేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్ నగరంలో 7,659 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని, వీటిలో ఉన్న దాదాపు 10లక్షల మంది విద్యార్థినీవిద్యార్థులకు ప్లాస్టిక్ నిషేదం, దోమల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చైతన్య, అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టనున్నారు.
ప్లాస్టిక్ నిషేదంపై జీహెచ్ఎంసీ చే పలు చైతన్య కార్యక్రమాలు
స్వచ్ఛ విద్యార్థిగా ఉండాలంటే ఏం చేయాలి...?
స్వచ్ఛ విద్యార్థిగా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశంపై నగరంలోని ప్రతి పాఠశాలను మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటి, జోనల్ కమిషనర్లు రేపటి నుండి సందర్శిస్తారు. ముఖ్యంగా ప్రార్థన నిర్వహించే సమయంలో విద్యార్థీనివిద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి ప్లాస్టిక్ వకర్ల వాడకం ద్వారా ఎదరయ్యే ప్రమాదాలు, తలెత్తే ఆరోగ్యపరమైన సమస్యలు, దోమల వ్యాప్తి తదితర అంశాలను వివరిస్తారు. ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించకుండా వాటి స్థానంలో చేతి సంచులను ఉపయోగించడం ద్వారా స్వచ్ఛ విద్యార్థిగా మారుతానని తెలుపుతూ సంతకాలు సేకరిస్తారు. ఒకేసారి ఉపయోగించే ప్లాస్టిక్ బ్యాగ్‌లు, పెట్‌బాటిళ్లు, ప్లాస్టిక్ స్ట్రాలు, డిస్పోసబుల్ ప్లాస్టిక్ వాటర్ గ్లాసులు, స్పూన్లు, టీ కప్పులు, ప్లాస్టిక్ బాటిళ్లను పూర్తిగా నిషేదిస్తున్నామని తెలిపే హామీ పత్రాన్ని విద్యార్థుల నుండి జీహెచ్ఎంసీ అధికారులు స్వీకరించనున్నారు.
మార్కెట్లు, రైతు బజార్లలో ప్రత్యేక ప్రచారం
50 మైక్రాన్లకన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా వాడకాన్ని నిలిపివేయాలని కోరుతూ మార్కెట్లు, రైతు బజార్లతో పాటు పార్కులు, మాల్స్ వద్ద ప్రత్యేకంగా ప్లాస్టిక్ సఫకేషన్ (ప్లాస్టిక్ బ్యాగ్‌తో పూర్తిగా కప్పివేయడం) ప్రచారాన్ని జీమెచ్ఎంసీ సిబ్బంది చేపట్టనున్నారు. ముఖ్యంగా వీక్లీ మార్కెట్లు, రైతుబజార్లలో ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్, జూట్ బ్యాగ్‌లను ఉపయోగించాలని చైతన్యపర్చనున్నారు.
బల్దియా కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం
జీహెచ్ఎంసీకి చెందిన జోనల్, సర్కిల్ కార్యాలయాలన్నింటిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్లుగా ప్రకటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. తమ కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదాన్ని తెలిపే స్టిక్కర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీచేశారు. ఒకేసారి ఉపయోగించే ప్లాస్టిక్ బ్యాగ్‌లు, పెట్‌బాటిళ్లు, ప్లాస్టిక్ స్ట్రాలు, డిస్పోసబుల్ ప్లాస్టిక్ వాటర్ గ్లాసులు, స్పూన్లు, టీ కప్పులు, ప్లాస్టిక్ బాటిళ్లను కార్యాలయాల్లో పూర్తిగా నిషేదించాలని, ఈ విషయంలో హైదరాబాద్ నగరాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత నగరంగా రూపొందించడంలో కృషి చేస్తామని తెలుపుతూ ప్రతిఒక్కరితో ప్రతిజ్ఞ నిర్వహించాలని కమిషనర్ తెలిపారు.
No comments:
Post a Comment